బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం రోజురోజుకూ ముదురుతోంది. షేక్ హసీనా నిష్క్రమణ తర్వాత అధికార పగ్గాలు చేపట్టిన తాత్కాలిక ప్రభుత్వం శాంతిభద్రతలను అదుపు చేయడంలో ఘోరంగా విఫలమైంది. ముఖ్యంగా దేశంలోని మైనార్టీ హిందువులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులు, ఆస్తుల విధ్వంసం ఆ దేశంలోని మత సామరస్యాన్ని దెబ్బతీశాయి. ప్రజలు ఎన్నుకోని పాలకులు అధికారంలో ఉండటం, వ్యవస్థలపై పట్టు కోల్పోవడం వల్ల విద్వేష శక్తులు స్వైరవిహారం చేస్తున్నాయి. ఈ అస్థిరత ఆ దేశాన్ని ఆర్థికంగా , సామాజికంగా పతనం అంచుకు తీసుకెళ్తోంది.
బంగ్లాలో పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితులు
బంగ్లాదేశ్లో ప్రస్తుత పరిస్థితులు గమనిస్తుంటే, ఆ దేశం అత్యంత సంక్లిష్టమైన , ప్రమాదకరమైన దశలో ఉన్నట్లు కనిపిస్తోంది. షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఏర్పడిన తాత్కాలిక పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. ముఖ్యంగా హిందువులపై జరుగుతున్న దాడులు, అరాచకాలు అంతర్జాతీయ సమాజంలో ఆందోళన కలిగిస్తున్నాయి. రాబోయే రెండు మూడు నెలల్లో బంగ్లాదేశ్లో ఎన్నికలు నిర్వహించాలని అంతర్జాతీయ ఒత్తిడి ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో నిష్పాక్షికమైన ఎన్నికలు జరగడం అసాధ్యంగా కనిపిస్తోంది. ఎన్నికల కమిషన్, ఇతర రాజ్యాంగబద్ధమైన సంస్థలు నిర్వీర్యమవ్వడం, క్షేత్రస్థాయిలో హింస రాజ్యమేలుతుండటం వల్ల ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణం లేదు.
జరగబోయేవి ఉత్తుత్తి ఎన్నికలు
ఎన్నికలు నిర్వహించినా, ఆ ఫలితాలను ఓడిపోయిన వర్గం అంగీకరించే అవకాశం తక్కువ. ఇది దేశాన్ని మరోసారి సివిల్ వార్ వంటి పరిస్థితుల్లోకి నెట్టే ప్రమాదం ఉంది. బంగ్లాదేశ్లో పెరిగిన మత ఛాందసవాదం భవిష్యత్తులో గెలిచే ఏ ప్రజా ప్రభుత్వానికైనా అతిపెద్ద సవాలుగా మారనుంది. గెలిచిన పార్టీపై కూడా తిరుగుబాటు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఎందుకంటే అక్కడ ఇప్పుడు ప్రజాస్వామ్య విలువల కంటే కక్ష సాధింపు రాజకీయాలే పైచేయి సాధించాయి. నిరుద్యోగం, పెరుగుతున్న నిత్యావసర ధరలు , దౌత్యపరమైన ఒంటరితనం ప్రజల్లో తీవ్ర అసహనాన్ని పెంచుతున్నాయి. ఎన్నికల తర్వాత కూడా స్థిరమైన ప్రభుత్వం ఏర్పడుతుందనే నమ్మకం సన్నగిల్లుతోంది.
భారత్, బంగ్లాదేశ్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఖాాయం
వచ్చే కొన్ని వారాల్లో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది. హిందువులపై దాడులు కొనసాగితే, భారీ ఎత్తున శరణార్థుల వలసలు ప్రారంభమై అది దక్షిణ ఆసియా అంతటా ప్రభావం చూపే అవకాశం ఉంది. అమెరికా ,ఇతర పాశ్చాత్య దేశాలు బంగ్లాదేశ్ విషయంలో తీసుకునే నిర్ణయాలు అక్కడి తాత్కాలిక ప్రభుత్వ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. బంగ్లాదేశ్ తన చరిత్రలోనే అత్యంత చీకటి అధ్యాయాన్ని ఎదుర్కొంటోంది. ప్రజలు మత కుట్రల్లో చిక్కుకుని పోతే.. మరో పాకిస్తాన్ అవుతుంది. ప్రజలు తెలివిగా ప్రజాస్వామ్యానికి అండగా నిలబడితే.. బతుకులు బాగుపడే అవకాశాలు ఉంటాయి. కానీ అలాంటి అవకాశమే కనిపించడం లేదు.
