ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ కెంజుట్సులో పవన్ కళ్యాణ్‌కు లభించిన అధికారిక ప్రవేశం , ఫిఫ్త్ డాన్ గుర్తింపు చాలా మందికి మింగుడు పడటం లేదు. రాజకీయంగా ఆయనను విభేదించేవారు చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. వైసీపీ సానుభూతిపరులు , మీడియా తిరుపతి మెట్లు ఎక్కలేకపోయిన పవన్ కు .. మార్షల్ ఆర్ట్స్ లో ఈ గుర్తింపు ఎలా వచ్చిందని విపరీత అర్థాలు తీస్తున్నారు. అంటే వారికి కెంజుట్సు గురించి కనీస వివరాలు తెలియని అర్థం. అయినా విమర్శించాలి కాబట్టి విమర్శించేస్తున్నారు.
మూడు దశాబ్దాల సాధన ఫలితం
పవన్ కల్యాణ్‌కు వచ్చిన గుర్తింపు రాత్రికి రాత్రి వచ్చినవి కావు. ఇది ఆయన మూడు దశాబ్దాలకు పైగా నిరంతరంగా కొనసాగిస్తున్న మార్షల్ ఆర్ట్స్ సాధన, పరిశోధనలకు దక్కిన అంతర్జాతీయ గుర్తింపు. జపాన్‌కు చెందిన ప్రతిష్టాత్మక ‘సోగో బుడో కాన్రీ కై’ ఈ గౌరవాన్ని ప్రదానం చేసింది. జపాన్ వెలుపల ఒక తెలుగు వ్యక్తికి, అందునా తకేడ షింగెన్ క్లాన్లోకి ప్రవేశం లభించడం అత్యంత అరుదైన విషయం. ఇది కేవలం ఒక సర్టిఫికేట్ కాదు, ఒక యుద్ధ కళాకారుని క్రమశిక్షణకు దక్కిన ప్రపంచ స్థాయి సర్టిఫికేషన్.
తిరుపతి మెట్లకు.. కెంజుట్సుకు సంబంధం ఏమిటి?
తిరుపతి మెట్లు ఎక్కలేకపోయారు అని కొంత మంది చేస్తున్న విమర్శలు వారి మానసిక వికృతానికి సాక్ష్యం. ఈ యుద్ధ కళా నైపుణ్యానికి తిరుపతి మెట్లు ఎక్కడానికి ఎలాంటి సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ గతంలో తిరుమల మెట్లు ఎక్కే సమయంలో ఇబ్బంది పడటానికి ప్రధాన కారణం ఆయనకు ఉన్న తీవ్రమైన వెన్నునొప్పి ,ఆస్తమా సమస్యలు. శారీరక దృఢత్వం వేరు, యుద్ధ కళల్లో ఉండే సాంకేతిక నైపుణ్యం వేరు. కెంజుట్సు అనేది కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదు, అది మానసిక ఏకాగ్రత, కత్తిని తిప్పే వేగం , ప్రాచీన యుద్ధ తంత్రాల కలయిక. అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ, ఆయన తన సాధనను వీడలేదనడానికి ఈ అంతర్జాతీయ పురస్కారమే నిదర్శనం.
పాతబస్తీ అయితే గొప్ప గురువు కాకూడదా?
ఇక ఈ సర్టిఫికేషన్ ఇచ్చింది పాతబస్తీలోని సంస్థ అంటూ చేస్తున్న విమర్శల్లో సగం నిజం, సగం అజ్ఞానం ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఈ అధునాతన శిక్షణను భారతదేశంలో జపాన్ యుద్ధకళల అగ్రగణ్యుల్లో ఒకరైన హాన్షి ప్రొఫెసర్ డాక్టర్ సిద్ధిక్ మహ్మూదీ వద్ద పొందారు. డాక్టర్ మహ్మూదీ కేవలం హైదరాబాద్‌కే పరిమితమైన వ్యక్తి కాదు, ఆయన అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన మార్షల్ ఆర్ట్స్ మాస్టర్. ఒక గొప్ప గురువు ఎక్కడ ఉన్నారనేది ముఖ్యం కాదు, ఆయన వద్ద ఉన్న విద్య ఎలాంటిదనేది ముఖ్యం. ప్రపంచ స్థాయి సంస్థలు ఈ గుర్తింపును ధృవీకరించిన తర్వాత కూడా ప్రాంతీయతను అడ్డుపెట్టుకుని విమర్శించడం వారి అవగాహన రాహిత్యాన్నే సూచిస్తుంది.
పవన్ కళ్యాణ్‌కు లభించిన టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదు ఆయన కేవలం సినిమాల్లో చూపించే విన్యాసాల కోసం ఇచ్చింది కాదు. సినిమాల్లోకి రాకముందే చెన్నైలో కరాటేలో శిక్షణ పొంది, బ్లాక్ బెల్ట్ సాధించారు. రాజకీయ విభేదాల కోసం ఒక వ్యక్తి దశాబ్దాల కృషిని తక్కువ చేసి చూడటం ఆరోగ్యకరమైన ధోరణి కాదు.