పశ్చిమ బెంగాల్ పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రోటోకాల్ ఇవ్వకపోడం వివాదాస్పదంగా మారింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డార్జిలింగ్ జిల్లాలో జరిగిన 9వ అంతర్జాతీయ సంతాల్ సమ్మేళనానికి హాజరయ్యారు. ఆ సమంలో బెంగాల్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు దేశ అధ్యక్షురాలికి జరిగిన అవమానంగా విమర్శలు లవస్తున్నాయి. సాధారణంగా రాష్ట్రపతి ఒక రాష్ట్రానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి లేదా కనీసం ఒక సీనియర్ మంత్రి స్వాగతం పలకడం ఆనవాయితీ. అయితే, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గానీ, ఆమె క్యాబినెట్ మంత్రులు గానీ రాష్ట్రపతికి స్వాగతం పలకడానికి రాకపోవడం తీవ్ర చర్చకు దారితీసింది. దీనిపై రాష్ట్రపతి కూడా స్పందించారు. మమతా బెనర్జీ సోదరి వంటివరాని బహుశా ఆమె నాపై కోపంగా ఉందేమో అని వ్యాఖ్యానించారు.
ఈ వివాదం కేవలం ప్రోటోకాల్కే పరిమితం కాకుండా, కార్యక్రమ వేదిక మార్పు విషయంలో కూడా ముదిరింది. మొదట పెద్ద మైదానంలో జరగాల్సిన ఈ సమ్మేళనాన్ని, భద్రతా కారణాల పేరుతో ప్రభుత్వం చివర నిమిషంలో ఒక చిన్న వేదికకు మార్చింది. దీనివల్ల వేలాది మంది గిరిజనులు కార్యక్రమానికి రాలేకపోయారని, సంతాల్ ప్రజలు ఐక్యం కావడం బెంగాల్ ప్రభుత్వానికి ఇష్టం లేదని రాష్ట్రపతి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం , బీజేపీ నేతలు దీనిని గిరిజన బిడ్డకు జరిగిన అవమానం గా అభివర్ణిస్తున్నారు.
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. ఎన్నికల వేళ రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ రాష్ట్రపతిని వాడుకుంటోందని ఆమె ఆరోపించారు. రాష్ట్రపతి సచివాలయం పంపిన లైనప్ ప్రకారమే జిల్లా యంత్రాంగం , సిలిగురి మేయర్ రాష్ట్రపతికి స్వాగతం పలికారని, ఇందులో ప్రోటోకాల్ ఉల్లంఘన ఏమీ లేదని ఆమె సమర్థించుకున్నారు. అయితే, దేశ ప్రథమ పౌరురాలు బహిరంగంగా తన అసంతృప్తిని వ్యక్తం చేయడం గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక అరుదైన , ఆందోళనకరమైన పరిణామంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా పలువురు జాతీయ నాయకులు ఈ ఘటనను ఖండిస్తూ సోషల్ మీడియాలో స్పందించారు. రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలను గౌరవించడంలో బెంగాల్ ప్రభుత్వం విఫలమైందని, ఇది ప్రజాస్వామ్య విలువలకు గొడ్డలి పెట్టు అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన ఈ పరిణామం, గిరిజన ఓటు బ్యాంకుపై ప్రభావం చూపే అవకాశం ఉందని, మమతా బెనర్జీ దూకుడు వైఖరి ఆమెకు రాజకీయంగా ఇబ్బందులు తెచ్చిపెట్టే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.


