‘వార్ 2’కి మరో 15 రోజుల వ్యవధి కూడా లేదు. ఇప్పటి వరకూ ఈ సినిమాకు సంబంధించి ఒక్క ప్రమోషన్ యాక్టివిటీ కూడా జరగలేదు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో రూపొందిన సినిమా ఇది. ఇండియాలో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ అనుకోవొచ్చు. యశ్ రాజ్ ఫిల్మ్స్ భారీ హంగులతో ఈ చిత్రాన్ని రూపొందించింది. అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ విషయంలో ఎందుకో యశ్ రాజ్ మీన మేషాలు లెక్కేస్తోంది. ఇద్దరు అగ్ర హీరోలు ఉన్నారు కదా, ప్రమోషన్స్ చేయకపోయినా ఓపెనింగ్స్ వచ్చేస్తాయనుకోవడానికి వీల్లేదు. ఆ రోజులు పోయాయి. పైగా.. పోటీగా `కూలీ` ఉంది. సౌత్ లో `వార్ 2` వసూళ్లకు ఎసరపెట్టేంత స్టామినా ‘కూలీ’కి వుంది. అలాంటప్పుడు అస్సలు లైట్ తీసుకోకూడదు.
‘వార్ 2’ తెలుగు హక్కుల్ని నాగవంశీ దక్కించుకొన్న సంగతి తెలిసిందే. ఆయన ఎన్టీఆర్కి వీరాభిమాని. పైగా ఇప్పుడు ఎన్టీఆర్ తో ఓ సినిమా చేస్తున్నారు. ‘వార్ 2’ని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత ఆయనపై వుంది. ‘దేవర’ సినిమా కూడా ఇలానే ఎలాంటి ప్రమోషన్ యాక్టివిటీ లేకుండా విడుదలైపోయింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసినా, సభా నిర్వహణ లోపం వల్ల, నిర్వాహకులు ఆఖర్లో చేతులెత్తేశారు. ‘వార్ 2’కి అలాంటి ఆటంకాలు లేకుండా చూసుకోవాలి. తెలుగులో ఓ భారీ ఈవెంట్ ని నాగవంశీ ప్లాన్ చేస్తున్నారు. అయితే అది కూడా వీలైనంత త్వరగా జరిపిస్తే బాగుంటుంది. ఆఖర్లో హడావుడి చేయకుండా పక్కా ప్లాన్ తో ఈవెంట్ నిర్వహించాల్సిన బాధ్యత నాగవంశీపై వుంది. ‘దేవర’ ఘటనతో తెలుగునాట భారీ ఈవెంట్లకు అనుమతులు దొరకడం లేదు. అయితే ఇటీవలే ‘కింగ్ డమ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చాలా ఘనంగా నిర్వహించగలిగారు నాగవంశీ. ఆ అనుభవం ‘వార్ 2’కి ఉపయోగపడుతుంది.
కాకపోతే.. ఎన్టీఆర్తో పాటు హృతిక్ రోషన్, మిగిలిన నటీనటులు సాంకేతిక నిపుణులు ఈ ఈవెంట్ లో పాల్గొనేలా చూడాలి. అప్పుడే ఎన్టీఆర్ అభిమానులు శాంతిస్తారు. ఏదో నామ్ కే వాస్తే అన్నట్టు ఈవెంట్ నిర్వహిస్తే, ఫ్యాన్స్ కూడా ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. ‘వార్ 2’కి సంబంధించిన ప్రమోషన్ స్టఫ్ ఏదీ లేదన్న అసంతృప్తి అభిమానులకూ వుంది. దాన్ని తగ్గించాలంటే ఈవెంట్ గ్రాండ్ గా చేయాలి. ముంబై లో చేయబోయే ఈవెంట్ పూర్తిగా యష్ రాజ్ ఫిల్మ్స్ చేతుల్లో ఉంది. తెలుగు ఈవెంట్ నాగవంశీ చూసుకొంటారు. కాబట్టి ఏం చేయాలన్నా, ఎంత భారీగా చేయాలన్నా ఇక్కడే.