శుక్రవారం నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. రాజ్ తరుణ్ పాంచ్ మినార్ తో వచ్చాడు. కొన్ని చోట్ల కామెడీ వర్క్ అవుట్ అయ్యిందనే టాక్ వచ్చింది. కాకపొతే ఈ సినిమాకి సరైన ప్రమోషన్స్ లేవు. అసలు రాజ్ తరుణ్ నుంచి ఇలాంటి సినిమా వచ్చిందని కూడా చాలా మందికి తెలీదు. దీంతో రాజ్ తరుణ్ కి ఉండాల్సిన ఫుట్ ఫాల్స్ కూడా లేకుండాపోయింది.
ప్రియదర్శి ‘ప్రేమంటే’తో వచ్చాడు. ఇదొక క్రైమ్ కామెడీ జానర్ సినిమా. కాకపోతే ఈ సినిమాని ప్రేమ, పెళ్లి, విడాకులని ప్రచారం చేశారు. సినిమా చూశాక కంటెంట్ తేడా కొట్టేసింది. మాది మంచి ఫ్యామిలీ సినిమాని ప్రచారం చేసుకున్నా.. అప్పలు తీర్చుకోవడానికి దొంగతనాలు చేసే ఈ జోడి మెప్పించలేకపోయింది.
అల్లరి నరేష్ రైల్వే కాలనీ తో వచ్చాడు. ఇదొక థ్రిల్లర్. సినిమా చూశాక చిన్న యూట్యూబ్ లైన్ పట్టుకొని సినిమా ఎలా తీశారని అవాక్ అయ్యేలా చేసింది. ఇంటర్వెల్ వరకూ కథ ఏమిటో రిజిస్టర్ కాదు. ఇంటర్వెల్ ట్విస్ట్ కోసం గంట నిడివి భరించడం ప్రేక్షకులు వల్ల కాలేదు. సెకండ్ హాఫ్ అంతా అనవసరమైన ట్విస్ట్ లు ఇచ్చుకుంటూ వెళ్లి చాలా పేలవంగా సినిమాని ముగించారు. నరేష్ స్క్రిప్ట్ సెలెక్షన్స్ పై అనుమానాలు రేకెత్తించిన సినిమా ఇది.
చిన్న సినిమాగా వచ్చిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ బాక్సాఫీసు వద్ద ప్రభావం చూపించింది. వేణు ఉడుగుల ఈ సినిమాకి షో రన్నర్. లిటిల్ హార్ట్స్ ని విజయవంతంగా ప్రేక్షకులు వద్దకు తీసుకువెళ్ళిన బన్నీవాసు, వంశీ నందిపాటి సినిమాకి కావాల్సిన బూస్ట్ ఇచ్చారు. ఈటీవీ లాంటి సంస్థ నిర్మాణంలో వుంది. మిగతా సినిమాలతో పూల్చుకుంటే ఈ సినిమా ప్రచారంలో కూడా రాణించింది. ‘సంచలనమైన ముగింపు’ ప్రచారం జనాల్లోకి వెళ్ళింది. సినిమాకి మంచి ఫుట్ ఫాల్స్ కనిపించాయి. ముఖ్యంగా తెలంగాణ బెల్ట్ లో సినిమాకి మంచి ఆదరణ ఉంది. మిగతా సినిమాలతో పోల్చుకుంటే ఆడియన్స్ రాజు వెడ్స్ రాంబాయి పై మొగ్గు చూపారు.
