కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే సమక్షంలో రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల కోసం టార్గెట్ సెట్ చేసుకున్నారు. ఎన్నికల్లో 100అసెంబ్లీ సీట్లు సాధించి మళ్లీ అధికారంలోకి వస్తాం..100 కంటే ఒక్క సీటు తక్కువ వచ్చినా తనదే బాధ్యత అని ప్రకటించారు. అలాగే పదిహేను ఎంపీ సీట్లు గెలుస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే కాంగ్రెస్ పాలన మున్నాళ్ళ ముచ్చటే అని కొందరన్నారని గుర్తు చేశారు. సంక్షేమ పథకాలు అమలు చేయడం సాధ్యం కాదని అన్నారన్నారు.
కాంగ్రెస్ నేతలు కొట్టుకుంటారని .. కలిసి ఉండరని ప్రభుత్వం పడిపోతుందని అన్నారని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ నేతలు అంతా ఐకమత్యంతో పని చేస్తూ..సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణను దేశానికి ఆదర్శవంతంగా నిలిపామన ిగుర్తు చేశారు. పేదలు ఎప్పుడూ బర్రెలు, గొర్రెలు మేపుకుంటూనే బ్రతకాలా అని కేసీఆర్ ను ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 60వేల ఉద్యోగాలు ఇచ్చాం. కావాలంటే లెక్క చెప్పండి.. అందర్నీ తీసుకొచ్చి స్టేడియంలో నిలబెట్టి లెక్కవేయిస్తా. 60వేల మందికి ఒక్క తల లెక్క తక్కువ వచ్చినా మీ కాళ్లు మొక్కి క్షమాపణ చెబుతానని సవాల్ చేశారు. తన నా సవాల్ స్వీకరించే దమ్ముందా అని ప్రశ్నించారు.
రైతు రాజ్యం ఎవరిదో పార్లమెంట్ లేదా అసెంబ్లీలో చర్చ పెడదాం.. మోడీ వస్తారో ? కిషన్ రెడ్డి వస్తారో ? కేసీఆర్ వస్తారో రావాలన్నారు. తాము చర్చకు సిద్ధమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగిరేలా అంతా ఏకతాటిపైకి వచ్చి పని చేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పక్క పార్టీ నుంచి వచ్చిన నేతలు, ఇప్పటికే ఉన్న నేతలతో విభేదాలు వద్దని సూచించారు. వచ్చే ఎన్నికల నాటికి అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు పెరుగుతున్నాయని చెప్పారు. ప్రజల్లో ఉండి కష్టపడిన ప్రతి ఒక్కరికీ కచ్చితంగా న్యాయం చేసే బాధ్యత తాను తీసుకుంటానని వివరించారు. విభేదాలు పక్కన పెట్టి పార్టీ విజయం కోసం పని చేయాలని పిలుపునిచ్చారు.