సొగసు చూడతరమా, చూడాలనివుంది, ఒక్కడు మొన్నటి రుద్రమదేవి. జాగ్రత్తగా గమనిస్తే… కథల్ని ఎంచుకొనే విషయంలో గుణ శేఖర్ స్పెషాలిటీ అర్థమవుతూ ఉంటుంది. తన సినిమా హిట్లో, ఫ్లాపో.. ఆ సంగతి పక్కన పెడితే గత సినిమాలకీ, ప్రస్తుత సినిమాకీ పూర్తి విభిన్న నేపథ్యం ఎంచుకోవడం గుణ స్టైల్ ఆఫ్ మేకింగ్. ఈసారీ అదే చేస్తున్నాడు. రుద్రమదేవి తరవాతి ప్రాజెక్టుగా హిరణ్యకశ్యపని ఎనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. బాల రామాయణం తరవాత గుణ చేయబోతున్న మైథలాజికల్ సినిమా ఇదే. ఇందుకు గ్రౌండ్ వర్క్ కూడా పూర్తి స్థాయిలో సిద్దం చేసుకొంటున్నాడు. రుద్రమదేవి నిరాశ పరిచినా.. గుణశేఖర్‌పై నమ్మకం చావలేదు. ఎప్పటికైనా గుణ తనలోని క్లాస్‌ని బయటపెట్టడం ఖాయమని ఇప్పటి స్టార్ హీరోలంతా నమ్ముతున్నారు. అంతా కాకపోయినా.. కొంతమందికైనా గుణపై ఆ కాన్ఫిడెన్స్ ఉంది. అందుకే గుణ ఇప్పుడు ధైర్యంగా తన తదుపరి ప్రాజెక్ట్ ని ఎనౌన్స్ చేయగలిగాడు.
హిరణ్యకశ్యప పాత్రలో ఓ స్టార్ హీరో కనిపించబోతున్నాడన్న హింట్ ఇచ్చేశాడు గుణశేఖర్. మాస్ సినిమాలు చేసీ చేసీ విసిగిపోయి.. కొత్త తరహా సినిమా. వైవిధ్యమైన `హీరోయిజం` కావాలనుకొనే కథానాయకులకు హిరణ్య కస్యప అనేది ఊరించే సబ్జెక్టే. పైగా భక్తప్రహ్లాద అనే క్లాసిక్ చిత్రాన్ని మరోసారి గుర్తు చేసినట్టు అవుతుంది. రుద్రమదేవిలో గోన గన్నారెడ్డి పాత్రని జనరంజకంగా తీర్చిదిద్దిన గుణశేఖర్… ఆ పాత్రని ట్రంప్‌కార్డ్‌గా చూపించుకొని పెద్ద హీరోల మనసు గెలుచుకొంటాడన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. పైగా నెగిటీవ్ టచ్ ఉన్న పాత్రలు చేయడానికి ఇప్పుడు హీరోలంతా మొగ్గు చూపుతున్నారు. వాళ్లందరికీ గుణ ఇప్పుడు ఓ మంచి ఆప్షన్. హిరణ్యకశ్యప పాత్ర కి ఎవరైతే బాగుంటారా అనే విషయంలో గుణ శేఖర్ ఆల్రెడీ ముగ్గురు పేర్లు ఫిక్స్ చేసుకొన్నాడని సమాచారం. అల్లు అర్జున్, ఎన్టీఆర్, రానాల్ని బెస్ట్ ఆప్షన్లుగా ఎంచుకొన్నాడట గుణశేఖర్. ముందు బన్నీకి ఆ తరవాత ఎన్టీఆర్‌కీ .. వీళ్లిద్దరూ కాదన్న పక్షంలో అప్పుడు రానాతో ప్రొసీడ్ అవుదామని గుణ భావిస్తున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ ముగ్గురు హీరోలూ తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆ సినిమాలు పూర్తయ్యే సరికి.. పూర్తి స్థాయిలో ఈ కథని సిద్దం చేసుకోవాలని భావిస్తున్నాడు గుణ శేఖర్. ఆయన ప్లానింగ్ అంతా పక్కాగానే ఉంది. మరి.. ఈ ముగ్గురు హీరోలూ ఏమంటారో చూడాలి.