తమిళ స్టార్ విజయ్ ప్రస్తుతం రాజకీయాలపై దృష్టి సారించారు. ఆయన ఆఖరి సినిమాగా ప్రచారం చేస్తున్న ‘జననాయగన్’ రిలీజ్ ఇబ్బందుల్లో ఉంది. సెన్సార్ సమస్యల వల్ల ఈ సినిమా బయటకు రావడం లేదు. సంక్రాంతికి విడుదల కావాల్సిన సినిమా ఇది. ఎప్పుడు వస్తుందో కూడా తెలీదు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక సన్నివేశం, పాట ముందే లీక్ అయిపోవడం తమిళ నాట చర్చనీయాంశం అయ్యింది. ఆ సీన్లు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాంతో అప్రమత్తమైన చిత్రబృందం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అయితే ఈ సీన్లు కావాలనే లీక్ చేశారన్నది తమిళ నాట బలంగా వినిపిస్తున్నమాట. సినిమా ఆలస్యం అవుతుండడంతో, సింపతీ కోసం నిర్మాతే ఈ పని చేశారని విజయ్ ప్రత్యర్థులు వ్యాఖ్యానిస్తున్నారు. ‘జననాయగన్’ ని విజయ్ తన పొలిటికల్ మైలేజీ కోసం వాడుకొందామనుకొన్నారు. అందుకే సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో పొలిటికల్ పంచ్‌లు విసిరారు. బయటకు వచ్చిన సీన్లోనూ అవే వినిపించాయి. సినిమా బయటకు రాకపోయినా… తన ఉద్దేశ్యాన్ని చాటి చెప్పాలన్న ఆలోచనతోనే ఈ సీన్‌ని కావాలని లీక్ చేశారని నాన్ విజయ్ ఫ్యాన్స్ వాదిస్తున్నారు. అయితే ఈ లీకేజీపై చిత్రబృందం ఇప్పటి వరకూ స్పందించలేదు. సీన్ , పాట మాత్రమే బయటకు వచ్చాయా, లేదంటే సినిమా మొత్తం లీక్ అయిపోయిందా అనేది తెలియలేదు. సినిమా మొత్తం వచ్చేస్తే అది నిర్మాతలకు పెద్ద దెబ్బే. రిలీజ్ ఆలస్యం అవుతున్న తరుణంలో ఓటీటీ సంస్థ తమ ఒప్పందాన్ని రద్దు చేసుకొనే ప్రయత్నంలో ఉంది. ఈలోగా.. ఈ లీకుల బెడద ఒకటి. దీన్నుంచి ఈ సినిమా ఎలా బయట పడుతుందో?
