రాజకీయాల్లో దమ్ముంటే అనే పదం కామన్. ఇద్దరు నేతలు ఎదురెదురు పడితే ఆలింగనం చేసుకుంటారు కానీ.. విడివిడిగా మీడియా ముందు మాత్రం తోడలు కొట్టి సవాళ్లు చేసుకుంటారు. ఇలాంటి ఎపిసోడ్లు సాధారణంగా రాజకీయంగా యాక్టివ్ గా ఉన్న వారి మధ్య సాగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు రిటైరైపోయిన వాళ్ల మధ్య కూడా జరుగుతున్నాయి. ఉండవల్లి అరుణ్ కుమార్, సోము వీర్రాజు.. చర్చలకు సిద్ధం అంటూ పరస్పర సవాళ్లు విసురుకుంటున్నారు.
ఇటీవల ఉపరాష్ట్రపతి ఎన్నికల గురించి ఉండవల్లి రెండు, మూడు ప్రెస్ మీట్లు పెట్టారు. ఆ సమయంలో ఆయన ఆర్ఎస్ఎస్పై విమర్శలు చేశారు. దీంతో ఎమ్మెల్సీగా ఉన్న సోము వీర్రాజుకు కోపం వచ్చింది. ఉండవల్లిపై మండిపడ్డారు. దమ్ముంటే చర్చకు రావాలన్నారు. అసలే ఖాళీగా ఉన్న ఉండవల్లి అరుణ్‌కుమార్ కు.. ఇలాంటి టైంపాస్ అవకాశం వస్తే అసలు వదిలి పెట్టరు కదా. వెంటనే రియాక్ట్ ్య్యారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు సవాల్ ను స్వీకరిస్తున్నట్లుగా ప్రకటించారు.
టైం, ప్లేస్ చెబితే బహిరంగ చర్చకు వస్తానని ..రాజమండ్రి సుబ్రహ్మణ్యం మైదానం, లేదా మీడియా సమక్షంలో బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. మొదటి నుంచి బీజేపీలో ఉన్న సోము వీర్రాజుకు అన్ని విషయాలు కచ్చితంగా తెలుసని.. నేను ఆర్ఎస్ఎస్ విధానాలను ఎందుకు వ్యతిరేకిస్తానో బహిరంగ చర్చలో చెబుతానని ప్రకటించారు. ఈ బహిరంగ చర్చ ద్వారా ఆర్ఎస్ఎస్ గురించి తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు అన్ని విషయాలు తెలుస్తాయి.. సోము వీర్రాజు వెనుకడుగు వేయకుండా రావాలని సవాల్ చేశారు.
ఉండవల్లి లాయర్.. ఆయన బాగా మాట్లాడతారు. ఎదుటి వారిని కన్ ఫ్యూచ్ చేయడంలో దిట్ట. సోము వీర్రాజు సరిపోడు. ఆయన ఆరెస్సెస్ విషయంలో చర్చ పెడితే.. ఉండవల్లి అడ్వాంటేజ్ తీసుకుంటారు. అందుకే సోము వీర్రాజు సైలెంటయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.