ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు విశాఖ సిద్ధమవుతోంది. భారతదేశ పారిశ్రామిక వ్యవస్థలో ముఖ్యమైన స్థానం కలిగిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ పార్టనర్షిప్ సమ్మిట్ 2025 30వ ఎడిషన్ ఇది. నవంబర్ 14, 15 తేదీల్లో ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్‌లో ‘టెక్నాలజీ, ట్రస్ట్ అండ్ ట్రేడ్’ అనే థీమ్‌తో జరిగుతోంది. ఈ కార్యక్రమానికి 40కి పైగా దేశాల నుంచి 3,000 మంది ప్రతినిధులు, ప్రపంచవ్యాప్తంగా 400కి పైగా అంతర్జాతీయ అతిథులు, 11 మంది విదేశీ మంత్రులు, 30 మంది గ్లోబల్ స్పీకర్లు పాల్గొంటారు.
10 లక్షల కోట్ల పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యం
భారత ఉపరాష్ట్రపతి ఈ సమ్మిట్ ను ప్రారంభించనున్నారు. ఈ సమ్మిట్ ద్వారా రాష్ట్రంలో 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పది లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలపై ఇప్పటికే ప్రాథమికంగా నారా లోకేష్ ఆయా పారిశ్రామిక వేత్తలతో చర్చించారు. కేవలం ఎంవోయూలు కాకుండా..నేరుగా ఎగ్జిక్యూషన్.. భూకేటాయింపులు సహా పలు రాయితీలు కూడా అక్కడే ప్రకటించి ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది.
సమ్మిట్ సందర్భంగా 112 పరిశ్రమలు ప్రారంభిస్తారు, 410 MoUలు జరుగుతాయి. ఇవి టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, మాన్యుఫాక్చరింగ్, గ్లోబల్ ట్రేడ్, MSMEలు, సన్‌రైజ్ సెక్టర్లు, AI ఆధారిత గ్రోత్ వంటి రంగాల్లో ఉంటాయి. అమరావతి పెట్టుబడి అవకాశాలు, GCC & ఆఫీస్ స్పేస్ ఇన్వెస్ట్మెంట్లు ప్రదర్శిస్తారు. B2B, B2G మీటింగ్‌లు, సెక్టార్-స్పెసిఫిక్ ఎగ్జిబిషన్లు, రోడ్‌షోలు జరుగుతాయి.
పారిశ్రామిక వేత్తల మేథోమథనం
సమ్మిట్‌లో 48 కీలక సెషన్లు, 37 ప్లెనరీ సెషన్లు జరగనున్నాయి. మొదటి రోజు ‘రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అండ్ వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్’ వంటి అంశాలపై చర్చలు, రెండో రోజు ‘క్లైమేట్ రిస్క్స్ ఫర్ ఇండియన్ బిజినెస్‌లు’ మొదలైనవి. వాలెడిక్టరీ సెషన్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ గోయల్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సీఐఐ వైస్ ప్రెసిడెంట్ సుచిత్రా కె. ఎల్లా, చైర్మన్ ఆర్. దినేష్, డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పాల్గొంటారు.
సుందరంగా ముస్తాబయిన విశాఖ
సమ్మిట్‌కు సంబంధించి విశాఖపట్నం పూర్తిస్థాయిలో సుందరంగా సిద్ధమయింది. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ నేతృత్వంలో 60 కోట్ల రూపాయలతో పనులు చేపట్టారు. ప్రత్యేకంగా, ఈ సమ్మిట్‌ను ‘జీరో వేస్ట్ మోడల్’గా జరపనున్నారు. స్వచ్ఛా ఆంధ్రా కార్పొరేషన్, జీవీఎంసీ, సీఐఐ సంయుక్తంగా సర్వత్ర ఎకో-ఫ్రెండ్లీ మెటీరియల్స్ ఉపయోగించి, 100% వస్తువులను రీసైకిల్ చేస్తారు. ప్రోటోకాల్ విషయంలో, అతిథులకు గ్రీన్ రూమ్స్, బోర్డ్రూమ్స్, బ్యాక్ ఆఫీసులు సిద్ధం చేస్తున్నారు. కలెక్టరేట్లో 24×7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ ఈజ్ ఆఫ్ డుయింగ్ బిజినెస్‌లో దేశంలో మొదటి స్థానంలో ఉంది. GST సంస్కరణలతో ఆటోమొబైల్స్, ఫార్మా, రెన్యూవబుల్స్, ఫిషింగ్, డెయిరీ, ఆటో ఇండస్ట్రీలు పుంజుకున్నాయి. ఈ సమ్మిట్ రాష్ట్ర ఎగుమతి పొటెన్షియల్‌ను పెంచుతుందని నమ్మకంగా ఉన్నారు.


