తెలుగుదేశం పార్టీ ఇటీవలి కాలంలో పలు చోట్ల ఫిరాయింపులు, అవిశ్వాసాలకు స్థానిక సంస్థల పీఠాలను దక్కించుకుంటోంది. గుంటూరు,విశాఖ కార్పొరేషన్లకు మేయర్లు కూడా కూటమి నుంచి వచ్చారు. కుప్పం మున్సిపల్ చైర్మన్ గా ఉన్న వ్యక్తి రాజీనామా చేసి టీడీపీలో చేరడంతో వేరే కౌన్సిలర్ గా టీడీపీ తరపున నియమించారు. తాజాగా బొబ్బిలి, చీరాల మున్సిపాల్టీల్లోనూ ఫిరాయింపుల మ్యాజిక్ చేశారు. అయితే ఇలాంటి ఫిరాయింపుల వల్ల టీడీపీకి కానీ.. కూటమిలోని ఇతర పార్టీలకు కానీ లాభమేంటి అన్నదానిపై మాత్రం స్పష్టత లేదు.
పదవి కాలం మరో ఏడాది లోపు మాత్రమే !
వైఎస్ఆర్సీపీ హయాంలో మున్సిపల్ ఎన్నికలు అత్యంత ఘోరంగా జరిగాయి. వాటిని ఎన్నికలు అనడం కన్నా రిగ్గింగ్ అనడం బెటర్. ఎలా అయినా గెలుపే కాబట్టి టీడీపీకి దర్శి, తాడిపత్రి మున్సిపాల్టీల్లో తప్ప ఎక్కడా విజయం దక్కలేదు. కానీ తాము ఎలా గెలిచామో వైసీపీకి తెలుసు కాబట్టి ఓడిపోయినా ఆ మున్సిపల్ పీఠాలు తమ దగ్గరే ఉండేలా అవిశ్వాసం గడువుపై చట్టాన్ని మార్చేశారు. నాలుగేళ్లు పూర్తయిన తర్వాతనే అవిశ్వాసం పెట్టాలని రూల్ తెచ్చారు. ఈ కారణంగా ప్రభుత్వం వచ్చినా అవిశ్వాసాలు పెట్టడానికి పది నెలలకు పైగా పట్టింది. అవిశ్వాసాలు పెట్టి చాలా చోట్ల టీడీపీ నేతలు పీఠాలు కైవసం చేసుకున్నారు . అయితే ఆ పదవి కాలం చాలా స్వల్పమే. ఏడాది లోపే ఉంటుంది.
పీఠంపై లేకపోయినా అధికారం అధికార పార్టీ నేతలదే!
మున్సిపల్ చైర్మన్ పీఠాలపై అధికారికంగా లేకపోయినప్పటికీ.. ప్రభుత్వం లేకపోతే… మున్సిపల్ చైర్మన్లు కూడా ఏమీ చేయలేరు. చివరికి మేయర్లు కూడా ఏమీ చేయలేరు. అధికారులు వారి మాట వినరు. దానికి సాక్ష్యం గుంటూరులో మేయర్ గా పని చేయలేక రాజీనామా చేసిన కావటి మనోహర్ నాయుడే. ఆయన తమ ప్రభుత్వం ఉన్నంత వరకూ ఇష్టారాజ్య పాలన చేశారు. తర్వాత ప్రభుత్వం మారగానే తన చాంబర్ తాళాలు కూడా ఇవ్వడం లేదని ఫీలయ్యారు. తర్వాత రాజీనామా చేశారు. మిగిలిన చోట్ల ఎవరూ అలా రాజీనామాలు చేయడం లేదు కానీ.. వారికేమీ పవర్స్ ఉండటం లేదు. కూటమి నేతలే అధికారం చెలాయిస్తున్నారు.
ఫిరాయింపుల వల్ల ద్వితీయ శ్రేణి క్యాడర్ కు నష్టం
పార్టీలోకి ఫిరాయించి వచ్చేవారు తమ పదవుల్ని కాపాడుకోవడానికి .. వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ తరపున మరోసారి కార్పొరేటర్ లేదా కౌన్సిలర్ గా టిక్కెట్ పొందడానికే అయి ఉంటుంది. చాలా వరకూ వారి కోరికలను మన్నించాల్సి రావొచ్చు. దాని వల్ల పార్టీ కోసం పని చేసిన ద్వితీయ శ్రేణి నేతలకు టిక్కెట్లు దొరకడం గగనంగా మారుతుంది. అందుకే మున్సిపల్ ఫిరాయింపులను కూటమి పార్టీలు ప్రోత్సహించకపోవడమే మంచిదన్న అభిప్రాయం వినిపిస్తోంది.