తెలంగాణ రాజకీయాల్లో ఎక్కడ ఏ చిన్న సంచలనం జరిగినా, హుజూరాబాద్ నుంచి గచ్చిబౌలి వరకూ ఎక్కడ ఏ మైక్ కనిపించినా అక్కడ వాలిపోయే ‘హైపర్ యాక్టివ్’ బ్రాండ్ రాజకీయం గులాబీ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సొంతం. నిత్యం ప్రెస్ మీట్లు, సవాల్-ప్రతిసవాళ్లు, ఓ రేంజ్ హడావుడితో మీడియా అటెన్షన్‌ను తనవైపు తిప్పుకునే కౌశిక్ రెడ్డి.. గత కొద్దిరోజులుగా పొలిటికల్ స్క్రీన్‌పై పెద్దగా కనిపించడం లేదు. రాష్ట్రంలో ఎన్నో రసవత్తర రాజకీయ పరిణామాలు, వివాదాలు తెరపైకి వస్తున్నా, ఆయన మాత్రం ఎక్కడా తన మార్క్ ప్రజెన్స్ చూపించకపోవడం ఇప్పుడు కరీంనగర్ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
అతి తగ్గించుకోవాలని పెద్దల సలహా
మామూలుగా అయితే ఈ పాటికి సదరు ఇష్యూలపై కౌశిక్ రెడ్డి తన స్టైల్లో విరుచుకుపడాల్సింది, కౌంటర్లు పడాల్సింది. కానీ, ఇప్పుడు ఊహించని విధంగా ఆయన మెయింటైన్ చేస్తున్న ఈ ‘సైలెన్స్’ వెనుక తాటికాయంత నిజం దాగి ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన చేస్తున్న అతి, ముక్కుసూటిగా కాకుండా హద్దులు దాటి చేస్తున్న కామెంట్ల వల్ల కేడర్‌లో జోష్ రావడం పక్కన పెడితే, పార్టీ ఇమేజ్ జాతీయ స్థాయిలో దెబ్బతింటోందని గులాబీ బాస్ గట్టిగానే గుర్తించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే పార్టీ హైకమాండ్ నుండి ఆయనకు గట్టి షాక్‌లు, స్పష్టమైన వార్నింగ్‌లు వెళ్లినట్లు తెలుస్తోంది.
మళ్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే వరకూ సైలెంట్ మోడ్‌నే
“అతి సర్వత్ర వర్జయేత్” అనే చందంగా.. కౌశిక్ రెడ్డి వైఖరి పార్టీకి మైలేజ్ కంటే డామేజ్ ఎక్కువగా తెస్తోందని, ముఖ్యంగా తటస్థ ఓటర్లలో పార్టీపై వ్యతిరేకత పెరగడానికి ఈ హడావుడే కారణమనే అసంతృప్తి అధిష్టానంలో వ్యక్తమైందట. దీంతో “కాస్త ఆ వేగం తగ్గించుకోమ్మా.. కొన్నాళ్ల పాటు సైలెంట్‌గా ఉండి గ్రౌండ్ వర్క్ చూసుకో” అంటూ గట్టి క్లాస్ పీకడంతోనే ఈ ఫైర్ బ్రాండ్ నేత హఠాత్తుగా అజ్ఞాతవాసంలోకి వెళ్లినట్లు పొలిటికల్ విశ్లేషకులు సెటైర్లు వేస్తున్నారు. హైకమాండ్ ఇచ్చిన డోస్‌తోనే ఆయన రూట్ మార్చి, కెమెరాల ముందుకు రాకుండా సైలెంట్ మోడ్‌లోకి షిఫ్ట్ అయ్యారనే ప్రచారం జోరందుకుంది.
సైడ్ ఆర్టిస్టులుగా కనిపించడం మాత్రమే!
ఒకప్పుడు మీడియా మైకులు కనిపిస్తే దూసుకుపోయే కౌశిక్ రెడ్డి.. ఇప్పుడు కాస్త ఆచితూచి అడుగులు వేయడం గులాబీ కేడర్‌కు సైతం మింగుడుపడటం లేదు. అయితే ఈ పొలిటికల్ సైలెన్స్ కేవలం తాత్కాలికమేనా, లేదా అధిష్టానం గీసిన గీత దాటకుండా ఉండేందుకేనా అనేది మున్ముందు తేలనుంది. ఏది ఏమైనా, ఎప్పుడూ రచ్చ లేపే కౌశిక్ రెడ్డి ఇలా సడన్‌గా సైలెంట్ అవ్వడం మాత్రం యూట్యూబ్ చానళ్లకు కొంచెం ఇబ్బందిగానే మారింది.
