టీఆర్ఎస్‌కు వివేక్ రాజీనామా..! కాంగ్రెస్‌లోకా..? బీజేపీలోకా..?

కాంగ్రెస్ పార్టీలో.. ఏఐసిసి స్థాయిలో పని చేసిన నేతల్లో ఒకరు గడ్డం వెంకటస్వామి. ఆయనకు కాంగ్రెస్ తప్ప మరో పార్టీ తెలియదు. కానీ ఆయన కుమారులు .. కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య చక్కర్లు కొడుతున్నారు. చివరికి ఏ పార్టీకీ కాకుండా పోయే పరిస్థితికి వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో వెంకటస్వామి పెద్ద కుమారుడు.. మాజీ మంత్రి వినోద్‌కు.. టీఆర్ఎస్ పెద్దలు టిక్కెట్ నిరాకరిస్తే.. పార్లమెంట్ ఎన్నికల్లో తమ్ముడు వివేక్‌కు.. ఆ ట్రీట్‌మెంట్ ఇచ్చారు. టిక్కెట్ హామీతోనే తనను .. పార్టీలో చేర్చుకున్నారు కాబట్టి.. కేసీఆర్ మాట తప్పరని.. ధీమాగా ఉన్న వివేక్‌కు.. అసలు విషయం తెలిసే సరికి.. జరగాల్సిందంతా జరిగిపోయింది.

సీఎం కేసీఆర్‌ తనను నమ్మించి గొంతు కోశారని, చివరి వరకూ టిక్కెట్‌ ఇస్తానని చెప్పి నమ్మక ద్రోహం చేశారని మాజీ ఎంపీ జి.వివేక్‌ ఆవేదన చెందుతున్నారు. ఇంత అన్యాయం చేస్తారని కలలో కూడా ఊహించలేదని మథనపడుతున్నారు. టీఆర్ఎస్‌కు రాజీనామా చేసి.. అనుచరులతో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. కేసీఆర్‌ పిలిస్తేనే టీఆర్‌ఎస్‌లో చేరానని, అప్పుడే పెద్దపల్లి టికెట్‌ ఇస్తానని మాటిచ్చారని తెలిపారు. పెద్దపల్లికి కాకా పేరు పెట్టాలని అడిగినందుకే తనకు టికెట్‌ ఇవ్వలేదని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేయడంతో బానిసత్వం పోయి స్వాతంత్య్రం వచ్చినట్లుందని అంటున్నారు.

వివేక్.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. కేసీఆర్ టిక్కెట్ ఇస్తారని ప్రచారం కోసం ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్పటికీ ఆయన పోటీ చేయాలనే ఆలోచనలోనే ఉన్నారు. ఆయన పోటీ చేస్తానంటే.. అటు కాంగ్రెస్ టిక్కెట్ ఇస్తుంది. ఇటు బీజేపీ.. టిక్కెట్ తోపాటు.. ఎన్నికల నిధులు కూడా సర్దుబాటు చేస్తామని హామీ ఇస్తుంది. బీజేపీ… ఇప్పుడు.. ఎవరు దొరుకుతారా అని ఎదురు చూస్తోంది. రాబోయేది మా ప్రభుత్వమేనని చెబుతూ… ఓడిపోయినా పదవులు ఉంటాయని..ఆశ పెడుతున్నారు. నామినేషన్‌కు ఇంక ఒక్క రోజు మాత్రమే ఉంది. ఈ సమయంలోనే.. వివేక్.. నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. లేకపోతే.. ఈ ఎన్నికలకు దూరం అయినట్లే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com