వినయ విధేయ రామ, స్కంధ చిత్రాలతో బోయపాటి శ్రీను భారీ ట్రోలింగ్ కి గురయ్యాడు. చివరికి తనకు అచ్చొచ్చిన హీరో నందమూరి బాలకృష్ణతో జట్టు కట్టాడు. వీరిద్దరి కాంబో ఎంత శక్తిమంతమైనదో ‘అఖండ 2’తో మరోసారి తెలిసొచ్చింది. ఈ విజయంతో బోయపాటి ఊపిరి పీల్చుకొన్నాడు. ఈవారం కూడా అఖండ 2 హవా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ‘అఖండ 2’ తరవాత గోపీచంద్ మలినేని సినిమాతో బిజీ అయిపోయాడు నందమూరి బాలకృష్ణ. మరి బోయపాటి శ్రీను సంగతేంటి? బోయపాటి ఏ హీరోతో జట్టు కట్టబోతున్నాడన్నవి ఆసక్తికరమైన విషయాలు..
ప్రస్తుతానికి టాప్ హీరోలంతా బిజీ బిజీగా ఉన్నారు. వాళ్లలో ఎవరు అందుబాటులోకి రావాలన్నా కనీసం యేడాది సమయం పడుతుంది. అయితే కాస్తో కూస్తో అందుబాటులో ఉన్న హీరో… అల్లు అర్జున్. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు బన్నీ. అది త్వరగా పూర్తయిపోతుందని, ఆ తరవాత బోయపాటితో బన్నీ వర్క్ చేసే అవకాశం ఉందని టాక్. వీరిద్దరి కాంబినేషన్లో ‘సరైనోడు’ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్టయ్యింది. అప్పటికి బన్నీ కెరీర్లో అదే పెద్ద హిట్. ఆ కాంబో సెట్ మళ్లీ సెట్ అయితే… కచ్చితంగా ఫోకస్ ఏర్పడుతుంది. గీతా ఆర్ట్స్ లో ఓ సినిమా చేయడానికి బోయపాటి ఆల్రెడీ అడ్వాన్స్ తీసుకొన్నారు. దాంతో ఈ కాంబో సెట్ అవ్వడం చాలా ఈజీ అనేది ఇన్ సైడ్ వర్గాల మాట. బోయపాటి కూడా బన్నీతో మళ్లీ పని చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారని, అందుకోసం ఓ కథ కూడా రెడీ చేశారని తెలుస్తోంది. సంక్రాంతి తరవాత బోయపాటి తదుపరి సినిమాపై ఓ స్పష్టత రావొచ్చు.
