రాజధాని ఎక్కడ…? రాజధాని ఎక్కడ ? అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు.. ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపైనా… ప్రభుత్వంలో ఉన్న మంత్రులపైనా విమర్శలు చేస్తూంటారు కానీ… వారు మాత్రం చాలా సింపుల్‌గా ఆన్సర్ ఇచ్చేస్తూంటారు. మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ఇంకా ఇంకా సింపుల్‌గా ఆన్సర్ చేస్తారు. తాజాగా రాజధాని అంటే ఏమిటి అనేదానికి ఆయన ఇచ్చిన సమాధానానికి అందరికీ మైండ్ బ్లాంక్ కావాల్సిందే. సీఎ జగన్ ఎక్కడ ఉంటే అదే రాజధాని అని తేల్చేశారు. అది పులివెందుల అయినా కావొచ్చన్నారు. అమరావతి.. విశాఖ అయినా కావొచ్చన్నారు. మేకపాటి ఇచ్చిన సమాధానంతో సీఎం జగన్‌కు ఎక్కడ ఇళ్లుఉంటే.. అవన్నీ రాజధానిగా లెక్కలేసుకోవచ్చని అంచనా వేస్తున్నారు టీడీపీ నేతలు.
ఈ లెక్కన బెంగళూరు, హైదరాబాద్ కూడా ఏపీ రాజధానులు అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటి వరకూ సీఎంజగన్ కు విశాఖలోనే ఇల్లు లేదు. కానీ అక్కడికే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ను మారుస్తామని ప్రకటిస్తున్నారు. ఇప్పుడు ఇల్లు ఉన్నా లేకపోయినా సీఎం జగన్ విశాఖ వెళ్లి పరిపాలిస్తే అదే రాజధాని అని తేల్చేస్తున్నారు. అసలు మూడు రాజధానుల నిర్ణయం ఎందుకు తీసుకున్నారన్నదానిపై మంత్రులు రకరకాల కారణాలుచెబుతూ ఉంటారు. మంత్రి గౌతంరెడ్డి మాత్రం అందరి కంటే భిన్నమైన కారణం చెబుతారు. అదేమిటంటే.. శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం మూడు రాజధానులు పెట్టారు.
అసలు శ్రీభాగ్ ఒప్పందం ఏమిటో తెలిస్తే మంత్రి ఇలా మాట్లాడేవారు కాదని కొంత మంది అనొచ్చు కానీ… ఆ ఒప్పందంలో ఏముందో మంత్రికే తెలియదు సామాన్యుల కేం తెలుస్తుంది. అందుకే అసువుగా వాడేశారు. మంత్రి మేకపాటి ఇటీవలి కాలంలో చేస్తున్న వ్యాఖ్యలు ఇలాగే ఉంటున్నాయి. పరిశ్రమలే రావడం లేదని గగ్గోలు పెడుతూంటే ఏపీ నుంచి అంబానీలను.. అదానీలను తయారు చేస్తామని ప్రకటించేశారు. కారణం ఏదైనా కానీ వైసీపీ నేతలు వ్యూహాత్మకంగానే రాజధాని విషయంలో గందరగోళ ప్రకటనలు చేస్తున్నారన్న అభిప్రాయం మాత్రం ప్రజల్లో వినిపిస్తోంది.