తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సికింద్రాబాద్ సెంటిమెంట్ ఆయుధంగా మారింది. సికింద్రాబాద్ కు ప్రస్తుతం మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ హోదా లేదు. పదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో బీఆర్ఎస్ కూడా అలాంటి ఆలోచన చేయలేదు. పది జిల్లాలను 33 జిల్లాలుగా పునర్విభజించినప్పుడు,పెద్ద ఎత్తున కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఏర్పాటు చేసినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాని, కేటీఆర్‌కు కానీ ఈ ఆలోచనరాలేదు.
నాడు పరిపాలనా సౌలభ్యం పేరుతో అనేక చిన్న జిల్లాలను ఏర్పాటు చేసిన కేసీఆర్ ప్రభుత్వం, చారిత్రక ప్రాధాన్యత కలిగిన సికింద్రాబాద్‌ను మాత్రం విస్మరించింది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తరుణంలో అదే అంశాన్ని సెంటిమెంట్‌గా మార్చి ఉద్యమించడం అనేది ప్రజల్లో ప్రాంతీయ విభేదాలను రేకెత్తించే ప్రయత్నంగా కనిపిస్తోంది. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే క్రమంలో సికింద్రాబాద్ నుంచి జిల్లా, కార్పొరేషన్లు తీసేసతున్నట్లుగా చేస్తున్న ప్రచారం, సెంటిమెంట్ పాలిటిక్స్ అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి.
సికింద్రాబాద్ లాంటి మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో ప్రజలు కోరుకునేది మెరుగైన మౌలిక సదుపాయాలు, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం ,జీవన ప్రమాణాల మెరుగుదల. వీటిపై దృష్టి పెట్టకుండా, కేవలం జిల్లా , కార్పొరేషన్ హోదా పేరుతో భావోద్వేగాలను రెచ్చగొట్టడం వల్ల రాజకీయ ప్రయోజనం కలగవచ్చు కానీ, సామాన్యుడికి వచ్చే లాభం శూన్యం. కానీ ప్రస్తుతానికి ఇదే రాజకీయం సికింద్రాబాద్ చుట్టూ నడుస్తోంది.
