నిన్న చట్టసభల్లో జరిగిన వీరంగం పెద్ద చర్చకు దారితీస్తోంది. కోమటిరెడ్డి హెడ్ ఫోన్స్ విసిరాడని, దీంతో మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ కంటికి గాయమైందని, సరోజినీ దేవి ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారని చెప్పిన అధికార టిఆర్ఎస్ పార్టీ నేతలు , కాంగ్రెస్ ఇలా వ్యవహరించడం దారుణమని వ్యాఖ్యలు చేశారు. ఇది అత్యంత హేయమైన సంఘటన అని ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యాఖ్యానించగా, దీన్ని తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
అయితే దీనిపై కాంగ్రెస్ నేతల స్పందన రెండు రకాలుగా ఉంది. కోమటిరెడ్డి, జీవన్ రెడ్డి తదితరులు అసలు దాడి జరగనే లేదని అంటున్నారు. దాడి జరిగినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని కోమటిరెడ్డి అంటే, సీసీటీవీ ఫుటేజ్ విడుదల చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. అయితే మరికొంతమంది కాంగ్రెస్ నేతలు మాత్రం మరొక రకంగా స్పందిస్తున్నారు. తెలంగాణ రావడానికి ముందు టిఆర్ఎస్ నేతలు అసెంబ్లీలో ప్రవర్తించిన విధానాన్ని వారు గుర్తుచేస్తున్నారు. అప్పట్లో గవర్నర్ ప్రసంగానికి హరీష్ రావు ఎలా అడ్డుతగిలింది, అలాగే టీఆర్ఎస్ నేతలు ఎలా మైక్ సెట్లు విసిరింది, అలాగే ఈటెల రాజేందర్ లాంటివారు అసెంబ్లీలో జయప్రకాశ్ నారాయణ లాంటి వారి మీద ఎలా దాడి చేసింది, ఇవన్నీ గుర్తుచేస్తూ, అప్పుడు ఉన్న చట్టాలే ఇప్పుడూ ఉన్నాయని, అప్పుడు ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఇప్పుడు అలాంటి చర్యలే తీసుకోవాలని వారంటున్నారు .అప్పుడు తెలంగాణ కోసం చేసిన ఇలాంటి సంఘటనలు సరైనవి అయితే, ఇప్పుడు రైతుల కోసం వారికి గిట్టుబాటు ధరల కోసం తాము చేస్తున్న పోరాటం కూడా సరైందేనని వారంటున్నారు.
మరి తెలుగు తెలంగాణ సర్కారు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి