ఉత్తరాంధ్ర వాసుల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన హామీల్లో అత్యంత కీలకమైన విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలకు ముహూర్తం ఖరారైంది. 2019లో ప్రకటించినప్పటికీ పలు సాంకేతిక కారణాలతో ఆలస్యమైన రైల్వే జోన్ ప్రాజెక్ట్ ప్రస్తుతం శరవేగంగా అడుగులు వేస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఏప్రిల్ 1, 2026 నుంచి ఈ జోన్ పూర్తిస్థాయిలో తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. శాశ్వత భవన నిర్మాణం ముడసర్లోవలో జరుగుతుండగా, అప్పటివరకు పరిపాలనా పనుల కోసం సిరిపురం జంక్షన్ వద్ద ఉన్న ఐకానిక్ భవనం ది డెక్ సిద్ధమైంది.
ది డెక్ : షిప్ ఆకారంలో అద్భుత నిర్మాణం
విశాఖ నగర నడిబొడ్డున సిరిపురం జంక్షన్లో నిర్మించిన ది డెక్ భవనం ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ సుమారు రూ. 80 కోట్లకు పైగా వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ భవనాన్ని నిర్మించింది. క్రూయిజ్ షిప్ ఆకారంలో ఉండే ఈ 12 అంతస్తుల భవనం, విశాఖ సముద్ర తీరానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇందులో సుమారు 41,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న 6 , 7 అంతస్తులను రైల్వే జోన్ తాత్కాలిక ప్రధాన కార్యాలయం కోసం కేటాయించారు. ఇక్కడ నుంచి సుమారు 30 మంది ఉన్నతాధికారులు, 700 మందికి పైగా సిబ్బంది విధులు నిర్వహించనున్నారు.
రాజకీయ వ్యూహాలు.. విభజన కష్టాలు
రైల్వే జోన్ ఏర్పాటు కేవలం పరిపాలనాపరమైన నిర్ణయం మాత్రమే కాదు, దీని వెనుక బలమైన రాజకీయ సమీకరణాలు ఉన్నాయి. గత ఆరేళ్లుగా గెజిట్ నోటిఫికేషన్ రాకపోవడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించినా, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవలే లోక్‌సభలో క్లారిటీ ఇవ్వడంతో అడ్డంకులు తొలగిపోయాయి. ముఖ్యంగా వాల్తేర్ డివిజన్ విభజన, రాయగడలో కొత్త డివిజన్ ఏర్పాటు వంటి అంశాలపై ఒడిశా , ఆంధ్రప్రదేశ్ మధ్య ఉన్న చిన్నపాటి వివాదాలను కేంద్రం సర్దుబాటు చేసింది. ఏప్రిల్ 1ని అపాయింటెడ్ డే గా ప్రకటించడం లాంఛనమే.
రైల్వేజోన్‌తో ఎన్నో ప్రయోజనాలు
దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లతో పాటు కొత్తగా ఏర్పడిన విశాఖ డివిజన్ రానున్నాయి. ఈ కొత్త జోన్ వల్ల సుమారు 17,000 మంది ఉద్యోగులు విధుల్లో చేరనున్నారు. కేవలం పరిపాలనే కాకుండా, కొత్త రైళ్ల మంజూరు, ప్లాట్‌ఫారమ్‌ల విస్తరణ, రవాణా రంగంలో అభివృద్ధికి ఇది మార్గం సుగమం చేస్తుంది. ముడసర్లోవలో రూ. 149 కోట్లతో నిర్మిస్తున్న శాశ్వత కార్యాలయం 2026 చివరి నాటికి అందుబాటులోకి వస్తే, విశాఖపట్నం దేశంలోనే అతిపెద్ద రైల్వే హబ్‌లలో ఒకటిగా నిలుస్తుంది.

