సెల్ఫ్‌గోల్: తెలంగాణలో అడ్రస్ గల్లంతయ్యేటట్లున్న టీడీపీ

హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి “నానాటికి తీసికట్టు…” సామెత చందంగా ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికలలో 15మంది ఎమ్మెల్యేలు ఉన్న తెలుగుదేశం బలం ప్రస్తుతం తొమ్మిదికి దిగజారింది. ఆ ఎన్నికలలో టీడీపీ టిక్కెట్‌పై గెలిచిన తలసాని శ్రీనివాస యాదవ్, తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కృష్ణారెడ్డి, మాధవరం కృష్ణారావు, వరంగల్ జిల్లా పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాత్రమే కాకుండా రాజ్యసభ ఎంపీ గుండు సుధారాణి కూడా ఇప్పటికే టీఆర్ఎస్‌లోకి జంప్ అయ్యారు. తాజాగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకూడా వారిబాటలోనే నడిచారు.

2014 ఎన్నికల తర్వాత ఎన్‌టీఆర్ ట్రస్ట్ భవన్‌కు, తెలంగాణలో టీడీపీ ఆఫీసులకు తాళం వేసుకుని టులెట్ బోర్డ్‌లు పెట్టుకోవాల్సిందేనని హరీష్ రావుతోసహా పలువురు టీఆర్ఎస్ నేతలు ఆ ఎన్నికలకు ముందు ఎన్నోసార్లు ఎద్దేవా చేశారు. ఎన్నికలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ మీదే దృష్టిపెట్టిన చంద్రబాబు తెలంగాణలో అభ్యర్థుల ఎంపిక, పోల్ మేనేజ్‌మెంట్ వంటి విషయాలను పెద్దగా పట్టించుకోలేదు. తెలంగాణలో పార్టీ విజయావకాశాలపై ఆయనకు పెద్దగా ఆశలు కూడా ఉన్నట్లు అనిపించలేదు. ఏదో ‘మమ’ అనిపించారు. అయితే తెలుగుదేశం పార్టీ 15 సీట్లను గెలుచుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచింది. ఆ 15లో పది జంటనగరాలలోనివి కాగా, 5 జిల్లాలలో వచ్చినవి. అభ్యర్థుల ఎంపిక, పోల్ మేనేజ్‌మెంట్ ఇంకా కొద్దిగా మెరుగ్గా చేస్తే మరికొన్ని వచ్చి ఉండేవని, పార్టీకి రాష్ట్రంలో బాగానే భవిష్యత్తు ఉందని అధినేత చంద్రబాబుకు, పార్టీ నాయకులకు అప్పటికి అర్థమయ్యి కొత్త ఉత్సాహం వచ్చింది. ఆ ఉత్సాహాన్ని అలాగే కొనసాగిస్తే బాగానే ఉండేదేమో! అయితే ఆ తర్వాత వరసగా జరుగుతున్న పరిణామాలు రాష్ట్రంలో పార్టీ అడ్రస్ గల్లంతయ్యేటట్లుందని అనిపిస్తున్నాయి. ఓటుకు నోటు కేసు, అంతర్గత విభేదాలతో పార్టీ ఇప్పటికే బలహీనపడిపోగా, ఇవాళ మరో గట్టి షాక్ తగిలింది.

సాయన్న టీఆర్ఎస్‌లో చేరటంపై కీలక నేత నారా లోకేష్ ఈ మధ్యాహ్నం తెలంగాణ నేతలతో సమావేశమై చర్చిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవటం అంటే ఇదేనేమో! ఎమ్మెల్యే జంప్ అవుతున్నా ముందే పసిగట్టలేని దయనీయ స్థితిలో పార్టీ నాయకత్వం ఉన్నట్లు స్పష్టమవుతోంది. తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఒక నాథుడులేని ఇల్లులాగా తయారవటం ఇప్పుడు కొత్తగా జరిగింది కాదు. 2014 ఎన్నికలు అయిపోయి పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిననాటినుంచి తెలంగాణలో పార్టీని పట్టించుకోవటం తగ్గించేశారు. పాపం ఆయన మాత్రం ఏమి చేస్తారు! పదేళ్ళనుంచి ప్రతిపక్షంలో ఉంటూ, తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని, అందరితో తిట్లు తిని… తిని ఉన్న బాబుకు ఒక్కసారి పరిస్థితి టర్న్ ఎరౌండ్ అవటంతో రిలాక్స్ అయిపోయారు. ఫోకస్ పోయింది. ఏమైనా కొద్దో, గొప్పో ఉంటే ఆ ఫోకస్ అంతా ఏపీ మీదే పెట్టారు. దాంతో తెలంగాణలో పార్టీ పరిస్థితి డేష్ అయిపోయింది. ఎన్నికలు ముగిసిన కొత్తల్లో 15 సీట్లు వచ్చిన ఉత్సాహంతో – నెలలో 15 రోజులు హైదరాబాద్‌లోనే ఉంటానని, తెలంగాణలోకూడా టీడీపీ అధికారం చేపట్టేదాకా నిద్రపోనని ఉత్సాహంగా డైలాగులు చెప్పిన బాబు ఆ తర్వాత ఏపీలో పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలలో పడి ఆ విషయమే మర్చిపోయారు. దీనితో తెలంగాణలో పార్టీ పరిస్థితి దిగజారటం ప్రారంభమయింది. మొదట తలసాని, తీగల ప్యాకేజ్‌లాగా వెళ్ళి టీఆర్ఎస్‌లో చేరారు. తర్వాత మంచిరెడ్డి కిషన్ రెడ్డి, తర్వాత మాధవరం కృష్ణారావు, ధర్మారెడ్డి, గుండు సుధారాణి…. తాజాగా సాయన్న. అయితే బయటకు వెళుతున్న నేతలు మాత్రం పార్టీ తమకు అన్నీ ఇచ్చిందని, అయినా వెళ్ళటం తమకు భాధగానే ఉందని చెప్పి వెళ్ళటం ఒక విశేషం.

గత మే నెలలో జరిగిన ఓటుకు నోటు కేసు వ్యవహారంతో పార్టీ ఇమేజ్‌కు తీవ్రంగా దెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. ఆ పరిణామానికి కూడా పరోక్షంగా కారణం చంద్రబాబేనని చెప్పక తప్పదు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్‌కు అడ్డుకట్ట వేయటానికి రేవంత్ రెడ్డి తదితరులు పిచ్చి వ్యూహాలు వేయటం, పులినోట్లో చిక్కుకున్నట్లు అమాయకంగా వెళ్ళి వారి ఉచ్చులో పడటం విదితమే. పార్టీ వ్యవహారాలలో ఒక సమన్వయం, సమష్ఠి నాయకత్వం లేకపోవటం వలనే ఈ పరిణామం జరిగింది. అంతా అయిపోయిన తర్వాత, ఇంత జరుగుతుంటే మీరేమి చేస్తున్నారంటూ చంద్రబాబు నాడు ఏపీ ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులపై మండిపడ్డారు. ఇంటెలిజెన్స్ బాస్‌ను మార్చారు. కానీ సమస్యకు మూలం ఎక్కడ అని అప్పటికీ ఆలోచించలేకపోయారు. అందువలనే ఆ తర్వాత కూడా పార్టీ వ్యవహారాలు గాడిన పడలేదు. ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డిల మధ్య విభేదాలు ముదిరిపోయాయి. ఇద్దరూ నువ్వెెంత అంటే నువ్వెంత అనుకుంటూ తిట్టుకున్న సంగతి రచ్చ రచ్చ అయింది. తాజాగా మోత్కుపల్లి, ఎలిమినేటి ఉమ మధ్య విభేదాలు కూడా రచ్చకెక్కాయి. యాదగిరిగుట్టను జిల్లాగా చేయాలని మోత్కుపల్లి దీక్ష చేపడితే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, ఎర్రబెల్లి మద్దతు ప్రకటించారు. అయితే నల్గొండ జిల్లాకే చెందిన మరో సీనియర్ నేత ఉమా మాధవరెడ్డి ఆ డిమాండ్‌ను వ్యతిరేకించారు. స్వప్రయోజనాలకోసమే ఈ డిమాండ్ చేస్తున్నారంటూ మోత్కుపల్లికి చురకలంటించారు. పార్టీలో ఎవరికి వారు సొంత నిర్ణయాలు తీసుకుని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటూ పార్టీలో వాస్తవ పరిస్థితిని కళ్ళకు కట్టినట్లు చెప్పేశారు. నల్గొండలోనే కాదు మిగిలిన జిల్లాలలో కూడా వర్గ విభేదాలు తీవ్రంగా ఉన్నాయి.

మరోవైపు ఓటుకు నోటు కేసు నేపథ్యంలో తెలంగాణపట్ల బాబు వైఖరి మారిందన్న వాదనకూడా ఉంది. వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ ఉపఎన్నికలో అభ్యర్థిత్వాన్ని బీజేపీకి వదలటాన్ని దీనికి నిదర్శనంగా చెబుతున్నారు. అభ్యర్థిత్వాన్ని బీజేపీకి వదలటమేకాక, ఉపఎన్నిక ప్రచారంలో కూడా చంద్రబాబు పాల్గొనకపోవటం, అభ్యర్థి దేవయ్య డిపాజిట్ కోల్పోవటం వంటి పరిణామాలతో పరువు కోల్పోయినట్లువటమే కాకుండా పార్టీ కార్యకర్తలలో నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేవిధంగా ఉందంటున్నారు. నాడు ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలోనే తెలంగాణ గడ్డపై అడుగుపెడితే ఖబడ్దార్ అంటూ టీఆర్ఎస్ నేతలు చేసిన సవాళ్ళను లెక్కచేయకుండా వరంగల్‌ జిల్లా పాలపర్తిలో రైతు యాత్ర జరిపి బహిరంగ సభలో పాల్గొని హీరో అనిపించుకున్న చంద్రబాబు, ఇప్పుడు ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొనకపోవటానికి కారణం ఓటుకు నోటు కేసు భయమేన్న వాదన బలంగానే వినిపిస్తోంది. అసలు తెలంగాణలో పార్టీని ఆయన ఏమి చేద్దామనుకుంటున్నారనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పార్టీనుంచి బయటకెళ్ళే ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుంటే మిగిలిన నాయకుల్లో, శ్రేణుల్లో నైతిక స్థైర్యంకూడా దిగజారటం సహజం. ఏది ఏమైనా ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీలో మిగిలి ఉన్నవారుకూడా తలో వైపుకు సర్దుకోవటం మాత్రం అనివార్యం. ఇది మునిగిపోయే నౌక అనుకుంటే, మిగిలిన నాయకులను మోకులు పెట్టి కట్టేసినా తెంచుకుని పారిపోతారు. అప్పుడు నిజంగానే హరీష్ రావు అన్నట్లు టీడీపీ ఆఫీసులకు తాళం వేసి టులెట్ బోర్డ్‌లు తగిలించుకునే పరిస్థితి వస్తుంది. దీనికి టీఆర్ఎస్‌నో, పార్టీని వీడిన నాయకులనో కూడా నిందించనవసరంలేదు. ఎందుకంటే ఇదంతా స్వయంకృతాపరాధం! ఇప్పటికైనా, హైదరాబాద్ సిటీలో పార్టీకి మంచి ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి కనీసం జీహెచ్ఎంసీ ఎన్నికలకయినా పార్టీని సమాయుత్తం చేసి మంచి ఫలితాలు సాధిస్తే పార్టీ కొంతమేర మళ్ళీ పుంజుకోవచ్చు!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close