ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ యాజమాన్యంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈగ వాలకుండా చూస్తూండటం వివాదాస్పదమవుతోంది. అత్యంత ఘోర విషాదానికి పరిశ్రమ యాజమాన్య నిర్లక్ష్యమే స్పష్టమైన కారణం అని తెలుస్తున్నప్పటికీ.. ఘటన జరిగిన రోజు సాయంత్రం.. ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పోలీసులు ఎఫ్‌ఐఆర్‌తోనే తమ పని అయిపోయిందన్నట్లుగా ఉన్నారు. అదే సమయంలో ప్రభుత్వం విచారణ పేరుతో ఓ కమిటీని నియమించి.. ఏకంగా నెల రోజులు గడువు ఇచ్చేసింది. మరో వైపు ఎన్జీటీ కూడా ఓ కమిటీని నియమించినా.. పది రోజుల్లోనే నివేదిక సమర్పించాలని ఆదేశించింది. యాజమాన్యంపై ఏపీ సర్కార్ చూపిస్తున్న సానుకూలత.. జాతీయ మీడియాలో సైతం చర్చనీయాంశమవుతోంది.
పన్నెండు మంది చనిపోవడానికి కారణమైన పరిశ్రమ యాజమాన్యంపై 48 గంటలలు గడిచినా ఏపీ సర్కార్ చిన్న చర్య కూడా తీసుకోకపోవడం ఏమిటన్నదానిపై విస్తృతమైన చర్చ లు నిర్వహిస్తున్నారు. తొలి రోజుల.. ముఖ్యమంత్రి జగన్ సలహాదారులు.. జాతీయ మీడియాతో మాట్లాడేందుకు వచ్చి.. సమాధానం చెప్పలేక వెళ్లిపోయారు. తర్వాత ఎవరూ… జాతీయ మీడియాకు సమాధానం ఇచ్చేందుకు సాహసించడం లేదు. అందరూ.. చర్యలు ఎందుకు తీసుకోవడం లేదనే ..ఒకే ప్రశ్న అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విపక్షాలు కూడా.. ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంతో.. ప్రభుత్వ పెద్దలకు సంబంధాలు ఉండబట్టే.. వదిలేస్తున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు.
పెను విషాదానికి కారణమైన పరిశ్రమపై చిన్న చిన్న కేసులు పెట్టడం ఏమిటని.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్విట్టర్‌లో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరో వైపు.. పరిశ్రమ యాజమాన్యం మరింత ధీమాగా ఉంది. ప్రభుత్వంతో కలిసి పని చేస్తామంటూ ప్రకటన చేసింది. ఘటన జరగడం దురదృష్టకరమని .. ఘటనపై సాంకేతిక నిపుణులు, ప్రభుత్వంతో కలిసి విచారణ చేస్తామని చెప్పుకుంది. బాధితులను ఆదుకునేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది.. బాధితుల మెడికల్ అవసరాల కోసం కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చింది.
బాధిత కుటుంబాలను ఆదుకుంటామని .. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం పనిచేస్తామని ఆఫర్ ఇచ్చింది. అసలు తప్పు ఎక్కడ జరిగిందో స్పష్టంగా తెలుస్తున్నా… ప్రజలకు తాయిలాలు ఇచ్చి.. సంతృప్తి పరుద్దామనే ఆలోచనే.. అటు ప్రభుత్వం.. ఇటు పరిశ్రమ చేస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.