‘గేమ్ ఛేంజర్’ సినిమా దిల్ రాజు ప్రొడక్షన్ కి ఓ చేదు జ్ఞాపకం. ఎంత పోయిందో లెక్కే లేదు. వెంటనే సంక్రాంతి కి వస్తున్నాంతో హిట్టు కొట్టి, తెరిపిన పడ్డారు కానీ.. లేదంటే ఆ సంస్థ ఏమైపోయేదో. గేమ్ ఛేంజర్ డామేజీ గురించి దిల్ రాజు తానిచ్చిన అన్ని ఇంటర్వ్యూల్లోనూ చెబుతూనే వచ్చారు. అయితే సోదరుడు శిరీష్ తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయనా గేమ్ ఛేంజర్ ఫ్లాపు గురించి తనదైన విశ్లేషణ ఇచ్చారు. కాకపోతే సినిమా ఫ్లాప్ అయినా తమని హీరోగానీ, దర్శకుడు కానీ ఏమాత్రం పట్టించుకోలేదని, ఫోన్ చేసి కూడా పలకరించలేదని వాపోయారు.
గేమ్ చేంజర్ ఫ్లాప్ కాదు. ఊహించని డిజాస్టర్. అలాంటి సమయంలో హీరో ఎంతో కొంత నిర్మాతకు వెన్నుదన్నుగా ఉండాల్సిన అవసరం ఉంది. కాకపోతే.. ‘ఆర్.ఆర్.ఆర్’ తరవాత రామ్ చరణ్ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. అలాంటి సమయంలో చరణ్ తో సినిమా చేయడమే ఓరకంగా జాక్ పాట్. ఎంతోమంది నిర్మాతలు క్యూలో ఉన్నా, దిల్ రాజుకి అవకాశం ఇచ్చాడు చరణ్. దాన్ని దిల్ రాజునే నిలబెట్టుకోలేకపోయాడు. శంకర్ అవుడ్డేటెట్ అయిపోయాడని తెలిసి కూడా, ఎప్పుడో ఇచ్చిన అడ్వాన్స్ ని కవర్ చేసుకోవడానికి చరణ్‌కీ, శంకర్ నీ కలిపేశాడు. చరణ్ ఇక్కడ నమ్మింది శంకర్‌ని మాత్రమే కాదు, దిల్ రాజుని కూడా.
శంకర్ రావడం వల్ల బడ్జెట్లు మారిపోయాయి. లెక్కలు మారిపోయాయి. అవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టారు. రీ షూట్లు, వేస్టేజీల గోల సరే సరి. శంకర్ కాకుండా మరో దర్శకుడితో సినిమా చేస్తే కచ్చితంగా టేబుల్ ప్రాఫిట్ సినిమా అయ్యేది. సినిమాకున్న క్రేజ్ ని క్యాష్ చేసుకొంటే అటూ ఇటుగా వంద కోట్లయినా మిగిలేది. కానీ ఇదంతా దిల్ రాజు చేయలేకపోయాడు.
సంక్రాంతి సీజన్లో ఒకే నిర్మాతవి రెండు సినిమాలు విడుదల చేయడం ఓ అరుదైన సంగతి. గేమ్ చేంజర్, సంక్రాంతి కి వస్తున్నాం రెండూ దిల్ రాజు బ్యానర్లోనుంచే వచ్చాయి. ‘గేమ్ చేంజర్ వుంది కదా.. మళ్లీ మీ బ్యానర్ నుంచి మరో సినిమా ఎందుకు’ అని చరణ్ ఆపి ఉంటే.. సంక్రాంతికి వస్తున్నాం ఆ సమయానికి వచ్చేది కాదు. ఈ విషయాన్ని దిల్ రాజే చెప్పారు. చిరు, చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్లే… సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ చేయగలిగాం, వాళ్లకు థ్యాంక్స్ అని కృతజ్ఞతలు చెప్పుకొన్నాడు దిల్ రాజు. ఆ విషయాన్ని శిరీష్ మర్చిపోతే ఎలా?
ఇప్పుడు చరణ్‌తో మరో సినిమా చేస్తా అని దిల్ రాజు ప్రకటించడం కూడా విడ్డూరమే. ఓ వైపు ఫ్లాప్ అయినా మమ్మల్ని పట్టించుకోలేదు అని నిందిస్తూనే, ఇంకో సినిమా చేస్తాం అంటే చరణ్ ఎలా ఒప్పుకొంటాడు? ఆర్.ఆర్.ఆర్ తరవాత దిల్ రాజు బ్యానర్లో సినిమా చేయడమే ఎక్కువ అనేది మెగా ఫ్యాన్స్ మాట. ఇలాంటిది శిరీష్ ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తే, మళ్లీ ఈ బ్యానర్లో చరణ్ సినిమా చేస్తానంటే.. ఫ్యాన్స్ ఒప్పుకొంటారా? శిరీష్ నోరు జారడం వల్ల… అసలు ఈ బ్యానర్ లో చరణ్ ఎప్పటికీ సినిమా చేయడేమో అనే అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. చరణ్‌ని మళ్లీ పట్టాలంటే దిల్ రాజు చాలా కవర్ డ్రైవ్‌లు కొట్టాలి.