ఉత్తరాంధ్ర ముఖచిత్రం వేగంగా మారుతోంది. విశాఖపట్నం ఐటీ , పారిశ్రామిక కేంద్రంగా విస్తరిస్తుండగా, దానికి ఆనుకుని ఉన్న విజయనగరం జిల్లా ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో రెండో హాట్‌స్పాట్ గా అవతరించింది. ముఖ్యంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు 90 శాతానికి పైగా పూర్తి కావడమే కాకుండా, 2026 జూన్ నాటికి కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభం కానుండటంతో ఇక్కడి భూముల ధరలకు రెక్కలొచ్చాయి.
వలం పెట్టుబడిదారులే కాకుండా, విశాఖలో ఇళ్లు కొనలేని మధ్యతరగతి ప్రజలు కూడా విజయనగరం వైపు మొగ్గు చూపుతున్నారు. విజయనగరం – విశాఖపట్నం మధ్య ఉన్న అనుసంధానత ఈ బూమ్‌కు ప్రధాన కారణం. విశాఖలోని మధురవాడ ఐటీ సెజ్ నుంచి విజయనగరం కేవలం 40 కిలోమీటర్ల దూరంలోనే ఉండటం, విశాఖ-రాయ్‌పూర్ జాతీయ రహదారి విస్తరణ పనులు వేగవంతం కావడంతో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గింది.
గంకలాం, నెల్లిమర్ల, చొట్టవలస వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్లు వెలుస్తున్నాయి. విశాఖ నగర శివార్లలో గజం ధర రూ. 30,000 దాటగా, విజయనగరం పరిసరాల్లో ఇప్పటికీ రూ. 10,000 నుండి రూ. 15,000 మధ్య లభిస్తుండటం కొనుగోలుదారులను ఆకర్షిస్తోంది. మౌలిక సదుపాయాల పరంగా కూడా జిల్లా వేగంగా అభివృద్ధి చెందుతోంది. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు అనుబంధంగా ఏవియేషన్ సిటీ, లాజిస్టిక్స్ హబ్‌లు ఏర్పాటు కానుండటం వల్ల రాబోయే రోజుల్లో వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
బీచ్ కారిడార్ రోడ్డు నిర్మాణం పూర్తయితే విజయనగరం నుండి విశాఖకు తీరం వెంబడి ప్రయాణం మరింత సులభతరం కానుంది. భవిష్యత్తులో ఈ రెండు నగరాలు జంట నగరాలుగా మారే అవకాశం ఉందన్న అంచనాలు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మరింత ఊతాన్నిస్తున్నాయి.