ఆపరేషన్ సిందూర్ పై చర్చ కోసం కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టింది. లోకసభలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. రాహుల్, ప్రియాంక సహా చాలా మంది కాంగ్రెస్ నేతలు ప్రసంగించారు. ఎన్ని ఫైటర్ జెట్లు కోల్పోయారో చెప్పాలని డిమాండ్ చేశారు. ట్రంప్ ప్రకటనల గురించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తప్పు చేసిందని భారత్ కు నష్టం జరిగిందని నిరూపించాలని అనుకున్నారు. కానీ పూర్తిగా తేలిపోయారు. ఏ ఒక్క అంశాన్ని బలంగా చెప్పలేకపోయారు. కానీ పాకిస్తాన్ అజెండా మోస్తున్నారన్న అపవాదును మాత్రం మూటగట్టుకోవాల్సి వచ్చింది.
యుద్ధ వ్యూహాల గురించి సభలో చర్చ పెట్టడమే తప్పు !
ఆపరేషన్ సిందూర్ విషయంలో తెర వెనుక ఏం జరిగిందన్నది ఉన్నత వర్గాలకు తెలుసు. ప్రజలకు తెలిసింది యుద్ధం ఆగిపోవడమే. ప్రజలకు కావాల్సింది కూడా అదే. ప్రధాని మోదీ దేశ ఆత్మగౌరవాన్ని, శాంతికాముక దేశంగా దేశ ఇమేజ్ ను కాపాడుతారని ప్రజలకు నమ్మకం ఉంది. పాకిస్తాన్ కు జరిగిన నష్టంపై ప్రపంచ దేశాలు క్లారిటీ ఇచ్చాయి. వారి ఎయిర్ బేస్‌లు ఇప్పటికీ తేరుకోలేకపోతున్నాయి. చైనా మద్దతుతో చెలరేగిపోవాలనుకున్న పాకిస్తాన్ కు .. వెంటనే బుద్ది చెప్పింది భారత్. పాకిస్తాన్ ఉగ్రదాడులు చేయబోమని రాసిచ్చింది. ఉగ్రవాదులకు సాయం చేయబోమని చెప్పింది. తమ దేశంలో టెర్రరిస్టుల ఆచూకీ ఉంటే ఇవ్వాలని పట్టిస్తామని కూడా చెప్పింది. ఇది విజయం కాదా?. ఎలా చూసినా యుద్ధంలో భారత్ విజయం సాధించింది.
యుద్ధంలో జరిగిన నష్టంపై ఎందుకు ప్రచారం చేయాలనుకున్నారు ?
యుద్ధం అంటే నాశనం. అంతిమంగా విజేతగా ఒకరు ఉండవచ్చు. కానీ విజేతగా నిలవడానికి సైతం ఎన్నో కోల్పోయి ఉండాలి. భారత్ కు కూడా కొంత నష్టం జరిగింది. ఫైటర్ జెట్లను కోల్పోయింది. ఏం నష్టం జరిగిందన్నది సీక్రెట్స్ గా ఉంచాల్సిన విషయాలు. యుద్ధ విషయాలు, రక్షణ విషయాలు అన్నీ బహిర్గతం చేయకూడదు. పాకిస్తాన్ చేసుకున్న క్లెయిమ్ లు తప్పు అని.. మోదీ..క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్లి.. ప్రపంచానికి చూపించారు కూడా. కానీ కాంగ్రెస్ భారత్ కు జరిగిన నష్టం వివరాలు తెలియాలంటూ వితండవాతం చేసి.. చర్చకు పెట్టారు. ఆ వివరాలను మోదీ కూడా బయట పెట్టలేదు.
ట్రంప్ పిచ్చి మాటల్ని పట్టుకుని కాంగ్రెస్ రచ్చ
యుద్ధం తానే ఆపానని ట్రంప్ చెప్పుకుంటూ తిరుగుతున్నారు. భారత్ ఖండించింది. ఓ సారి ట్రంప్.. యుద్ధాన్ని భారత్, పాక్ మాట్లాడుకుని ఆపేసుకున్నాయని చెప్పారు. మళ్లీ రొటీనే. ట్రంప్ అమెరికా అధ్యక్షుడే కానీ ఆయన మాటల్ని ఎవరైనా సీరియస్ గా తీసుకుంటున్నారా అంటే అది ఒక్క కాంగ్రెస్ పార్టీనే. ఆయన మాటల్ని పట్టుకుని వచ్చి భారత ప్రభుత్వాన్ని నిలదీయాలని అనుకుంటున్నారు. ఎలాంటి మధ్యవర్తిత్వం లేదని చెప్పిన తర్వాత కూడా అవే ఆరోపణలు చేస్తున్నారు. కానీ మోదీ గట్టిగా కౌంటర్ ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి మోదీ రాజకీయాలను అర్థం చేసుకోలేకపోతోంది. ఇలా ఉన్నంత కాలం మోదీ.. కాంగ్రెస్ పార్టీతో ఆటలాడుకుంటూనే ఉంటారు.