మాస్ కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్స్గా నిలిచిన దర్శకుడు వి.వి.వినాయక్. అగ్ర హీరోలందరితోనూ పని చేశారు. హిట్లు కొట్టారు. కొంతకాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఆరోగ్యం కూడా సరిగా లేకపోవడంతో బ్రేక్ తీసుకోవాల్సివచ్చింది. ఇప్పుడు ఆయన కోలుకొన్నారు. మళ్లీ మెగాఫోన్ పట్టాలన్న ఉత్సాహం చూపిస్తున్నారు. వెంకటేష్ తో వినాయక్ ఓ సినిమా చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఆకుల శివ వెంకటేష్ కోసం ఓ కథ తయారు చేశారని తెలుస్తోంది. అది వెంకటేష్ కి నచ్చిందని, ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్తుందని సమాచారం. నల్లమలపు బుజ్జీ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉంది. వీళ్ల కాంబోలో ఇది వరకు ‘లక్ష్మి’ వచ్చింది. అందులో ఫ్యామిలీ డ్రామాతో పాటు ఫన్ కూడా బాగా వర్కవుట్ అయ్యింది. ఈసారీ అదే ఫార్మెట్ లో కథ రాసుకొన్నార్ట.
వినాయక్ కి మాస్ పల్స్ బాగా తెలుసు. హీరోల అభిమానుల్ని దృష్టిలో ఉంచుకొని కథలు రాసుకొంటారు. అయితే వినాయక్ స్టైల్ కీ, ఇప్పటి మాస్ యాక్షన్ సినిమాలకూ చాలా తేడా ఉంది. ఇప్పుడు ఫార్మెట్ పూర్తిగా మారిపోయింది. ఆ మార్పుని వినాయక్ ఎంత వరకూ అర్థం చేసుకొంటాడన్నది చాలా కీలకం. అయితే వినాయక్ మార్క్ సినిమాలు చూసే జనం ఇప్పటికీ ఉన్నారు. అభిమానులకు ఎలివేషన్లే కావాలనుకొంటే.. వినాయక్ అవి అందివ్వగలడు కూడా. కాకపోతే.. వాటికి కాస్త మోడ్రన్ టచ్ ఇస్తే సరిపోతుంది. ఏదేమైనా వినాయక్ మళ్లీ మెగాఫోన్ పడితే.. ఆ సౌండ్ దద్దరిల్లిపోవాలి. తన మార్క్ ఏమిటో.. మళ్లీ చూపించాలి. అలాంటి సినిమాతోనే వినాయక్ రీ ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు ఆశిస్తున్నారు. మరి వెంకీ కోసం రాసుకొన్న కథలో ఆ అంశాలు ఏ మేరకు ఉన్నాయో చూడాలి.
వెంకటేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ తో ఓ సినిమా చేస్తున్నారు. చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబోలో రూపొందుతున్న సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. దృశ్యమ్ 3 కూడా రెడీగా ఉంది. వీటి మధ్యలో వినాయక్ కి ఆయన డేట్లు ఇవ్వాల్సి ఉంటుంది.