గుజరాత్ లోని ధొలేరా పారిశ్రామిక నగర అభివృద్ధి గురించి ఆంధ్రాలో భాజపా ప్రచారం మొదలుపెట్టేసింది..! అక్కడో అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది అన్నట్టుగా ఏపీలోని ప్రధాన పత్రికలైన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలో నేడు కేంద్రం ప్రకటనలు ఇవ్వడాన్ని ఏమనుకోవాలి..? పుండుమీద కారం చల్లడానికేగా ఇలాంటి పనులు..! ఇది చాలదన్నట్టుగా ధొలేరాతో అమరావతికి పోలిక ఏంటని భాజపా నేత జీవీఎల్ నిన్ననే ప్రశ్నించారు. అంతేకాదు.. ఈ మధ్య, అమరావతికి 33 వేల ఎకరాల భూమి అవసరమా అంటూ భాజపాతోపాటు, ఆ పార్టీకి మద్దతు పలికే ఇతర నాయకులు కూడా విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. రాజధానితోపాటు, పారిశ్రామిక నగరంగా అమరావతిని అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి విజన్ ను తప్పుబడుతున్నారు. ఈ క్రమంలో ఆంధ్రా రాజధానికి కేంద్రం ఎందుకు సాయం చేయడం లేదన్న ప్రశ్నను విస్మరిస్తున్నారు. ఈ సో కాల్డ్ నేతలంతా ధొలేరా నిర్మాణం గురించి తెలుసుకుంటే… అమరావతికి జరుగుతున్న అన్యాయం అర్థమౌతుంది.
ఢిల్లీ-ముంబై పారిశ్రామిక కారిడార్ లో భాగంగానే గుజరాత్ లోని ధొలేరా నిర్మాణం జరుగుతోంది. 2.2 లక్షల ఎకరాల్లో ఈ నగరం విస్తరించబోతోంది. దీన్లో 5,600 ఎకరాలు కోర్ ఏరియా. రాజధాని అహ్మదాబాద్ తో 10 లేన్ల ఎక్స్ ప్రెస్ రహదారులు నిర్మించబోతున్నారు. నిజానికి, గుజరాత్ కి మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ధొలేరా ప్రారంభమైంది. నగర నిర్మాణానికి అనుకూలంగా ప్రత్యేక పెట్టుబడుల ప్రాంత చట్టం 2009ను తీసుకొచ్చారు. ప్రాజెక్టును అమలు చేయడానికి స్పెషల్ పర్పస్ వెహికల్ ను కూడా ఏర్పాటు చేశారు. అయితే, 2007లోనే ఈ ప్రాజెక్టు ప్రకటించినా… పనులు వేగవంతంగా ముందుకు సాగలేదు. మోడీ ప్రధాని అయిన దగ్గర నుంచీ నిర్మాణం ఊపందుకుంది. కేంద్రం రూ. 2,784 కోట్లు నిధులు పెట్టుబడిగా ఇచ్చింది. వివిధ అంతర్జాతీయ సంస్థల ద్వారా పెట్టుబడులను ఆకర్షించడంలోనూ కేంద్రం చొరవే ఎక్కువ.
ఇప్పుడు ఏపీ విషయానికొద్దాం. అమరావతిలో రాజధానికి 33 వేల ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. ధొలేరా కోసం సేకరించిన 2.2 లక్షల ఎకరాల ముందు ఇది దిగదుడపు. ఏపీ సేకరించిన భూమిలో 900 ఎకరాల్లోనే పరిపాలనా భవనాలు, ఎమ్మెల్యే క్వార్టర్స్ లాంటివన్నీ నిర్మించాలనుకున్నారు. మిగతా భూములు భవిష్యత్తు అవసరాలు.. అంటే, కనీసం మరో పాతికేళ్లపాటు నగర విస్తరణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సేకరించింది. ఆ మాత్రం విజన్ లేకపోతే ఏమౌతుందనడానికి బేగంపేట విమానాశ్రయమే ఉదాహరణ! హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్న కొద్దీ అవసరాలు మారిపోయాయి. దాంతో ఎయిర్ పోర్టును శంషాబాద్ కి తరలించాల్సి వచ్చింది. ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఇలాంటి అవసరాల కోణం నుంచి కాస్త ముందుచూపుతో ఆలోచిస్తే… అమరావతికి టీడీపీ సర్కారు సేకరించిన 33 వేల ఎకరాలూ తక్కువే అనిపిస్తుంది.
ఇంకోటి, అమరావతిలో మూడు పంటలు పండే పచ్చని భూముల్ని లాక్కున్నారంటూ నేతాగణం విమర్శిస్తోంది. ధొలేరాలో సేకరించిన రెండు లక్షల ఎకరాల్లో కూడా చక్కగా ప్రత్తి పంట పండేదే. అవన్నీ పచ్చని నేలలే కదా! మరెందుకు సేకరించినట్టు..? ఇలాంటి నగరాలను నిర్మిస్తున్నప్పుడు.. తాత్కాలిక నష్టం కంటే భవిష్యత్తు తరాల అవసరాలకే ప్రాధాన్యత ఇవ్వాలి. ధొలారేలో జరిగిందీ అదే. అమరావతి విషయంలో టీడీపీ సర్కారు ప్రాధాన్యతా అదే!
ఇక, అమరావతి విషయంలో కేంద్రం చిత్తశుద్ధి విషయానికొద్దాం! గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ ఉన్నప్పుడు ప్రతిపాదిత ధొలేరా ప్రాజెక్టుకి.. ఆయన ప్రధాని కాగానే మంచిరోజులు వచ్చాయి. దాన్ని ఎవ్వరూ తప్పుబట్టరు. ఇప్పుడాయన గుజరాత్ తోపాటు అన్ని రాష్ట్రాలకూ ప్రధానే కదా! అలాంటప్పుడు అమరావతిపై చిత్తశుద్ధి ఎందుకు ఉండటం లేదు..? ధొలేరా విషయంలో కేంద్రమే పెద్దన్న పాత్ర పోషిస్తూ, రాయితీలు ఇస్తూ, పెట్టుబడుల ఆకర్షణలో సాయం చేస్తూ ఉంది. అమరావతి విషయంలో కూడా ఆ మాత్రం చొరవ ఎందుకు కనబరచడం లేదు…? నిధులు సక్రమంగా ఎందుకు కేటాయించలేదు..? తెల్లారితే చాలు మైకావేశంలో మాట్లాడే జగన్, పవన్ లు దీని గురించి ఎందుకు ఆలోచించరు..? అమరావతికి అన్ని వేల ఎకరాలెందుకూ, పచ్చని పొలాలను లాగేసుకున్నారూ, ఇసక నుంచి మట్టి దాకా, మట్టి నుంచీ రాజధాని భూముల దాకా అంటూ గొంతు చించుకోవడాలే తప్పించి, ఈ నాయకులకు వాస్తవాలు అర్థం కావా..? ఏపీ రాజధాని విషయంలో తమ వైఫల్యాన్ని రాష్ట్రంపై రుద్దే ప్రయత్నం కేంద్రం చేస్తుంటే, దానికి వంతపాడటమే తప్ప, నిజాలు తెలుసుకునే ప్రయత్నమే చెయ్యరా..?
అయినా, ధొలేరా గురించి ఆంధ్రా పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాల్సిన అవసరం భాజపాకి ఏముంది..? ఏపీ ప్రజలకు ఏం చెప్పదల్చుకుంటున్నారు..? మా మార్కు అభివ్రుద్ధి ఇలా ఉండబోతోందని చెప్పుకుంటున్నారా.. లేదా, మాతో పెట్టుకుంటే ఎంత నష్టపోతున్నారో తెలుసుకోండని రెచ్చగొడుతున్నారా..? రాష్ట్రాలపట్ల కేంద్రం అనుసరించాల్సిన వైఖరి ఇదేనా..? ఫెడరల్ స్ఫూర్తి అంటే ఇదేనా..?