తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రాంచంద్రరావు పేరును హైకమాండ్ ఖరారు చేసింది. తీవ్ర పోటీ నెలకొన్న సమయంలో ఒకరికి ఇస్తే మరొకరు అసంతృప్తి చెందకుండా వీలైనంత వరకూ ఏకాభిప్రాయంతో ఎవరూ అభ్యంతరం చెప్పని పేరును ఖరారు చేసింది. ఈ విషయంలో అనుకున్న ఫలితం సాధిస్తారు కానీ.. పార్టీ బలోపేతం సంగతేమిటన్నది పెద్ద ప్రశ్నగా మారింది. పార్టీని రామచంద్రరావు అధికార పీఠం వైపు తీసుకెళ్లగలరని ఎక్కువ మంది నమ్మడం లేదు.
రాంచంద్రరావు నిఖార్సైన బీజేపీ నేత …కానీ
తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడు రామచంద్రరావు నిఖార్సైన బీజేపీ నేత. బీజేపీలో వర్గ పోరాటం గురించి ప్రచారం జరుగుతూ ఉంటుంది. కానీ ఆయన పేరు మాత్రం పెద్దగా ప్రచారంలోకి రాదు. ఆయన పని ఆయన చేసుకుంటారు. గతంలో ఎమ్మెల్సీగా కూడా గెలిచారు. బీజేపీ భావజాలం, ఆరెస్సెస్ మూలాలతో ఆయన సిన్సియారిటీని అందరూ గౌరవిస్తారు. కానీ తెలంగాణ రాజకీయాల్లో భాగంగా ఉండాల్సినంత దూకుడును ఆయన చూపించలేరన్న అభిప్రాయం మాత్రం ఆ పార్టీ క్యాడర్లోనే ఉంది.
రామచంద్రరావు ఎంపిక వెనుక వ్యూహం ఏమిటి?
రామచంద్రరావు.. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ బీజేపీకి పొటెన్షియల్ కాదని ఎక్కువ మంది నమ్ముతున్నారు. మరి ఈ విషయం హైకమాండ్ కు తెలియదా అంటే.. ఖచ్చితంగా తెలుస్తుంది. వారు కూడా ప్రత్యేకమైన వ్యూహంతోనే ఆయన పేరును ఖరారు చేసి ఉంటారని అంచనా చేస్తున్నారు. ఎన్నికల సమయంలో బీజేపీ , బీఆర్ఎస్ మధ్యనే పోటీ జరుగుతోందన్న భావన ఉన్న సమయంలో బండి సంజయ్ ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. ఫలితంగా సీన్ మారిపోయింది. ఆ సమయంలో ఓట్ల చీలిక ద్వారా బీఆర్ఎస్ మళ్లీ గెలిచే ప్రమాదం ఉందన్న కారణంగా బీజేపీ వెనక్కి తగ్గిందని.. బీఆర్ఎస్ను ఓడించడం ద్వారా ఆ పార్టీని నిర్వీర్యం చేసి.. గ్రౌండ్ ను స్వాధీనం చేసుకోవాలని అనుకుందని అందుకే..కాంగ్రెస్ గెలుపునకు పరోక్షంగా సహకరించిందని అనుకున్నారు. దానికి తగ్గట్లుగనే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ ను కైవసం చేసుకుంది. ఆ మూమెంట్ ను కొనసాగించడానికి .. బండి సంజయ్ లేదా.. అర్వింద్..ఈటల రాజేందర్ వంటి వారిని నియమిస్తారని అనుకున్నారు. ఇక్కడ బీజేపీ హైకమాండ్ తమ లెక్కలే వేరని తేల్చింది.
బీఆర్ఎస్ విలీనం లేదా పొత్తుల కోసమే !
బీఆర్ఎస్ నీడ పడినా సహించని బీజేపీ నేతలు ధర్మపురి అర్వింద్, బండి సంజయ్. వారిని అధ్యక్షులుగా నియమిస్తే.. బీఆర్ఎస్ పై దాడి. చేస్తారు. అది బీజేపీ పెద్దల వ్యూహానికి విరుద్ధం కావొచ్చు. అందుకే ఈటల రాజేందర్ బీఆర్ఎస్తో సఖ్యత లేదా విలీనానికి తాను వ్యతిరేకం కాదని చెప్పేందుకు ఇటీవల ప్రయత్నించారు. కానీ ఆయనకు పార్టీలో బలమైన వ్యతిరేక వర్గం ఉంది. అందుకే మధ్యేమార్గంగా రామచంద్రరావును ఖరారు చేశారు. ఎలా చూసినా.. బీఆర్ఎస్ తో సంబంధాల కోణంలోనే ఈ కొత్త అధ్యక్షుడి ఎంపిక అన్నది ఎక్కువ మందికి వస్తున్న సమాధానం.