ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు తీరాన్ని ఐటీ హబ్‌గా మలిచే పెద్ద ప్రాజెక్టులు పట్టాలెక్కాయి. దిగ్గజ అమెరికన్ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ విశాఖపట్నంలో తన కార్యకలాపాలను అధికారికంగా ప్రారంభించడంతో ఈ ప్రాంతంలో ఐటీ రంగానికి రెక్కలు వచ్చినట్లయింది. రాష్ట్ర ప్రభుత్వం అందించిన అసాధారణ సహకారంతో ఈ కంపెనీ రూ. 1,582.98 కోట్ల పెట్టుబడి పెట్టి, దశలవారీగా 8,000 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. ఇది కేవలం ఒక కంపెనీకు మాత్రమే కాకుండా, విశాఖను దేశంలోని ప్రముఖ ఐటీ క్లస్టర్‌గా ఎదగడానికి మరో మైలురాయిగా నిలుస్తోంది.
కార్యకలాపాలు ప్రారంభం
రుషికొండ ఐటీ పార్కు హిల్-2లోని మూడు అంతస్థుల మహతి భవనంలో కాగ్నిజెంట్ ఆఫీస్ ప్రారంభమయింది. ఈ భవనాన్ని తాత్కాలిక కార్యాలయంగా అద్దెకు తీసుకున్న కాగ్నిజెంట్, ఇక్కడ 800 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు నడిపిస్తుంది. అలాగే కాపులుప్పాడలో కేటాయించిన 21.31 ఎకరాల భూమిపై కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ నిర్మాణం కూడా ప్రారంభమయింది. కాగ్నిజెంట్ తన విశాఖ క్యాంపస్‌ను 2029 మార్చి నాటికి పూర్తి స్థాయిలో నడిపించనుంది. ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం 8,000 ఉద్యోగాలు కల్పిస్తారు.
మరో ఏడు కంపెనీలు రెడీ
కాగ్నిజెంట్‌తో పాటు మరో ఏడు ఐటీ కంపెనీలు తమ కార్యాలయాల నిర్మాణాలను ప్రారంభిస్తున్నాయి. సత్వ కంపెనీ ఇంటిగ్రేటెడ్ ఐటీ పార్కు నిర్మిస్తోంది, ఇందులో ఐటీ టవర్లతో పాటు రెసిడెన్షియల్ ప్లాట్లు, రెస్టారెంట్లు, హోటళ్లు కూడా ఉంటాయి. ఇమ్మాజినోటివ్, ఫ్లూయెంట్ గ్రిడ్ సంస్థలు మెగా ఐటీ పార్కులు ఏర్పాటు చేస్తున్నాయి. అలాగే, నాన్రెల్ టెక్నాలజీస్, ఏసీఎన్ ఇన్ఫోటెక్, మదర్సన్ టెక్నాలజీస్, క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ వంటి కంపెనీలు కూడా భారీ పెట్టుబడులు పెట్టి, వేలాది ఉద్యోగాలు సృష్టించనున్నాయి. ఈ అన్ని ప్రాజెక్టులు కలిసి విశాఖలో 20,000కి పైగా ఉద్యోగాలు కల్పిస్తాయి.
గూగుల్ ఏఐ హబ్ శంకుస్థాపన తర్వాత మరో చరిత్ర
విశాఖపట్నం ఐటీ రంగంలో హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలతో పోటీ పడగల స్థాయికి చేరుకుంటుందని ప్రభుత్వం నమ్మకంగా ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లతో యువతకు అవకాశాలు కల్పించేలా ప్రయత్నిస్తన్నారు. ఈ ఐటీ బూమ్‌తో రాష్ట్ర జీడీపీలో 15% వృద్ధి రావచ్చు. స్థానిక విశ్వవిద్యాలయాలు, ఐటీ ట్రైనింగ్ సెంటర్లు ఈ డిమాండ్‌కు తగ్గట్టు కోర్సులు పెంచుతున్నాయి. గూగుల్ ఏఐ హబ్ శంకుస్థాపన తర్వాత ఇక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే ఉండదని అంచనా వేస్తున్నారు
