వైసీపీ నేతల్ని ఎవరూ ఏమీ చేయాల్సిన పని లేదు. వారే పిచ్చి పిచ్చి వ్యూహాలతో తమను తాము నిర్వీర్యం చేసుకుంటారు. టీడీపీ ట్రాప్ చేయాల్సిన పని కూడా లేదు. వారంతటకు వారే వచ్చి గొయ్యిలో పడిపోతారు. అసెంబ్లీకి హాజరు కాకూడదని తీసుకున్న నిర్ణయం అలాంటి ట్రాప్‌లలో అతి పెద్దది. వారి ఈగోను సరిగ్గా అంచనా వేసిన టీడీపీ నేతలు.. అసెంబ్లీకి రండి అని.. ఆహ్వానిస్తున్నారు. మాట్లాడిస్తామని.. సమయం ఇస్తామని ..రాకుండా జీతాలు తీసుకోవడం సముచితం కాదని స్పీకర్ కూడా అంటున్నారు. ఎలా చూసినా.. సరైన కారణం లేకుండా అసెంబ్లీని బహిష్కరించడం వైసీపీకి దిద్దుకోలేని తప్పుగా మారనుంది.
అసలు అదేం కారణం అన్నా ?
ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా అని జగన్ రెడ్డి అంటున్నారు. అసలు అలాంటి కారణం చెప్పి అసెంబ్లీని బహిష్కరించాలన్న ఆలోచన రావడమే సిల్లీగా ఉంటుంది. ఎవరైనా.. ప్రభుత్వ వేధింపులు లేకపోతే మరో బలమైన ప్రజా కోణంలోని కారణంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకుంటారు.. అది కూడా ఒక్కరే తీసుకుంటారు కానీ.. ఇక్కడ జగన్ రెడ్డి తనకు హోదా లేదని ఇవ్వడం లేదని.. అందర్నీ అసెంబ్లీకి పంపకపోవడం మాత్రం.. ఆయన మనస్తత్వాన్ని ప్రజల ముందు ఉంచింది. దీంతో వైసీపీ నవ్వులాట అయిపోయింది.
సమయం ఇస్తారో లేదో వెళ్తేనే కదా తెలుస్తుంది ?
సమయం ఇవ్వరని.. వైసీపీ సభ్యులు అంటున్నారు. స్పీకర్ సహా అధికార పార్టీ మొత్తం.. తగినంత సమయం ఇస్తాం రావాలని బతిమాలుతున్నారు. అసెంబ్లీకి రాకుండా జీతాలు ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. అసలు వస్తేనే కదా.. అధికార పార్టీ సమయం ఇస్తుందో లేదో అన్నది తెలుస్తుంది. వారికి ఉన్నది పదకొండు మంది సభ్యులే అయినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఏకైక విపక్షం కాబట్టి వారికి సంఖ్యాబలం కంటే ఎక్కువ సమయమే ఇస్తారు. ఇవ్వకపోతే ప్రజలు .. ప్రతిపక్షాన్ని మాట్లాడనీయలేదని అనుకుంటారు. అప్పుడు ప్రతిపక్షానికే కాస్త సానుభూతి అయినా లభిస్తుంది. కానీ అసలు అసెంబ్లీకే వెళ్లకపోతే వీళ్లేం ఎమ్మెల్యేలు .. ఇదేం పార్టీ అని అనుకుంటారు.
పోరాడలేని వైసీపీకి రాజకీయాలెందుకు?
రాజకీయమంటేనే పోరాటం. వెనుకడుగు వేయకూడదు. కానీ జగన్ రెడ్డి.. తాను తన గ్రౌండ్ లో ఆడుకుంటాను.. అంటున్నారు. అసలు మ్యాచ్ కు రాను అంటున్నారు. మీరు గ్రౌండ్ లో ఆడుకోండి.. నేను ఇంట్లో ప్రాక్టిస్ చేసుకుంటానంటున్నారు. ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్లకి రాజకీయాలు వేస్ట్. కుల, మతాలను అడ్డం పెట్టుకుని కాస్త ఓటు బ్యాంక్ ఉంటుంది.. వారంతా గొర్రెలు.. ఎం చేసినా తన వెనకే వస్తారని అనుకునే మైండ్ సెట్‌తో చేసే రాజకీయాలు ఎప్పటికీ వర్కవుట్ కావు. పోరాడలేని పార్టీ రాజకీయంగా సమాధి అయినట్లే.