ఇలాంటి సవాళ్ల వల్ల ఒరిగేదేముంది జనసేనానీ..?

ప్ర‌జ‌ల‌కు అన్యాయం జ‌రుగుతున్న‌ప్పుడు, పేదల భూములు అన్యాక్రాంతం అవుతున్న‌ప్పుడు, అవ‌కాశాల్లేక యువ‌త నైరాశ్యంతో ఉన్న‌ప్పుడు… కోట్ల మంది అభిమానులు త‌న‌కు ఉండి కూడా ఏమీ చెయ్య‌కుండా కూర్చోవ‌డం త‌న వ‌ల్ల కాద‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. విశాఖ‌ప‌ట్నంలో జ‌రిగిన ఓ స‌మావేశంలో ఆయ‌న కార్య‌క‌ర్త‌ల్ని ఉద్దేశించి మాట్లాడారు. త‌న‌కు ప్రాణాలు లెక్క‌లేద‌నీ, అన్యాయం జ‌రుగుతున్న‌ప్పుడు నిల‌దీయ‌క‌పోతే అది మరింత ఎక్కువైపోతుందని అన్నారు. త‌న‌లాంటి వ్య‌క్తులు భ‌య‌ప‌డితే స‌మాజం ఎప్ప‌టికీ బాగుప‌డ‌దన్నారు.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుగానీ, ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిగానీ, మంత్రి లోకేష్ గానీ… వీళ్ల ముగ్గుర్నీ ఒకే వేదిక మీదికి ర‌మ్మ‌నండీ, నేనూ వ‌స్తానంటూ ప‌వ‌న్ స‌వాల్ చేశారు. ‘డిబేట్ దేని మీద పెడ‌దామో చెప్పండి. ఉత్త‌రాంధ్ర వెన‌క‌బాటుత‌నం మీద పెడ‌దాం. రాయ‌ల‌సీమకు ఏం చేశారో చర్చ పెడ‌దాం. ప్ర‌కాశం జిల్లాకు ఏం చేశారు..? ఎవ్వ‌రూ వ‌ద్దు, ఐ.ఎ.ఎస్‌. ఆఫీస‌ర్ల‌ను తీసుకునిరాను. సెక్ర‌ట‌రీల‌ను ప‌ట్టుకురాను. ఒక్క‌డినే కూర్చుంటా. మీ ముగ్గురూ కూర్చోండి.. నేను మాట్లాడ‌తా. విభ‌జ‌న హామీల గురించి మాట్లాడ‌దామా..? మైనింగ్ పాల‌సీల గురించి మాట్లాడ‌దామా..? గిరిజ‌న స‌మ‌స్య‌ల గురించి మాట్లాడ‌దామా..? వ‌్య‌వ‌సాయం మీద మాట్లాడ‌దామా..? 2050 కి విశాఖ ఎలా ఉంటుందో మీరు చెప్పండీ, నేను చెప్తాను’ అంటూ ప‌వ‌న్ స‌వాల్ చేశారు. తాను వేక్ గా రాలేద‌నీ, చ‌దువుకుని వ‌చ్చాన‌ని ప‌వ‌న్ అన్నారు.

ఈ మ‌ధ్య ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌వాళ్ల‌కే ప్రాధాన్య‌త ఇస్తున్నట్టున్నారు. మొన్న‌టికి మొన్న ముఖ్య‌మంత్రి రాజీనామా చెయ్యాల‌నీ, జ‌గ‌న్ కూడా క‌లిసి వ‌స్తే రైలుప‌ట్టాల మీద కూర్చుని పోరాడ‌దామ‌న్నారు. ఇప్పుడు చ‌ర్చ‌కు రావాలంటూ స‌వాల్ చేస్తున్నారు. చ‌ర్చ‌ల‌తో ఏం సాధిస్తారు..? ప‌వ‌న్ క‌ల్యాణ్ కు అన్నింటిపై అవ‌గాహ‌న ఉందీ అని నిరూపించుకోవ‌డం కోస‌మేనా ఈ స‌వాళ్లు అన్న‌ట్టుగా వినిపిస్తున్నాయి. అంతేగానీ, త‌న పోరాటమేదో తాను చేస్తున్న‌ట్టుగా క‌నిపించ‌డం లేదు.

జ‌న‌సేన పార్టీ ఎందుకు పెట్టార‌నే అంశాన్ని ఇప్ప‌టికీ కొన్ని వంద‌లసార్లు చెప్పారు. త‌ప్పులేదు. కానీ, ప‌వ‌న్ కోరుకుంటున్న ఆ మార్పు అధికార సాధ‌న ద్వారానే సాధ్య‌మౌతుంది. ప్ర‌జాస్వామ్యంలో రాజ‌కీయ పార్టీల తేవాల‌నుకుంటున్న మార్పు ఏదైనా.. అంతిమంగా ఆయా పార్టీల ప్ర‌భుత్వాల ఏర్పాటు ద్వారానే సాధ్యం. కాబ‌ట్టి, దానికి కావాల్సింది స‌వాళ్లూ ప్ర‌తిస‌వాళ్లూ చ‌ర్చ‌లూ విమ‌ర్శ‌లూ కాదు! స్ప‌ష్ట‌మైన రాజ‌కీయ విధానాలు, స‌మ‌గ్ర‌మైన పార్టీ నిర్మాణం. ఉత్త‌రాంధ్ర ప‌ర్య‌ట‌న పూర్తి చేసుకున్న ప‌వ‌న్‌… పార్టీప‌రంగా ఏ స్థాయి బ‌లోపేతం అయ్యారనే విశ్లేష‌ణ చేసుకుంటే మంచిది. కాబట్టి, ఇలాంటి సవాళ్ల వల్ల జనసేనకు ప్రత్యేకంగా ఒరిగేదంటూ ఏమీ ఉండదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com