ప్రొ.నాగేశ్వర్ : ప్రత్యేకహోదాకు నిధులెక్కడి నుంచి వస్తాయంటున్న జైట్లీ..!

కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టింది. రాహుల్ గాంధీ ఈ విషయాన్ని చాలా కాలం నుంచి చెబుతున్నారు. చివరికి ఇది ఎన్నికల హామీ కాకుండా ఉండటానికి.. ఎన్నికల వాగ్దానంగా మేనిఫెస్టోలో ప్రకటించారు. అయితే… భారతీయ జనతా పార్టీ… వెంటనే స్పందించింది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామనడాన్ని ఖండించారు. నిధులు ఎక్కడి నుంచి తెస్తారని.. ప్రశ్నించారు. దీంతో.. బీజేపీ విధానం మరో సారి బయటపడినట్లయింది. కానీ ఇక్కడ గుర్తించాల్సింది ఏమిటంటే.. అసలు హోదా డిమాండ్ మొదట బీజేపీనే చేసింది.

హోదా పేరు లేకపోయిన అన్నీ ఇచ్చామన్న బీజేపీ..! ఇప్పుడు నిధులెక్కడివి అంటోందేంటి..?

విభజన చట్టం బిల్లు పార్లమెంట్‌లోకి వచ్చినప్పుడు.. ఏపీ తీవ్రంగా నష్టపోతుంది కాబట్టి… ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఆ రోజు రాజ్యసభలో ఉన్న ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. ఏపీకి ప్రత్యేకహోదా కోసం పట్టుబట్టారు. ఐదేళ్లు కాదు పదేళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అరుమ్ జైట్లీ ఈ అంశంపై.. కాంగ్రెస్ పార్టీని మరింత ఇరుకున పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ.. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తేనే బిల్లుకు మద్దతిస్తామన్నారు. చివరికి.. బీజేపీ డిమాండ్‌కు తలొగ్గిన అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఏపీకి ఐదేళ్లు ప్రత్యేకహోదా ప్రకటించారు. అంటే… బీజేపీనే ఇందులో కీలకం. మరి అదే బీజేపీ… అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకహోదా ఇవ్వలేదు.. ప్రజలు అన్నీ చూస్తూంటారనే సంగతిని మర్చిపోకూడదు. హోదా సాధించామని సన్మానాలు చేసుకున్నది కూడా వాళ్లే. ఇప్పుడు నిధులు ఎక్కడ్నుంచి వస్తాయంటున్నది కూడా వాళ్లే. ఎన్ని నిధులు కావాలో కనీసం చెప్పలేదు కదా..! ప్రత్యేకహోదా ఇవ్వకపోయినా… ఆ పేరు లేకపోయినా.. అంతకు మించిన నిధుల లబ్ది కలిగిస్తామని చెప్పి… ప్యాకేజీ ప్రకటించారు. హోదా పేరు లేదు కానీ… అంత కన్నా ఎక్కువే ఇస్తామని.. బీజేపీ నేతలు ప్రకటించారు. మరి అప్పుడు నిధులు ఎక్కడ్నుంచి వచ్చాయి..?. ఇప్పుడు నిధులు ఎక్కడ్నుంచి వస్తాయని… అడుగుతున్న అరుణ్ జైట్లీ… ప్యాకేజీలో హోదా కన్నా ఎక్కువ ఇస్తున్నామని చెబుతున్నారు కదా.. ! అవి ఎక్కడ్నుంచి వచ్చాయి..?

బీహార్, ఒడిషా, బెంగాల్ ప్రస్తావన తెచ్చి రెచ్చగొట్టాలనుకుంటున్నారా..?

భారతీయ జనతా పార్టీ నేతలు.. చాలా రోజులుగా… ఏపీకి… అన్నీ ఇచ్చేశామని చెబుతున్నారు. ప్రత్యేకహోదా వస్తే ఎన్ని నిధులు వస్తాయో.. అంత కన్నా ఎక్కువే ఇస్తామంటున్నారు. మరి ఇప్పుడు అరుణ్ జైట్లీ ప్రకటనపై వారు నోరు విప్పాలి. ఏపీకి అన్నీ ఇస్తే.. ప్రత్యేకహోదాకు నిధులు ఎక్కడ్నుంచి వస్తాయని… జైట్లీ ఎందుకు చెబుతున్నారో అడగాలి. ఏపీకి హోదా ఇస్తే.. బెంగాల్, బీహార్, ఒడిషా లాంటి రాష్ట్రాల పరిస్థితేమిటని.. జైట్లీ మరో ప్రశ్న వేశారు. బీహార్‌కు.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు… మోడీ.. ఏకంగా లక్షా అరవై వేల కోట్లు ప్యాకేజీ ప్రకటించారు. అప్పుడు.. పక్కనున్న యూపీ .. జార్ఖండ్… బెంగాల్ అడగలేదా..?. నిన్నటికి నిన్న.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఏపీకి వచ్చి… ప్రత్యేకహోదాకు మద్దతు ప్రకటించలేదా..? ఇవన్నీ కళ్ల ముందు కనిపిస్తూండగానే.. అరుణ్ జైట్లీ… ఏ లాజిక్ ప్రకారం… కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన ప్రత్యేకహోదా అంశాన్ని ప్రశ్నించారు. నిధులు ఎక్కడ్నుంచి వస్తాయి..? ఇతర రాష్ట్రాల సంగతేమిటని.. ఎందుకు ప్రశ్నిస్తున్నారు…?

హోదా విషయంలో మాట తప్పడమే కాదు ఇప్పుడు మోసం చేస్తున్నారు ..!

అసలు.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా విషయంలో… ఎందుకు అమలు చేయలేకపోతున్నారంటే.. ఇప్పటి వరకూ పధ్నాలుగో ఆర్థిక సంఘాన్ని కారణంగా చూపేవారు. నేరుగా పార్లమెంట్‌లోనే.. ఈ ప్రకటన చేశారు. పధ్నాలుగో ఆర్థిక సంఘం వద్దన్నది కాబట్టి ఇవ్వలేదంటున్నారు. హోదా పేరు లేకపోయినా… మొత్తం నిధులిస్తున్నామని చెప్పారు. మరి కొత్తగా.., ఈ నిధులు, ఇతర రాష్ట్రాల వాదన ఎందుకు తీసుకొస్తున్నారు..?. ఏపీ ప్రత్యేకహోదా విషయం వస్తే.. ఇతర రాష్ట్రాల అంశాలను తెరపైకి తెస్తున్నారు. పార్లమెంట్‌లో ఇచ్చిన హామీని నెరవేరుస్తామని.. తిరుపతికి వచ్చి… వెంకన్న పాదాల చెంత.. బహిరంగసభ పెట్టి.. ప్రత్యేకహోదా ఇస్తామని ప్రకటించారు. ఇప్పుడు.. దాన్ని ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టారని స్పష్టమయింది. ఎన్నికల హామీలను ఎగ్గొట్టారనుకుందాం.. కానీ.. దేవుడ్ని నమ్మి.. దేవుడి పేరుతో రాజకీయం చేసే బీజేపీ… ఆ దేవుడి చెంత చేసిన హామీనైనా అమలు చేయాల్సి ఉంది. అసలు ప్రత్యేకహోదాకు పట్టుబట్టిన అరుణ్ జైట్లీనే.. ఇలా అడ్డగోలు వాదనతో.. దారుణమైన మోసం చేస్తున్నామని చెప్పకచెబుతున్నారు. వారికి ఏపీలో రాజకీయ ప్రయోజనాలు లేవు.. ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయి కాబట్టే.. ఇలా చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.