టికెట్ రేట్ల పెంపు విషయంలో రెండు తెలుగు ప్రభుత్వాలూ భిన్నంగా ఆలోచిస్తున్నాయి. తెలంగాణలో టికెట్ రేట్లని పెంచుకోవడం నిర్మాతలకు ఇబ్బందిగా మారుతోంది. కొన్నిసార్లయితే… ప్రభుత్వానికి విన్నవించుకోవడానికి కూడా ప్రయత్నించడం లేదు. ఏపీలో అలా కాదు. అక్కడ అడిగిందే తడవుగా రేట్ల పెంపుకు జీవోలు ఇచ్చేస్తున్నారు.
ఈనెల 14న ‘వార్ 2’, ‘కూలీ’ రెండు సినిమాలు రాబోతున్నాయి. రెండింటికీ క్రేజ్ వుంది. ఈ సినిమా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. కాకపోతే ఏపీలో ఓ ధర ఉంటే.. తెలంగాణలో మరో ధర ఉంది. తెలంగాణలో టికెట్ రేట్లు పెంచుకోవడానికి నిర్మాతలు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఇవి డబ్బింగ్ సినిమాలంటూ తెలంగాణ ప్రభుత్వం రేట్ల పెంపునకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. దాంతో సాధారణమైన రేట్లే ఇక్కడ కొనసాగుతాయి.
ఏపీలో అలా కాదు. సింగిల్ స్క్రీన్‌లో రూ.75, మల్టీప్లెక్స్ లో రూ.100 పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఈ మేరకు అక్కడ రేట్లు పెరగబోతున్నాయి. వార్ 2, కూలీ రెండు సినిమాలకూ ఈ రేట్లే వర్తించబోతున్నాయి.
ఓ దశలో తెలంగాణలోని మల్టీప్లెక్స్‌లో కూలీ చూడాలంటే 460 రూపాయలు సమర్పించుకోవాల్సిందే అంటూ ప్రచారం సాగింది. ఈ మేరకు రేట్లు పెంచుకొనేలా జీవో తీసుకురావడానికి భారీ కసరత్తులు జరిగాయి. దీనిపై సినీ వర్గాల్లో విస్త్రతమైన చర్చ నడిచింది. తమిళనాడులో కూలీ చూడాలంటే రూ.175 చెల్లిస్తే సరిపోతుంది. కానీ.. ఇక్కడ మూడు రెట్లు అధికంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఓ డబ్బింగ్ సినిమాకు ఇంత రేట్ ఎందుకంటూ సోషల్ మీడియాలో హాట్ హాట్ గా డిస్కర్షన్ సాగింది. సాయింత్రానికి రేట్ల పెంపు లేదంటూ వార్త రావడంతో సినీ ప్రియులు ఊపిరి పీల్చుకొన్నారు.