War2 Movie Review
తెలుగు360 రేటింగ్: 2.25/5
మన హీరో బాలీవుడ్ కి వెళ్లి అక్కడ సినిమా చేయడం.. నిజంగా గర్వించాల్సిన విషయం. అలా ఎన్టీఆర్ ‘వార్ 2’ తెలుగులో క్రేజ్ తెచ్చుకొంది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి నటిస్తున్న సినిమా అంటే… ఇండియాలోనే భారీ మల్టీస్టారర్ అనుకోవాలి. ‘వార్’ అనేది ఆల్రెడీ హిట్ అయిన ఫ్రాంచైజీ. ఇలా ఏ రూపంలో చూసినా రిలీజ్ డేనే టికెట్ కొనేయాలి అన్నంత ఆసక్తి మొదలైపోతుంది. పైగా ‘ఈసారి బొమ్మ అదిరిపోతుంది’ అని రెండు కాలర్లూ ఎగరేసి మరీ చెప్పాడు ఎన్టీఆర్. తను ఇలా చెప్పిన ప్రతీసారీ.. హిట్టు బొమ్మే వచ్చేది. అందుకే ‘వార్ 2’ని ఎప్పుడెప్పుడు చూసేద్దామా అని అభిమానులు గంపెడు ఆశలతో ఎదురు చూశారు. మరి ఆ ఆశలు నిజమయ్యాయా? ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ ఎలా వుంది? ఎన్టీఆర్, హృతిక్ చేసిన ఈ క్రేజీ మల్టీస్టారర్ బాక్సాఫీసు దగ్గర ఎలాంటి ఫలితాన్ని రాబట్టగలదు?
రా చీఫ్ సునీల్ లూద్రా (అశితోష్ రాణా)ని తన చేతులతో కాల్చి చంపేస్తాడు మాజీ రా ఏజెంట్ కబీర్ (హృతిక్ రోషన్). ఈ కేసుని ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకొంటుంది. ఎలాగైనా కబీర్ ని పట్టుకోవాలన్న ఆశయంతో విక్రమ్ (ఎన్టీఆర్)ని రంగంలోకి దింపుతుంది. మరోవైపు కలి అనే ఓ గ్రూప్.. భారతదేశాన్ని, ఇక్కడి సౌభ్రాతృత్వాన్ని విచ్చిన్నం చేయాలని భావిస్తుంటుంది. ఆ మిషన్‌లో కబీర్‌ని వాడుకోవాలని చూస్తుంది. అలాంటి అసాంఘిక శక్తులతో కబీర్ చేతులు కలుపుతాడు కూడా. ఇదంతా ఎందుకు జరుగుతోంది? లూద్రాని కబీర్ ఎందుకు చంపాడు? కబీర్, విక్రమ్‌ల మధ్య ఏం జరిగింది? వీరిద్దరూ శత్రువులా, మిత్రులా? ఇదంతా తెలుసుకోవాలంటే ‘వార్ 2’ చూడాలి.
రా ఏజెంట్.. దేశాన్ని రక్షించే మిషన్, అందులో వచ్చే సమస్యలూ.. వీటి నేపథ్యంలో సాగిన సినిమాలంటే మనకు చాలా ఆసక్తి. అందులో కావల్సినంత యాక్షన్, ఎమోషన్ దాగి ఉంటాయి. ‘వార్’ కూడా అలాంటి సినిమానే. మంచి యాక్షన్ ఫీస్ట్ అందించింది. అందుకే ‘వార్ 2’ రూపంలో ఫ్రాంచైజీని కొనసాగించారు. ఈసారి ఎన్టీఆర్ కలవడంతో… మరింత క్రేజ్ వచ్చింది. ‘వార్ 2’ కథ కూడా `వార్` మీటర్లో రాసుకొన్నదే. దేశాన్ని రక్షించే ఓ మిషన్ కోసం ‘రా’ ఏజెంట్ ప్రాణాలకు తెగించిన వైనం ఈ కథలో కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఇద్దరు హీరోలున్నారు. కాబట్టి.. ఆ యాక్షన్, ఎమోషన్… రెట్టింపుగానే ఆశిస్తారు ఫ్యాన్స్.
‘రా’ సినిమాల్లో యాక్షన్‌కి పెద్ద పీట వేయాల్సిందే. ఈ విషయంలో ఎవరూ కాదనరు. ‘వార్ 2’ మాత్రం ముందుగా యాక్షన్ సీన్లు రాసుకొని, మధ్యలో కథ ఇరికించినట్టు అనిపిస్తుంది. తెరపై ఇది వరకు చూడని యాక్షన్ సీన్లు ఈ సినిమాలో చూపించాలని మేకర్స్ భావించి ఉంటారు. అందులో కూడా తప్పు లేదు. కానీ ఆ యాక్షన్ మరీ ఓవర్ ది బోర్డ్ అనిపించింది. కథలో యాక్షన్ ఓ పార్ట్ కావాలి తప్ప, యాక్షన్ కోసం కథ తయారు చేయకూడదు. ‘వార్ 2’లో జరిగిన తప్పు అదే. ఓ కార్ ఛేజ్, ట్రైన్ పై ఫైట్, ఆ తరవాత ఎగురుతున్న విమానంపై ఫైట్, ఆ తరవాత నీటిలో… క్లైమాక్స్ లో మంచు కొండల్లో ఫైట్.. ఇలా ఫైట్ తరవాత ఫైట్ డిజైన్ చేసుకొని, మధ్యలో కథ ఇరికించారు. కార్ ఛేజ్ హాలీవుడ్ రేంజ్ లో తీద్దామనుకొన్నారు కానీ కుదర్లేదు. ట్రైన్ ఫైట్ కూడా సిల్లీగా అనిపిస్తుంది. విమానం పై తీర్చిదిద్దన యాక్షన్ ఘట్టమైతే మరింత లాజిక్ లెస్ గా మారింది. అవన్నీ సీజీ వర్క్స్ అని ఈజీగా అర్థమైపోతుంటాయి. దాంతో ఫైట్ చూసినప్పుడు ఎమోషన్ రావడం మాని.. అదేదో నవ్వులాటగా తయావుతుంది.
కలి అంటే ఓ ముఠా చూపించారు. జూమ్ మీటింగ్ లో మాట్లాడుకొన్నట్టు అప్పుడప్పుడు ఈ ముఠా అంతా ఓ మీటింగ్ పెట్టుకొంటుంది. అంతే తప్ప.. దాని వల్ల ఈ దేశానికి వచ్చే నష్టం ఏమిటో అర్థం కాదు. సినిమా కథంతా ఎన్టీఆర్ – హృతిక్ చుట్టూనే తిరుగుతుంది. దానికి మించిన సంఘర్షణ ఏదీ కనిపించదు. ఇది ఇద్దరు హీరోల సినిమా అని చెప్పినా.. ఎన్టీఆర్ ని విలన్ గానే చూడాల్సివస్తుంది. అయితే ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ వేరు. ఆ పాత్రని విలన్ గా మార్చేస్తే అభిమానులు ఒప్పుకోరు. కాబట్టి ఎన్టీఆర్ ని కూడా హీరోగా చూపించాలన్న తపనతో.. కథని అటూ ఇటూ ఎడ్జిస్ట్ చేసుకొంటూ వెళ్లాడు. కొన్నిసార్లు ఎన్టీఆర్ హీరో అనిపిస్తాడు. ఇంకొన్ని సార్లు విలన్ గా మారిపోతాడు. ఇంట్రవెల్ దగ్గర ఇచ్చిన ట్విస్ట్ మాత్రం బాగుంటుంది. కథలో ఇంకేదో పార్శ్వం ఉందన్న సంగతి అర్థం అవుతుంది. అయితే సెకండాఫ్ మొదలు కాగానే ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. అది సుదీర్ఘంగా సాగుతుంది. ఫ్లాష్ బ్యాక్ అవ్వగానే ఎన్టీఆర్, హృతిక్ పాత్రలు ఎలా ముగుస్తాయి? అనేదానిపై ఓ హింట్ వచ్చేస్తుంది. క్లైమాక్స్ ఫైట్ కూడా లెంగ్తీగానే ఉంది. ఎన్టీఆర్, హృతిక్ ఫైట్ చేసుకొంటే బాగుంటుంది. కాకపోతే.. పదే పదే.. అదే ఫైట్ చూస్తే మాత్రం బోర్ కొడుతుంది. పైగా క్లైమాక్స్ ఫైట్.. ‘మాస్టర్’ని గుర్తు తెస్తుంది. చివర్లో ఓ సర్ ప్రైజ్ ఎంట్రీ ఉంటుందని ముందే ఊహించారంతా. అనుకొన్నట్టుగానే ఆ సర్ప్రైజ్ ఎంట్రీ కూడా ఉంది. కాకపోతే.. ఆ ఆల్ఫా కాన్వర్జేషన్ పెద్దగా రక్తి కట్టలేదు. అసలే అది జనం థియేటర్ల నుంచి బయటకు పరుగులు పెట్టే సందర్భం కావడంతో ఈ ఎంట్రీని చాలామంది మిస్ అయి ఉంటారు.
హృతిక్ రోషన్ అలవాటు ప్రకారం తన ఈజ్ చూపించేశాడు.యాక్షన్ సీన్లలో హృతిక్ విజృంభణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈసారీ అదే జరిగింది. ఎన్టీఆర్ కి ఇదే తొలి హిందీ సినిమా. హృతిక్ తో పోటీ పడి నటించే ప్రయత్నం చేశాడు. ఎన్టీఆర్ – హృతిక్ ల మధ్య వచ్చే పాట, అందులో ఇద్దరూ వేసే స్టెప్పుల గురించి విడుదలకు ముందు భారీ ఎత్తున ప్రచారం జరిగింది. ఈ పాటలో స్టెప్పులు బాగున్నాయి. అంతే. కాకపోతే ఫ్యాన్స్ ఇంతకు మించి ఎక్స్పెక్ట్ చేశారు. కియారా అద్వాణీ ఓ యాక్షన్ సీన్ లో అదరగొట్టింది. అంతకు మించి చేసిందేం లేదు.
సీజీలపై తీసిన సీన్లేమిటో ఈజీగా గుర్తించే సినిమా ఇది. టెక్నికల్ గా యశ్ రాజ్ తన స్థాయి ప్రమాణాలు ఈ సినిమాలో చూపించలేకపోయిందేమో అనిపిస్తుంది. యాక్షన్ సీన్ల కోసం కష్టపడ్డారు కానీ, ముందే చెప్పినట్టు అవన్నీ ఓవర్ ది బోర్డ్ అనిపిస్తాయి. తెలుగులో ఈ సినిమా ఉన్నా, హిందీలో చూడడమే కాస్త బెటర్. ఎందుకంటే కొన్ని చోట్ల లిప్ సింక్ సరిగా కుదర్లేదు. పాటలూ ఆకట్టుకోవు. హిందీలో అయితే బెటర్ అవుట్ పుట్ ఆశించొచ్చు. ఆయాన్ ముఖర్జీలో కానీ, యశ్ రాజ్ ఫిల్మ్స్ లో గానీ ‘వార్’ అనే ఫ్రాంచైజీని క్యాష్ చేసుకోవాలన్న తపన, తాపత్రయమే తప్ప.. మరేం కనిపించలేదు. ఎన్టీఆర్, హృతిక్ ని ఒకే తెరపై చూసే అరుదైన అవకాశాన్ని ఇచ్చిన సినిమా ఇది. ఇంత క్రేజ్ ఉన్న ఇద్దరు స్టార్స్ కలిసి నటిస్తే – ఎలాంటి సినిమా తీయాలి? పూర్తి యాక్షన్ డ్రామా కథని ఎంచుకోవడం తప్పు కాదు, కానీ ఆ యాక్షన్ డ్రామాలో ఇంటెన్సిటీ లోపించడం తప్పు. ఎన్టీఆర్, హృతిక్ తమ వంతు కష్టపడినా ఫలితం లేకపోయింది అంటే.. కారణం అదే.
తెలుగు360 రేటింగ్: 2.25/5