ఇప్పుడు అపార్టుమెంట్లు ఎత్తు పెరుగుతున్నాయి. ఎంత ఎత్తు ఉంటే అంత గొప్ప అన్నట్లుగా పెంచుకుంటూ పోతున్నారు. బిల్డర్లు అత్యాధునిక టెక్నాలజీ తీసుకు వచ్చి వారానికో ఫ్లోర్ కట్టేస్తున్నారు. ఎక్కడా ఇటుకలు కూడా కనిపించవు. శ్లాబ్స్, గోడలు అన్నీ కాంక్రీట్. షీర్ వాల్ టెక్నాలజీ లాంటివి చాలా వాటిని తీసుకువచ్చి నిర్మిస్తున్నారు. చాలా మందికి అర్థం కాని విషయం.. వీటికి వాటర్ క్యూరింగ్ ఎందుకు చేయరు..? చేయకుండా మన్నిక ఉంటుందా?
హైరైజ్ అపార్టుమెంట్ల నిర్మాణం అంతా రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ (RCC)తో ఉంటాయి. వీటికి వాటర్ క్యూరింగ్ అవసరం ఉంటుంది. కాంక్రీట్ బలం, దీర్ఘకాలిక స్థిరత్వం, సరైన హైడ్రేషన్ ప్రక్రియ కోసం క్యూరింగ్ చాలా ముఖ్యం. కాంక్రీట్‌లోని సిమెంట్ హైడ్రేషన్ ప్రక్రియకు నీరు అవసరం. సరైన హైడ్రేషన్ లేకపోతే, కాంక్రీట్ బలం తగ్గుతుంది. పగుళ్లు (క్రాక్స్) ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకే కొన్ని ఆధునిక పద్ధతులు , పరిస్థితులను బట్టి క్యూరింగ్ పద్ధతి వేరుగా చేస్తున్నారు.
సాంప్రదాయ పద్ధతిలో నీటిని చల్లడం, తడి గోనె సంచులు లేదా గుడ్డలతో కప్పడం వాటర్ క్యూరింగ్. హై-రైజ్ భవనాలలో ఇలాంటి క్యూరింగ్ చాలా కష్టం. ఎక్కువ నీరు అవసరం అవుతుంది. అందుకే నీటి క్యూరింగ్‌కు బదులుగా క్యూరింగ్ కాంపౌండ్లు (chemical curing compounds) ఉపయోగిస్తారు. ఇవి కాంక్రీట్ ఉపరితలంపై పూసి, తేమను నిలుపుదల చేస్తాయి. దీనివల్ల నీటి క్యూరింగ్ అవసరం తగ్గుతుంది.
అలాగే స్టీమ్ క్యూరింగ్ వంటి పద్ధతుల్ని బిల్డర్లు ఉపయోగిస్తున్నారు. ఆధునిక నిర్మాణ సాంకేతికతలో, క్యూరింగ్ కాంపౌండ్ల వాడకం పెరిగింది, ఇవి నీటి క్యూరింగ్ అవసరాన్ని తగ్గిస్తాయి. బయటి నుండి కనిపించవు. కొన్ని హై-రైజ్ భవనాలలో ప్రీ-కాస్ట్ షియర్ వాల్స్ ఉపయోగిస్తారు. వీటిని ఫ్యాక్టరీలో తయారు చేస్తారు. క్యూరింగ్ నియంత్రిత వాతావరణంలో స్టీమ్ క్యూరింగ్ లేదా ఇతర పద్ధతుల ద్వారా ఫ్యాక్టరీలోనే పూర్తవుతుంది. సైట్‌పై అసెంబ్లీంగ్ సమయంలో అదనపు క్యూరింగ్ అవసరం ఉండదు.