ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన వస్తే చాలా మంది కీలక నేతల అరెస్టులు ఉంటాయన్న ప్రచారం కొంతకాలంగా ఉంది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు అనే నిందితులు విదేశాలకు పారిపోయారని వారు వచ్చిన వెంటనే కేసీఆర్, కేటీఆర్ అరెస్టులు ఉంటాయని ప్రకటించారు. వారు రాకుండా బీజేపీ అడ్డు పడుతోందని ఆరోపించారు. ఇప్పుడు బీజేపీ సహకరిచిందో.. చట్టం ప్రకారం ప్రాసెస్ జరిగిందో కానీ శ్రవణ్ రావు కొంత కాలం కిందటే వచ్చారు.. ప్రభాకర్ రావు తాజాగా ల్యాండయ్యారు. ఇక ఈ కేసులో ఏం జరగబోతోంది ?
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆధారాలు ఉన్నాయా ?
ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరగలేదని ఎవరూ అనుకోలేరు. రేవంత్ రెడ్డి ని పదిహేను కెమెరాలు పెట్టి ట్రాప్ చేయడం దగ్గర నుంచి ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వరకూ ప్రతీ అంశం ట్యాపింగ్ తో ముడిపడి ఉంది. స్టార్ల వ్యక్తిగత వ్యవహారాలనూ లీక్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎదైనా ఎన్నికలు జరిగితే కేవలం ఇతర పార్టీలకు చెందిన వారు తరలించే డబ్బును కోట్లకు కోట్లు పట్టుకునేవారు. ఇలాంటి ఉదాహరణలు లెక్కలేనన్ని ఉన్నాయి. కానీ వీటికి ఆధారాలేమిటి అన్నది స్పష్టత లేదు. ఎదుకంటే హార్డ్ డిస్క్, ఆధారాలను ఎన్నికల ఫలితాలు రాగానే ధ్వంసం చేశారని పోలీసులు చెబుతున్నారు.
నిరూపించడం దాదాపుగా అసాధ్యం
దేశంలో ఇప్పటి వరకూ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చాలా సార్లు వచ్చాయి కానీ నిరూపించిన సందర్భం ఒక్కటి కూడా లేదు. ఇప్పుడు కూడా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ నిరూపించడం అంత తేలిక కాదు. అధికారికంగా అన్ని అనుమతులతో చేసే ఫోన్ ట్యాపింగ్ పూర్తి కాన్ఫిడెన్షియల్. అందులో ఉగ్రవాదులు, తీవ్రవాదులు వంటి వారి జాబితా మాత్రమే ఉంటుంది. కానీ అలాంటి అవకాశాన్ని ఉపయోగిచుకుని అనధికారికంగా రాజకీయ ప్రత్యర్థులు, సెలబ్రిటీల ఫోన్లను ట్యాప్ చేసి వాడుకుంటారు. వీటికి ఆధారాలు సేకరించడం దాదాపుగా అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు.
ఏ 1 ప్రభాకర్ రావు – కేసీఆర్, కేటీఆర్ పేర్లు చెబుతారా ?
ఇప్పటి వరకూ ప్రభాకర్ రావు ఈ కేసులో ఏ వన్ గా ఉన్నారు. అరెస్టు అయిన నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల మేరకు ఆయనను ఏ వన్ గా చేర్చారు. ఆయన ఎవరి పేర్లు చెబుతారన్నది ఇప్పుడు కీలకం. ఆయన సామాన్యంగా ట్యాపింగ్ చేశామని అంగీకరించే అవకాశం ఉండదు. కేసీఆర్, కేటీఆర్‌లకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చే చాన్స్ ఉండదు. ఇప్పుడు ప్రభుత్వం ఈ కేసుకు చాలా హైప్ వచ్చినందున తదుపరి చర్యలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఈ కేసులో తదుపరి ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.