వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరికీ విలువ ఉండదు. జగన్ రెడ్డి కోసం జైలుకెళ్లాలి లేకపోతే కేసుల పాలవ్వాలి అన్నట్లుగా ఉంటుంది. వైసీపీ నేతలు జగన్ ను టార్గెట్ చేసి లిక్కర్ కేసు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. జగన్ ను అరెస్టు చేసేందుకే ఇదంతా చేస్తున్నారని కూడా అంటున్నారు. అంటే అరెస్టు కాని జగన్ రెడ్డి కోసం .. మిగతా నేతలు మీడియా ముందుకు లబోదిబోమంటున్నారు. అయితే ఇప్పటి వరకూ అరెస్ట్ అయిన వారు మనుషులు కాదా.. వారి సంగతేమిటి అన్న ప్రశ్నలు వివిధ వర్గాల నుంచి వైసీపీకి వస్తున్నాయి. దానికి వైసీపీ సమాధానం చెప్పాల్సి ఉంది.
వాళ్లందర్నీ జైలుకు పంపుతోంది ఎవరు ?
లిక్కర్ కేసులో ఇప్పటికి ఆరేడుగురు అరెస్ట్ అయ్యారు. చాలా మంది పారిపోయారు. మిథున్ రెడ్డి లాంటి వాళ్లు బయట రక్షణ పొంది బిక్కుబిక్కమంటున్నారు. వీరందరి కష్టాలకు కారణం ఎవరు ?. వీరందరి కుటుంబాల వేదనకు గురై..తమ వారి చూపు కోసం జైలు ముందు ములాఖత్‌ల కోసం చూడాల్సిన పరిస్థితిని ఎవరు కల్పించారు ?. గౌరవంగా బతికిన ఐపీఎస్, ఐఏఎస్‌లతో అడ్డగోలు పనులు చేయించి .. వారి జీవితాల్ని చివరి దశలో జైలు పాలు చేసిందెవరు ?
అరెస్టయిన వాళ్లు మునుషులు కాదా..బకరాలా ?
అరెస్టు అయిన వాళ్ల గురించి వైసీపీ పట్టించుకున్న పాపాన పోలేదు. పైగా వారంతా టీడీపీ నేతలని ప్రచారం చేయడానికి వెనుకాడటం లేదు. విజయసాయిరెడ్డి, కెసిరెడ్డి సహా అందర్నీ టీడీపీ నేతలకు సన్నిహితులను సిగ్గులేకుండా ప్రచారం చేయడానికి వెనుకాడటం లేదు. వారందర్నీ ఇష్టం వచ్చినట్లుగా వాడుకుని చిల్లర పడేసి… మొత్తం దోచుకుని ఇప్పుడు వారందర్నీ బలి చేసి జైలుకు పంపారు. వారిపైనే తప్పుడు ప్రచారాలు చేస్తూ.. తప్పుకుంటున్నారు. వారిని మనుషులుగా కాకుండా బకరాలుగా వాడుకున్నారు. ఇప్పుడు తాము అరెస్టు అవుతామనే భయం వచ్చేసరికి.. రచ్చ చేస్తున్నారు.
ఎంత మంది బలైపోయినా పర్వాలేదు జగన్ మాత్రం సేఫ్‌గా ఉండాలా ?
వైసీపీ నేతల తీరు ఎలా ఉందంటే.. లిక్కర్ స్కాంలో ఎంత మంది బలి అయిపోయిన పర్వాలేదు.. జగన్ మాత్రం సేఫ్ గా ఉండాలన్నట్లుగా మాట్లాడుతున్నారు. నిజానికి అలా మాట్లాడేవారి మాటలు కూడా కాదు అవి. తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చే స్క్రిప్ట్ ప్రకారం చదువుతారు. జగన్ రెడ్డి కి పెద్ద పాలేరుగా తనను తాను ప్రకటించుకున్న పేర్ని నాని ఇంకా తన డ్యూటీ చేస్తున్నారు. కానీ తనలాంటి వారు జైలుకుపోతున్నారు.. దానికి కారణం ఏమిటన్నది మాత్రం ఆయన గుర్తించనట్లుగా నటిస్తున్నారు. తనదాకా వస్తే కానీ పేర్నికి ధైర్యం రాదేమో ?