స్టీల్ ప్లాంట్ పై అవసరం లేకపోయినా ప్రైవేటీకరణ ప్రచారం చేస్తున్నవారికి ఇది బ్యాడ్ న్యూసే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి కృషితో విశాఖ స్టీల్ ప్లాంట్ తిరిగి పూర్వవైభవాన్ని సంతరించుకుంటోంది. ఈ భారీ పరిశ్రమ 2026 జనవరి నెలలో రూ. 54 కోట్ల నికర లాభాన్ని గడించి లాభాల బాట పట్టింది. ఏడాదిన్నర కాలంలోనే ప్లాంట్ పనితీరులో వచ్చిన ఈ మార్పు పారిశ్రామిక వర్గాల్లో సంచలనంగా మారింది.
ఒకప్పుడు కేవలం 45 శాతం సామర్థ్యంతో మాత్రమే ఉత్పత్తి ఉన్న ఈ ఉక్కు కర్మాగారం, ఇప్పుడు ఏకంగా 94 శాతం కెపాసిటీ యుటిలైజేషన్కు చేరుకుంది. ప్రస్తుతం ప్లాంట్లోని మూడు బ్లాస్ట్ ఫర్నెస్ లు పూర్తిస్థాయిలో పనిచేస్తుండటంతో రోజుకు సగటున 19,401 టన్నుల హాట్ మెటల్ ఉత్పత్తి జరుగుతోంది. 2024-25 రెండో త్రైమాసికంలో కేవలం 9,215 టన్నుల ఉత్పత్తికే పరిమితమైన ప్లాంట్, నేడు రెట్టింపు ప్రగతిని సాధించడం అధికారుల మరియు కార్మికుల సమిష్టి కృషికి నిదర్శనంగా నిలిచింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలతో కేంద్ర ప్రభుత్వం అందించిన రూ. 11,440 కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ ప్లాంట్ను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించడంలో కీలక పాత్ర పోషించింది. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బకాయిలు, పన్నులు, నీటి సరఫరా వంటి అంశాల్లో రాయితీలు ఇస్తూ అండగా నిలవడంతో ప్రస్తుతం ఆర్ఐఎన్ఎల్ క్రెడిట్ రేటింగ్ కూడా మెరుగుపడింది. గతంలో నెలకు వందల కోట్ల నష్టాలను చవిచూసిన సంస్థ, ఇప్పుడు స్థిరమైన లాభాల దిశగా పయనిస్తుండటం అందర్నీ సంతోషపరుస్తోంది.
స్టీల్ ప్లాంట్ పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సింగరేణి సంస్థను ఏ విధంగా సంస్కరణలతో బలోపేతం చేశామో, అదే రీతిలో విశాఖ ఉక్కును కూడా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. అన్ని విభాగాల్లో నూతన విధానాలను ప్రవేశపెట్టి సంస్థను మరింత లాభాల్లోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. కార్మికులు, యాజమాన్యం ,ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తే విశాఖ ఉక్కు ఆంధ్రుల గర్వకారణంగా ఉంటుందన్నారు.
స్టీల్ ప్లాంట్ పేరుతో పని చేయకుండా రాజకీయాలు చేస్తూ ఉత్పత్తిని దెబ్బతీసేవారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ లాభాల బాటలో ఉంటేనే…. కార్మికులు, ఉద్యోగాలకు మేలు అన్న సంగతిని మర్చిపోకుండా ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది.
