ప్రత్యేక హోదా, రైల్వేజోన్ హామీల అమలుపై తెదేపా, భాజపాలు ఆడుతున్న దాగుడు మూతలు చూసి విసుగొస్తోందని పవన్ కళ్యాణ్ చెప్పిన మాట ప్రజాభిప్రాయానికి అద్దం పట్టింది. పార్లమెంటు సమావేశాలు ముగిసిన తరువాత ప్రత్యేక హోదాపై నిర్దిష్టమైన ప్రకటన చేస్తామని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో ప్రకటించారు కానీ ఇంతవరకు కేంద్రం ఎటువంటి ప్రకటన చేయలేదు. రాష్ట్రంలో దానిపై వేడి తగ్గడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని గురించి మాట్లాడటం లేదు. పవన్ కళ్యాణ్ వచ్చి గట్టిగా వాటిని నిలదీశారు కనుక మళ్ళీ ఇప్పుడు దాని గురించి తెదేపా, భాజపా నేతలు మాట్లాడటం మొదలుపెట్టారు.
తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యేక రాయలసీమ ఉద్యమానికి కూడా సిద్దపడిన టీజీ వెంకటేష్, రాజ్యసభ సీటు ఇచ్చేసరికి చల్లబడిపోయి తెదేపాకి అనుకూలంగా పాట పాడుతున్నారిప్పుడు. మొన్న శుక్రవారం విశాఖ వచ్చినప్పుడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ప్రత్యేక హోదా, రైల్వేజోన్ ఈయవలసిన బాధ్యత కేంద్రప్రభుత్వానిదే. ఒకవేళ ఆ రెండు హామీలని నిలబెట్టుకోకపోతే, జి.వి.ఎం.సి. ఎన్నికలలో మేము భాజపాతో కలిసి పోటీ చేయము. కనుక ఎన్నికలోగానే ఆ హమీలని కేంద్రప్రభుత్వం నిలబెట్టుకోవాలి లేకుంటే అదే నష్టపోతుంది. విశాఖ భాజపా ఎంపి కంబంపాటి హరిబాబు చాలా మంచి వ్యక్తి. కానీ ఈ హామీలను అమలుచేయాలని తమ అధిష్టానంపై గట్టిగా ఒత్తిడి చేయలేకపోతున్నారు,” అని టీజీ వెంకటేష్ అన్నారు.
ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలకి చిత్తశుద్ధి లేదనే సంగతి స్పష్టం అవుతూనే ఉంది. అందుకే ఈవిధంగా ప్రజలని మభ్యపెడుతూ రోజులు దొర్లించేస్తున్నాయి. రాష్ట్రానికి ఇచ్చిన హామీలని ఏవిధంగా సాధించుకోవాలని ఆలోచించకుండా తెదేపా, భాజపాలు ఒకదానినొకటి నిందించుకొంటూ మళ్ళీ కలిసి సాగుతూనే ఉన్నాయి.
జి.వి.ఎం.సి. ఎన్నికలలో ఆ రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయా లేకపోతే వేర్వేరుగా పోటీ చేస్తాయా అనేది ప్రజల సమస్య కాదు. ప్రత్యేక హోదా, రైల్వేజోన్ సాదిస్తాయా లేదా అనేదే ముఖ్యం. అవి సాధించనప్పుడు ప్రజలు భాజపాని శిక్షించి, తెదేపాని మాత్రం ఎందుకు క్షమించాలి? ప్రజలని మభ్యపెడుతున్నందుకు దానికీ గుణపాఠం నేర్పడం తధ్యం. ఈ సంగతి తెదేపాకి కూడా తెలిసే ఉంటుంది కానీ తెలియనట్లు నటిస్తూ తప్పంతా భాజపాదే అన్నట్లుగా మాట్లాడుటోంది. అధికారంలో ఉన్నప్పుడు ఏ పార్టీ అయినా ప్రజలని మభ్యపెట్టాలని ప్రయత్నిస్తే అప్పుడు వారేమీ చేయలేకపోవచ్చు. కానీ ఎన్నికల సమయంలో తప్పకుండా తగిన విధంగా బుద్ధి చెపుతారని 2014ఎన్నికలోనే నిరూపించారు. కనుక ఇప్పటికైనా తెదేపా కూడా మేల్కొనడం మంచిది.