వెరైటీ కథలు ఎంచుకొంటాడన్న విషయంలో సూర్యకు మంచి పేరుంది. కెరీర్ ముందు నుంచీ ఇప్పటి వరకూ కథల విషయంలో తాను కొన్ని ప్రయోగాలు చేశాడు. వాటిలో సక్సెస్లు ఉన్నాయి, ఫెయిల్యూర్స్ ఉన్నాయి. కానీ కథల ఎంపిక విషయంలో సూర్య తడబడింది లేదు. కానీ ఇటీవల తాను చేస్తున్న సినిమాలు చూస్తుంటే సూర్య జడ్జిమెంట్ కి ఏమైంది? అనే అనుమానం వస్తోంది. తాజాగా ‘రెట్రో’ సినిమా ఫలితం చూస్తే ఆ అనుమానం బలంగా నాటుకుపోవడం ఖాయం. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. గురువారం విడుదలైంది. ఈ సినిమా చూస్తే.. సూర్య డైహార్డ్ ఫ్యాన్స్ కూడా తలలు పట్టుకొంటారు. ఆ స్థాయిలో ఉంది సినిమా. కొన్ని సినిమాలు ఫెయిల్ అవుతాయి కానీ ‘ఏదో కొత్తగా చెప్పాలని చూశారులే’ అనే సానుభూతి కలుగుతుంది. సూర్య ఫెయిల్యూర్స్ ని కూడా సూర్య ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకోవడానికి కారణం ఇదే. అయితే `రెట్రో` చూస్తే అసలు ఈ సినిమా సూర్య ఎందుకు ఒప్పుకొన్నాడు? కథేం లేకుండానే ఎలా ఓకే చేశాడు? అని జుత్తు పీక్కొంటారు.
హీరోగా ఏదో రెమ్యునరేషన్ కోసం మొహమాట పడి సినిమా ఒప్పుకొన్నాడంటే అదీ కాదు. ఈ సినిమాకు నిర్మాత కూడా సూర్యనే. ఓ కథని నమ్మి, హీరోగా చేయడమే కాకుండా, నిర్మాతగానూ పెట్టుబడి పెట్టాడంటే కార్తిక్ సుబ్బరాజ్ ఏదో మ్యాజిక్ చేశాడనే అనుకొన్నారంతా. కానీ మేకింగ్ లో, టేకింగ్ లో, కథ చెప్పే విధానంలో, ముగించే పద్ధతిలో ఎక్కడా కొత్తదనం కనించలేదు. పైగా కార్తీక్ ఇప్పుడు ఫామ్ లో కూడా లేడు. అలాంటి కార్తీక్ సుబ్బరాజ్ ని నమ్మి సూర్య ఎందుకు ఇంత రిస్క్ చేశాడన్నది పెద్ద ప్రశ్న.
మరోవైపు కార్తీక్ సుబ్బరాజ్లోని స్పార్క్ ఏమైందో అర్థం కాదు. ‘పిజ్జా’, ‘జిగడ్తాండ’ తరవాత కార్తీక్ సుబ్బరాజ్ నుంచి తన స్థాయికి తగిన కథ రాలేదన్నది వాస్తవం. కథల ఎంపికలో కార్తీక్ సుబ్బరాజ్ ఎప్పుడూ తడబడుతూనే ఉంటాడని, తనకు కథలపై అస్సలు శ్రద్ధ లేదన్న విమర్శ గట్టిగా ఉంది. ‘రెట్రో’తో అది మరోసారి రుజువైంది. మేకింగ్, బిల్డప్పులపై పెట్టే శ్రద్ధ కార్తీక్ కథలపై ఎందుకు పెట్టడో ఎవ్వరికీ అర్థం కాని ప్రశ్న. ఇది ఓ రకంగా సూర్యకు, కార్తీక్ సుబ్బరాజ్కు మేల్కొలుపు గీతం. ఇప్పుడు వీరిద్దరూ కళ్లు తెరవాల్సిన స్థితి. తప్పు ఎక్కడ జరిగిందో నిజాయితీగా పోస్ట్ మార్టమ్ చేసుకొని, ఆ తప్పుల్ని సరిదిద్దుకోకపోతే కెరియర్లే ప్రమాదంలో పడే ఛాన్స్ వుంది. స్టార్ హీరోగా సూర్యకు సినిమాలేం ఆగవు. కాకపోతే.. అభిమానులు నమ్మడం మానేస్తారు. ఆ ప్రమాదం తెచ్చుకోకూడదు.