ఆ నాయ‌కుల్లో ద‌త్త‌న్న వార‌సులు ఎవ‌రు..?

సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి బండారు ద‌త్తాత్రేయ కాస్త అసంతృప్తిగా ఉన్నార‌నే క‌థ‌నాలు మ‌ళ్లీ తెర‌మీదికి వ‌చ్చాయి. కార‌ణం అదే… మంత్రి ప‌ద‌వి పోవ‌డం. ఇటీవ‌ల జ‌రిగిన కేంద్ర‌మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ఆయ‌న్ని ప‌ద‌వి నుంచి త‌ప్పించిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌ట్నుంచీ ద‌త్త‌న్న కాస్త అసంతృప్తిగా ఉన్న‌ట్టే చెబుతున్నారు. ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా నిర్వ‌హించిన అలయ్ బ‌ల‌య్ లో కూడా ఇదే అంశ‌మై ప్ర‌ముఖ నేత‌లంద‌రూ ద‌త్తన్న‌ను ఓదార్చారు. అనుభ‌వ‌జ్ఞుడైన నాయ‌కుడికి ఇచ్చే గౌర‌వం ఇదా అన్నారు! స‌రే, జ‌రిగిందేదో జ‌రిగింది. ఇంత‌కీ ద‌త్త‌న్న క్రియాశీల‌త‌ను త‌గ్గించాల‌ని అనుకోవ‌డం వెన‌క పార్టీ అధిష్టానానికి కూడా ఏదో ఒక వ్యూహం ఉండి ఉంటుంది క‌దా! ఇప్పుడు దాని గురించే పార్టీలో చ‌ర్చ జ‌రుగుతోంద‌ని స‌మాచారం.

ప‌నితీరు బాలేద‌న్న కార‌ణంతోనే ద‌త్త‌న్న‌ను మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పించారు. అంటే, సికింద్రాబాద్ పార్ల‌మెంట‌రీ స్థానం నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో కొత్త‌వారికి అవ‌కాశం ఇవ్వ‌బోతున్న సంకేతాల‌ను కూడా భాజ‌పా అధినాయ‌క‌త్వం ఇచ్చిన‌ట్టే అనేది కొంద‌రి విశ్లేష‌ణ‌! దీంతో తెలంగాణ భాజ‌పా పార్టీ వ‌ర్గాల్లో మొద‌లైన చ‌ర్చ ఏంటంటే… వ‌చ్చే ఎన్నిక‌ల్లో సికింద్రాబాద్ నుంచి ఎవ‌రు ప్రాతినిధ్యం వ‌హిస్తార‌ని. ఎన్నిక‌లు నాటికి ద‌త్త‌న్న క్రియాశీల రాజ‌కీయాల నుంచి త‌ప్పుకునే అవ‌కాశం ఉంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో సికింద్రాబాద్ స్థానం కోసం భాజ‌పా నేత‌ల్లోనే పోటీ ఉండ‌బోయేట్టుగా క‌నిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్ల‌మెంటుకు వెళ్లాల‌నేది పార్టీ అధ్య‌క్షుడు కె. లక్ష్మ‌ణ్ ల‌క్ష్యంగా కొంద‌రు చెబుతున్నారు. అందుకే, ద‌త్త‌న్న‌కు మంత్రి ప‌ద‌వి పోయిన ద‌గ్గ‌ర నుంచి ముంద‌స్తుగా సికింద్రాబాద్ వ్య‌వ‌హారాల‌పై కాస్త ప్ర‌త్యేక శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తున్న‌ట్టు కొంత‌మంది చెబుతున్నారు.

ఎమ్మెల్యే కిష‌న్ రెడ్డికి కూడా సికింద్రాబాద్ పై ఆస‌క్తి పెరుగుతున్న‌ట్టు స‌మాచారం! ఆయ‌న కూడా జాతీయ స్థాయి రాజ‌కీయాల్లోకి వెళ్లాల‌ని అనుకుంటున్నార‌ట‌! వీరితోపాటు చింత‌ల రామ‌చంద్రారెడ్డి క‌న్ను కూడా ఇదే పార్ల‌మెంట‌రీ నియోజ‌క వ‌ర్గంపై ఉంద‌ని అంటున్నారు. మొత్త‌మ్మీద‌, ద‌త్త‌న్న‌కు మంత్రి ప‌ద‌వి పోవ‌డంతో పార్టీలో అంత‌ర్గ‌తంగా స‌మీక‌ర‌ణాలు ఇలా మారుతూ ఉన్నాయి. సికింద్రాబాద్ నియోజ‌క వ‌ర్గానికి ద‌త్త‌న్న వారసులుగా ఎవ‌రు బ‌రిలోకి దిగుతార‌నే చ‌ర్చ మొద‌లైపోయింది. విచిత్రం ఏంటంటే… తాను క్రియాశీల రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటున్నానని ఇంకా ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌నా ద‌త్త‌న్న చేయ‌లేదు. కానీ, ద‌త్త‌న్న వార‌సులు ఎవ‌ర‌నే చ‌ర్చ ఆ పార్టీ వ‌ర్గాల్లోనే మొద‌లు కావ‌డం, కొంత‌మంది నేత‌లు సికింద్రాబాద్ పై ప్ర‌త్యేక దృష్టి పెడుతూ ఉండటం విశేషం!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com