మరో నెల రోజుల్లో ‘వార్ 2’ రాబోతోంది. ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కలిసి నటించిన క్రేజీ మల్టీస్టారర్ ఇది. త్రిపుల్ ఆర్, దేవర తరవాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా ఇది. అంతకు మించి యంగ్ టైగర్ బాలీవుడ్ లో చేసిన తొలి స్ట్రయిట్ సినిమా. కాబట్టి ఫ్యాన్స్ అంతా ఈ సినిమా కోసం చాలా ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు.
కాకపోతే.. ‘వార్ 2’ సినిమాకి తగిన రీతిలో ప్రమోషన్లు జరగడం లేదన్నది అతి పెద్ద కంప్లైంట్. ‘వార్ 2’తో పాటుగా ‘కూలీ’ సినిమా వస్తోంది. ఆ సినిమాతో పోలిస్తే ‘వార్ 2’ ప్రమోషన్లు చాలా డల్ గా ఉన్నాయి. ‘కూలీ’ పాటలు, ఆ సినిమా పోస్టర్లు, నాగ్ ఇస్తున్న ఎలివేషన్లు ఇవన్నీ ‘కూలీ’పై ఫోకస్ పెరిగేలా చేస్తున్నాయి. అలాంటి కంటెంట్ ‘వార్ 2’కి లేదు. వార్ నుంచి ఎప్పుడో ఓ టీజర్ వచ్చింది. టీజర్ వల్ల ఈ సినిమాకు ఒరిగిందేం లేదు. టీజర్ క్వాలిటీ గురించి కూడా రకరకాల కామెంట్లు వినిపించాయి. విమర్శకుల నోళ్లు మూతలు పడేలా ‘వార్ 2’ ట్రైలర్ రాబోతోందని అన్నారు. కానీ ఆ ట్రైలర్ ఎప్పుడు వస్తుందన్నది మాత్రం చెప్పడం లేదు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఈ సినిమాకు మూల స్థంభాలు. వాళ్లే ఈ సినిమాని ప్రమోట్ చేయాలి. ఎన్టీఆర్ ఈ సినిమా ప్రమోషన్ల కోసం ఎంత టైమ్ కేటాయించాడన్నది తెలియడం లేదు.
‘వార్ 2’ తెలుగు రైట్స్ నిర్మాత నాగవంశీ చేతుల్లోకి వెళ్లాయి. ఎన్టీఆర్కి అతి పెద్ద ఫ్యాన్ ఆయన. ఎన్టీఆర్ సినిమాని ఫ్యాన్స్ లోకి ఎలా తీసుకుని వెళ్లాలో ఆయనకు బాగా తెలుసు. నాగవంశీ వచ్చాక అయినా ‘వార్ 2’ ప్రమోషన్ల జోరు పెరుగుతుందని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ‘వార్ 2’ నుంచి పాటలు, ప్రమోషన్ స్టఫ్ బయటకు రావాల్సివుంది. అవన్నీ ఒకొక్కటిగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తెలుగు నాట ఓ భారీ ఈవెంట్ కూడా నిర్వహించే అవకాశం ఉంది. ఈవెంట్ ఎక్కడ చేస్తారు? ఎన్టీఆర్ ని ప్రమోషన్లకు ఎలా వాడుకొంటారు? అనేదాన్ని బట్టి ‘వార్ 2’ బజ్ ఆధారపడి వుంది.
మరోవైపు ‘వార్ 2’కి ప్రమోషన్లు చేయాల్సిన అవసరం లేదని, కూలీని తట్టుకొనే కెపాసిటీ ‘వార్ 2’కి ఉందని కొంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. కూలీ ఎంత బాగున్నా.. బాలీవుడ్ బెల్ట్ లో ‘వార్ 2’తో పోటీ తట్టుకోవడం కష్టమన్నది ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాదన. కాకపోతే ఈసారి లోకేష్ కనగరాజ్ తన కాస్టింగ్ విషయంలో కాస్త తెలివిగా ఆలోచించాడు. నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర లాంటి స్టార్లని ఈ సినిమా కోసం ఎంచుకొన్నాడు. అమీర్ ఖాన్ రేంజ్ ఏమిటో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ ప్రేక్షకుల్ని అమీర్ థియేటర్లకు రప్పిస్తాడన్నది ఆయన నమ్మకం. కాకపోతే.. ‘సౌత్ సినిమా’ ముద్ర ఉండడం కూలీకి బాలీవుడ్ లో కాస్త మైనస్ అవుతుంది. వార్ 2కి కూడా అదే ప్లస్ పాయింట్ కాబోతోంది. అయినా సరే.. ప్రమోషన్ల విషయంలో ‘వార్ 2’ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. కనీసం తెలుగు బెల్ట్ లో అయినా ‘వార్ 2’కి కాస్త ఊపు రావాలంటే నాగవంశీ నడుం బిగించాల్సిందే.