ప్రజాస్వామ్య విలువలూ, రాజ్యాంగ సాంప్రదాయాలూ మధ్య తమిళనాడులో రోడ్డుమీదపడి కొట్టుకుంటున్నాయి. సొంత వెన్నెముక వుందని ప్రదర్శించుకోడానికి ఇంతవరకూ అవకాశమే రాని పన్నీర్ సెల్వం ఒక వైపు, రాజ్యాంగేతర నియంత శశికళ మరొక వైపు వున్న ఈ పోరులో గెలుపు ఎవరిదన్న కుతూహలం దక్షిణ భారతదేశాన్ని ఆవరించింది.
యెంకి పెళ్ళి సుబ్బి చావుకి వొచ్చిందన్నట్టు, తమిళనాడులో పరిణామాలు ఏదో రూపంలో చంద్రబాబు నాయుడు కి ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టిస్తూనే వున్నాయి. ఆ రాష్ట్రంలో ”జల్లికట్టు విజయం” ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా డిమాండుని మళ్ళీ నిద్రలేపింది. రాజీపడిపోయిన బాబు వైఖరిని మరోసారి దుమ్మెత్తిపోయించింది.
లాబీయింగ్ నైపుణ్యమూ, నిర్వహణా చాతుర్యాలేతప్ప ప్రజల కష్టసుఖాలకు నేరుగా ప్రాతినిధ్యం వహించకముందే చాపకింద నీరులా పార్టీని ఆక్రమించుకుని ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి సిద్ధమైపోయిన శిశికళ ఒకనాటి చంద్రబాబు వ్యవహారశైలిని మళ్ళీ గుర్తు చేస్తున్నది.
తమిళనాడులో ప్రజలు అన్నాడిఎంకె ని ఎన్నుకున్నారు. అన్నాడిఎంకె ఎమ్మెల్యేలు జయలలితను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ఇదంతా ఒక రాజ్యాంగ ప్రక్రియ.
ఈ ప్రక్రియ ప్రకారమే జయలలిత స్ధానంలో పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి అయ్యారు. పార్టీలో కాని, ప్రభుత్వంలోకానీ ఏబాధ్యతా నిర్వహించకపోయినా అన్ని నిర్ణయాలూ తన కనుసన్నల్లోనే జరిగేలా చక్రంతిప్పుతున్న శశికళ పార్టీ అధినేతగా మొదటి మెట్టు ఎక్కి రెండో అడుగును ముఖ్యమంత్రి పదవిలో పెట్టడానికే సిద్ధమైపోయారు. అందుకు రాజ్యాంగ ప్రక్రియనే ఆమె ఎంచుకున్నారు.
అధికారపార్టీ ఎమ్మెల్ల్యేలు నోరుమెదపని విధంగా పరిస్ధితిని శశికళ తనకు అనుకూలంగా కట్టడి చేసుకున్నారు. ముఖ్యమంత్రి పన్నీర్ స్వయంగా శశికళ పేరును ప్రతిపాదించారంటే ఆమె పట్ట ఎంత గట్టిదో అర్ధం చేసుకోవచ్చు.
అధికారమే పరమావధి అనుకున్న శశికళ ప్రజల్లోకి వెళ్ళి వారి బాధ్యతలను తాను స్వీకరించగలనని ఎన్నడూ చెప్పలేదు. ఆమె పట్ల సామాన్య ప్రజానీకానికి సదభిప్రాయమూ సానుభూతీ లేవు. అయితే ముఖ్యమంత్రి ఎంపికలో ప్రజలకు ఏపాత్రా లేదుకాబట్టి వారి స్పందన ఏమిటో బయటపడలేదు.
పన్నీర్ సెల్వం తిరగబడ్డాక జనసామాన్యంలో శశికళ పట్ల ఆమె అవినీతి, నియంతృత్వ, రాజ్యాంగేతర పోకడలపట్ల వ్యతిరేకతలు పన్నీర్ కి సానుభూతి రూపంలో బయటపడుతున్నాయి.
అయినా కూడా పన్నీర్, శశికళ లలో ఎవరు ముఖ్యమంత్రి కావాలో నిర్ణయించే ప్రాసెస్ లో ప్రజల పాత్ర ఏమాత్రమూ లేదు.
ఇక్కడ కేంద్రంలో అధికారంలో వున్న బిజెపి ప్రభుత్వానిదే నిర్ణయాత్మక పాత్ర. ”తమిళనాడు రాజకీయాల్లో బిజెపి జోక్యంలేదు..గవర్నర్ తనపని తాను చేసుకుపోతారు” అనే వెంకయ్యనాయుడు వ్యాఖ్యానాన్ని దొంగమాటలుగానే కొట్టిపారెయ్యొచ్చు.
”ప్రస్తుత పరిస్ధితిని గవర్నర్ ద్వారా కేంద్రం సునిశితంగా గమనిస్తున్నది. ప్రజాప్రయోజనాలనీ, రాజ్యాంగ సాంప్రదాయాలనీ మీరకుండా విచక్షణ అధికారాలను గవర్నర్ ద్వారా ప్రయోగిస్తుంది” అని ధైర్యంగా చెప్పివుంటే వెంకయ్య మాటలు నిజాయితీగా వుండేవి.
బిజెపి వత్తాసు లేకుండా పన్నీర్ తిరుగుబాటు చేశారంటే సామాన్యప్రజానీకం కూడా నమ్మలేరు.
రాజ్యాంగాన్ని రాజకీయస్వార్ధాలకోసం అతిక్రమించిందని పదేపదే కాంగ్రెస్ ను విమర్శించిన బిజెపి ఇపుడు అదేపనికి తెగబడటాన్ని ఏవిధంగానూ సమర్ధించుకోలేదు.
అదేసమయంలో అడ్డదారిలో రాజమార్గానికి చేరుకున్న రాజ్యాంగేతరశక్తిని చివరిలోనైనా నిలువరించగలిగానన్న సంతృప్తి అయినా బిజెపికి మిగులుతుందా? అలాంటి సంతృప్తి మిగిలినా అది భవిష్యత్తులో ఓట్ల రూపానికి కన్వర్ట్ అవుతుందా?? కాలమే తేల్చాలి!!