హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ‘వార్ 2′ కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 14న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ‘వార్ 2’ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లెస్ చేస్తూ ట్రైలర్ ఆద్యంతం హై వోల్టేజ్ స్టయిలీష్ యాక్షన్ తో సాగింది.
ట్రైలర్ కట్ చాలా ఆసక్తికరంగా వుంది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఒకే కథలో బాగం కావడం ఈ సినిమా యూఎస్పీ. వారి పాత్రలు ఎలా ఉంటాయో అనే ఆసక్తి అందరిలో వుంది. దర్శకుడు అయాన్ ట్రైలర్ లో ఆ రెండు పాత్రలపైనే దృష్టి పెట్టాడు.
”నేను ప్రమాణం చేస్తున్నాను. నేను నా పేరు ని, నా గుర్తింపుని, నా ఇంటిని, కుటుంబాన్ని అన్నిటినీ వదిలేసి ఒక నీడగా మారిపోతాను. ఒక ఊరు పేరు లేని, రూపం లేని నీడలాగా. మిత్రులైన సరే ఆప్తులైన సరే పట్టించుకోను. ప్రేమించిన వారిని కూడా చూడను. వెనకడుగు వేయకుండా వెళ్ళిపోతాను. పేరు తెచ్చి పెట్టని, సాక్ష్యాలు లేని త్యాగాలు ఎన్నో చేస్తాను. దాని ఖరీదు నా ప్రాణమైన చివరికి నా ఆత్మనైనా చెల్లిస్తాను’ ఇది హృతిక్ రోషన్ క్యారెక్టర్ ఆర్క్.
”నేను మాటిస్తున్నాను. ఎవ్వరూ చేయలేని పనుల్ని నేను చేసి చూపిస్తాను. ఎవ్వరూ పోరాడలేని యుద్ధాన్ని నేను పోరాడుతాను. మంచి చెడు, తప్పు ఒప్పు పాపం పుణ్యం అనే ప్రతి గీతని ఆలోచించకుండా దాటేస్తాను. ఇప్పుడు నేను మనిషిని కాదు. ఒక ఆయుధాన్ని యుద్ధంలో ఆయుధాన్ని. చస్తా లేదా చంపుతా’ ఇది ఎన్టీఆర్ క్యారెక్టర్ ఆర్క్.
ఇక కాన్ఫ్లిట్ పాయింట్ ని కూడా చివర్లో అశుతోష్ రాణా పాత్ర రూపంలో రివిల్ చేశారు. ”కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. హి ఈజ్ ఏ సోల్జర్.. యు ఆర్ ఏ సోల్జర్.. అండ్ దిస్ ఈజ్ వార్” అన్న అశుతోష్ డైలాగ్ ఇద్దరు సైనికుల మధ్య జరిగే యుద్ధం ఆవిష్కరించింది. అయితే ఈ ఇద్దరి యుద్ధం కూడా ఒకే దేశం కోసం కావడం మరింత ఆసక్తికరం.
ట్రైలర్ హృతిక్ రోషన్, ఎన్టీఆర్ పాత్రని సమతూకంలో చూపించారు. ఇద్దరి యాక్షన్ అదిరిపోయింది. హృతిక్ ఎన్టీఆర్ చేతికి రెండుసార్లు చిక్కినట్లుగా చూపించిన షాట్స్ మరింత క్యురియాసిటీని పెంచాయి. ఎన్టీఆర్ పాత్ర తనని తాను ఒక వెపన్ గా వర్ణిస్తుంది. ఆయన పాత్ర చిత్రీకరణ కూడా నిజంగా ఒక వెపన్ లానే ఉంది.
విజువల్స్, ఆర్ఆర్ చాలా గ్రాండ్ గా వున్నాయి. ఇప్పటివరకూ వచ్చిన స్పై జోనర్ చిత్రాలకు మించిన విజువల్ బ్యూటీ కనిపించింది. మొత్తానికి వార్ 2 పై వున్న అంచనాలని ఈ ట్రైలర్ మరింతగా పెంచింది.