ఏమైంది, ఈ రాహుల్ కి ?

శనివారం – రాహుల్ గాంధీ బిహార్ లోని ఛంపారాన్ వెళ్ళారు. కాంగ్రెస్ ర్యాలీలో పాల్గొన్నారు. మోదీ గురించే మాట్లాడారు.

ఆదివారం – ఢిల్లీలో రైతుల ర్యాలీలో పాల్గొన్నారు. అక్కడా మోదీ ముచ్చట్లే.

సోమవారం – (21-09-15) – ఉత్తరప్రదేశ్ లోని శ్రీకృష్ణుడి జన్మస్థలి అయిన మధిరలో రాహుల్ ప్రసంగం. ఇక్కడ కూడా మోదీ జపమే.

ఏమైంది రాహుల్ గాంధీకి ? మోదీ గురించి ప్రతిరోజూ తలచుకోవడానికి కారణాలేమిటీ? మోదీని విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకోవడం తప్పుకాదు, కానీ సమయం, సందర్భం లేకుండా ప్రతిరోజూ చెప్పినమాటలే చెబ్తూ రోజులు దొర్లిస్తున్న రాహుల్ చివరకు కాంగ్రెస్ కి మేలు చేయబోతున్నాడా ? లేక ప్రత్యర్థి మోదీకి (బీజేపీకి) మేలు చేయబోతున్నారా ?? అన్నది ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లోనే ఎదురైన ప్రశ్న.

బిహార్ లో ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడ్డాయి. బీఆర్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ ఏర్పాటు చేసినర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి మోదీపై విరుచుకుపడ్డారు. `సూటు-బూటు ప్రభుత్వమం’టూ విమర్శలు సంధించారు. అయితే,ఆయన బిహార్ ఎన్నికల బరిలోని తన కూటమిలోని మిత్రుల గురించి (నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్) ఎక్కడా ప్రస్తావించకబోవడం మహాకూటమి నాయకులను విస్మయపరిచింది. ఈ ర్యాలీకి నితీష్, లాలూలు తాము నేరుగా హాజరుకాకుండా వారి ప్రతినిధులను పంపడం మరో విశేషం.

ఆ తర్వాత ఢిల్లీ రాంలీలా మైదానంలో కూడా రాహుల్ ప్రసంగ ధోరణి ఇదేతీరులో సాగింది. ఇక సోమవారంనాడు ఉత్తరప్రదేశ్ వెళ్లినప్పుడు అక్కడి రూలింగ్ పార్టీ సమాజావాదీ , లేదా బీఎస్పీ గురించి మాట్లాడతారనుకుంటే ఆ పనిచేయకుండా రాహుల్ అరిగిపోయిన రికార్డ్ లా `సూటు- బూట్’ అంటూ పాతపల్లవే అందుకున్నారు.

రాహుల్ వెంట మానసిక శత్రువు

ఇప్పుడు అందరికీ ఒక విషయం అర్థమైంది. రాహుల్ ఎక్కడకు వెళ్ళినా ఒక వ్యక్తిని వెంటబెట్టుకునే వెళుతున్నారు. ఆ వ్యక్తి మరెవరో కాదు, నరేంద్రమోదీనే. అవును, నరేంద్ర మోదీ ఇతగాడికి శత్రువే…కానీ అపరిమితమైన శత్రుత్వభావనతో క్షణక్షణం అతని నామస్మరణచేసే ఒకరకమైన మానసిక స్థితి (దీనికి ఏ పేరుపెట్టాలన్నది ఆలోచించాల్సిందే)కి చేరుకున్నాడు. పూర్వం హిరణ్యకశపుడు, రావణాసురుడు ప్రతిక్షణం తమ శత్రువులైన విష్ణువు, రాముడిని దూషిస్తూ చివరకు తమచావును తామే తెచ్చుకున్నారు. ఇప్పుడు రాహుల్ పరిస్థితి చూస్తుంటే పరిస్థితి ఇంచుమించు అలాగే ఉన్నట్టు అనిపిస్తోంది.

రాహుల్ ని చికాకుపరిచిన మోదీ

యూపీఏ రెండవ విడత పగ్గాలు అందుకున్నప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో పెద్ద చర్చే జరిగింది. అది దేనిమీద అంటే, మోదీని నిత్యం విమర్శించడం వల్ల లాభమా?, లేక ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్ల లాభమా? అన్నది. అప్పటికి మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి మాత్రమే. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అదేపనిగా విమర్శించడం వల్ల చివరకు అతణ్ణి జాతీయ నాయకుడ్ని చేసినట్టు అవుతుందన్న అభిప్రాయం కొంతమంది వ్యక్తం చేస్తే, మరికొందరు – మోదీని విమర్శించకుండా ఉంటే, గుజరాత్ అభివృద్ధిని అడ్డంపెట్టుకుని అతగాడు విశ్వరూపం చూపే ప్రమాదం ఉన్నదని కొందరు వాదించారు. చిత్రమేమంటే ఈ చర్చ పూర్తికాకముందే, నిర్ణయం తీసుకోకముందే యుపీఏ సర్కార్ ముగిసింది. ఎవరిగురించి అంత సీరియస్ గా ఆలోచించారో చివరకు అతగాడే దేశ ప్రధానిగా కూర్చున్నాడు. ఇది కాంగ్రెస్ నేతలను, మరీ ముఖ్యంగా సోనియా, రాహుల్ వంటివారిని మానసికంగా చికాకుపరిచింది. ఈ చికాకే రాహుల్ ప్రస్తుత పరిస్థితికి దారితీసిందని కాంగ్రెస్ వర్గాల్లోని వారే అంటున్నమాట.

మోదీని ఘాటుగా విమర్శిస్తే, కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పడిపోతుందనీ, అప్పుడు ఏర్పడ్డ ఖాళీని కాంగ్రెస్ మాత్రమే భర్తీచేయగలదని రాహుల్ సంపూర్ణంగా విశ్వసిస్తున్నారు. ఈ తరహా ఆలోచన నుంచి అతగాడు బయటపడలేకపోతున్నాడు. మోదీని ఎంతగా విమర్శిస్తే, తనకు అంతతొందరగా ప్రధాని సీటు దక్కుతుందన్న కచ్చితాభిప్రాయంలో రాహుల్ ఉన్నట్టుంది. బహూశా అందుకే సమయం, సందర్భాలను కూడా పరిగణలోకి తీసుకోకుండా మైక్ అందుకోగానే వెంటనే పాత పల్లవే అందుకుంటున్నారు. మోదీ సూటు-బూటు పాలనంటూ రికార్డ్ ప్లే చేస్తున్నారు. మరి చివరకు ఈ భ్రమ నుంచి రాహుల్ ఎప్పుడు బయటపడతారో వేచిచూడాల్సిందే.

-కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com