బెంగాల్ ఎన్నికల్లో చేపల రాజకీయం సీరియస్‌గా మారింది. జాతీయ స్థాయిలో పెద్ద పెద్ద ఆర్థిక సంస్కరణలు, విదేశాంగ విధానాల గురించి మాట్లాడే బీజేపీకి.. బెంగాల్ గడ్డపై మాత్రం మమతా బెనర్జీ ఒక చేప తో చుక్కలు చూపిస్తున్నారు. బెంగాలీలకు చేప అంటే కేవలం ఆహారం కాదు, అది వారి అస్తిత్వం, వారి సంస్కృతి. సరిగ్గా ఇదే పాయింట్‌ను పట్టుకుని దీదీ ఆడుతున్న మైండ్ గేమ్ ఇప్పుడు బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
మాచ్ వర్సెస్ మార్కెట్ పాలిటిక్స్
బెంగాల్లో మమతా బెనర్జీ ప్రచార అస్త్రం చాలా సింపుల్‌గా, పదునుగా ఉంది. బీజేపీ వస్తే మీ వంటగదిలోకి వస్తారు.. మీరు ఏం తినాలో వాళ్లే నిర్ణయిస్తారు.. ఇకపై మీరు చేపలు తినలేరు అంటూ ఆమె ఊరూవాడా ప్రచారం చేస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఆహారపు అలవాట్లపై ఉండే ఆంక్షలను ఉదాహరణగా చూపుతూ, బెంగాలీ ఇళ్లల్లో ఉండే మాచ్-భాత్ అంటే చేప-అన్నం సెంటిమెంట్‌ను ఆమె ట్రిగ్గర్ చేశారు. దీంతో సామాన్య బెంగాలీ ఓటరులో నిజంగానే బీజేపీ వస్తే మా చేపల కూర మానేయాలా అన్న అనుమానం మొదలైంది.
మెడలో చేపలు.. బీజేపీ తిప్పలు!
దీదీ విసిరిన ఈ చేపల వల నుంచి బయటపడటానికి బీజేపీ నేతలు పడుతున్న పాట్లు చూస్తుంటే జాలి వేస్తోంది. అంతర్జాతీయ స్థాయి మేధావులమని చెప్పుకునే నేతలు కూడా ఇప్పుడు మార్కెట్లలో చేపలు కొంటూ, వాటిని మెడలో వేసుకుని ఫొటోలు దిగుతూ మేము కూడా చేపల ప్రియులమే అని నిరూపించుకోవాల్సి వస్తోంది. మేము చేపలకు వ్యతిరేకం కాదు అని వంద సార్లు మొత్తుకున్నా, మమతా బెనర్జీ మాత్రం అదిగో.. వాళ్లు మిమ్మల్ని నమ్మిస్తున్నారు, లోపల ప్లాన్ వేరే ఉంది అంటూ వారిని డిఫెన్స్‌లో పడేశారు.
శాకాహారం.. మాంసాహారం.. బెంగాలీ మర్మం
మిగతా రాష్ట్రాల్లో చేపలపై చర్చలు నడుస్తాయేమో కానీ, బెంగాల్లో చేపను శాకాహారం గా భావిస్తారు. అక్కడ బ్రాహ్మణులు కూడా చేపలు తింటారు. ఈ సున్నితమైన విషయాన్ని బీజేపీ సరిగ్గా అంచనా వేయలేకపోయింది. ఇతర రాష్ట్రాల్లో నడిచే వెజ్ వర్సెస్ నాన్-వెజ్ ఫార్ములా ఇక్కడ రివర్స్ కొట్టింది. మమతా బెనర్జీ తనదైన స్టైల్లో బిజేపీ అంటే గుజరాతీ ఖాదీ.. బెంగాల్ అంటే చేపల కూర అని లోకల్ సెంటిమెంట్‌ను పతాక స్థాయికి తీసుకెళ్లారు. అమిత్ షా, జేపీ నడ్డా వంటి దిగ్గజాలు ఎన్ని వ్యూహాలు పన్నినా, మమతా బెనర్జీ మాత్రం వాటన్నింటినీ ఒక్క చేప తో కొట్టేస్తున్నారు. ప్రజలకు అర్థం కాని జీడీపీ లెక్కలు, రాజ్యాంగ సవరణల కంటే.. రేపు నీ కంచంలో చేప ముక్క ఉంటుందా లేదా అనే ప్రశ్న ఓటరును ఎక్కువగా ప్రభావితం చేస్తోంది.
గాలం వేసింది ఎవరు?
బెంగాల్ ఎన్నికల బరిలో ఇప్పుడు అభివృద్ధి కంటే చేపల పులుసు వాసనే ఎక్కువగా వస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే, బీజేపీ వేయాలనుకున్న రాజకీయ వలలో మమతా బెనర్జీయే తన చేపల వల ను విసిరి వారిని బందీలను చేశారు. రాజకీయాల్లో ప్రత్యర్థిని ఎలా ఇరకాటంలో పెట్టాలో మమతా బెనర్జీని చూసి నేర్చుకోవాలని బీజేపీ నేతలు అంతర్గతంగా అనుకుంటున్నా ఆశ్చర్యం లేదు. ఇప్పుడు బీజేపీ నేతలు చేయగలిగింది ఒక్కటే.. ఎన్నికలు అయ్యే వరకు చేపల మార్కెట్లలోనే మకాం వేసి, తాము కూడా చేపల భక్తులమే అని నిరూపించుకోవడం!
