తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు వినిపిస్తున్న అత్యంత వివాదాస్పదమైన, ఆసక్తికరమైన పేరు సూదిని సృజన్ రెడ్డి. ప్రతీ దానికి సృజన్ రెడ్డి పేరును తెరపైకి తెస్తున్న బీఆర్ఎస్.. రేవంత్ పై ఆరోపణలు చేస్తోంది. కానీ ఈ సృజన్ రెడ్డి బీఆర్ఎస్ హయాంలోనే ఎక్కువ కాంట్రాక్టులు పొందారని డీటైల్స్ వెలుగులోకి వచ్చాయి.
సూదిని సృజన్ రెడ్డికి కేవలం ఒక వ్యాపారవేత్తగానే కాకుండా, అధికార పార్టీ ఏదైనా తన హవాను కొనసాగించగల వ్యక్తిగా ఆయనకు గుర్తింపు ఉంది. సృజన్ రెడ్డికి ఉన్న రాజకీయ సంబంధాల చార్ట్ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఆయన మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి అల్లుడు కాగా, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భార్య వైపు నుంచి ఆయనకు కాస్త దూరం బంధుత్వం ఉంది. ఇలా అటు ప్రతిపక్షం, ఇటు అధికార పక్షం రెండింటితోనూ ఆయనకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
సృజన్ రెడ్డి పేరు మొదట ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ప్రాచరంలోకి వచ్చింది. ఈ కేసులో ఈడీ, సిబిఐ సోదాలు జరిగినప్పుడు ఆయన పేరు ప్రముఖంగా వినిపించింది. అప్పట్లో బీఆర్ఎస్ అగ్రనేతలకు అత్యంత సన్నిహితుడిగా, ఆ పార్టీ ఆర్థిక మూలాల్లో కీలక వ్యక్తిగా ఆయనపై ఆరోపణలు వచ్చాయి. రాజకీయ వర్గాల్లో కొందరు ఆయన్ని ఒక చిన్న చేపగా అభివర్ణిస్తే, మరికొందరు మాత్రం తెరవెనుక చక్రం తిప్పే “కింగ్‌పిన్” అని విశ్లేషిస్తుంటారు.
కాంట్రాక్టుల విషయానికి వస్తే, సృజన్ రెడ్డికి చెందిన సంస్థలు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భారీ ప్రాజెక్టులను దక్కించుకున్నాయి. ముఖ్యంగా మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టుల్లో ఆయన సంస్థలు కీలక పాత్ర పోషించాయి. అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వంతో ఉన్న సాన్నిహిత్యం వల్ల వేల కోట్ల విలువైన పనులు ఆయనకు దక్కాయని విపక్షాలు ఆరోపించేవి. అయితే, ప్రభుత్వం మారిన తర్వాత కూడా సృజన్ రెడ్డి హవా తగ్గకపోవడం గమనార్హం. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఆయనకు సంబంధించిన కంపెనీలు కొన్ని కాంట్రాక్టుల్లో పాలుపంచుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఏ పార్టీ అధికారంలో ఉన్నా, తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడంలో ఆయన చూపుతున్న నేర్పు రాజకీయ విశ్లేషకులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. నిజానికి సృజన్ రెడ్డి వంటి వ్యక్తులు రాజకీయాలకు, వ్యాపారాలకు మధ్య ఉండే వంతెన లాంటి వారు. ఏ ప్రభుత్వం ఉన్నా తమ పనులు జరుపుకోగల సామర్థ్యం ఉండటం వల్లే వీరికి అన్ని పార్టీల్లోనూ స్నేహితులు ఉంటారు. కానీ బీఆర్ఎస్ ఇప్పుడు రేవంత్ ను టార్గెట్ చేయడానికి సృజన్ రెడ్డిని అస్త్రంగా వాడుకోవడమే సంచలనంగా మారింది.
