పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం భీమవరం డీఎస్పీ జయసూర్యపై బదిలీ వేటు పడింది. ఆయన స్థానంలో నూతన డీఎస్పీగా రఘువీర్ విష్ణు నియమితులయ్యారు. జయసూర్యకు ఇంకెక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని సూచించారు. జయసూర్య వ్యవహారం రెండు నెలల కిందట వివాదాస్పదమయింది. ఆయన పనితీరుపై పలు విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేరును దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఇవి పవన్ దృష్టికి వెళ్లడంతో సమగ్ర విచారణ జరపాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు.
శాంతిభద్రతల పరిరక్షణలో ఎటువంటి రాజీ పడకూడదని, అవినీతి లేదా బాధ్యతారాహిత్యానికి పాల్పడే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. అప్పట్లో ఆయన మంచి అధికారి అంటూ రఘురామ కృష్ణరాజు మాట్లాడారు. అప్పటికి ఆయనపై విచారణ జరుగుతోందని ప్రభుత్వం ప్రకటించింది. కానీ రెండు నెలల వరకూ ఎవరూ పట్టించుకోలేదు. హఠాత్తుగా ఆయనను బదిలీ చేశారు. ప్రభుత్వం ఇక్కడ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లుగా తెలుస్తోంది.
పవన్ కల్యాణ్ ఆరోపించిన వెంటనే బదిలీ చేస్తే.. ఆయనపై అవినీతి ఆరోపణలను నిర్దారించినట్లు అవుతుంది. అదే సమయంలో పవన్ కల్యాణ్ ఆరోపణలపై అంతర్గతంగా విచారణ కూడా చేయించారు. ఆ విచారణలో తప్పు ఉందని తేలి ఉంటే సస్పెండ్ చేసేవారు. కానీ పెద్దగా ఫిర్యాదులు నిరూపితం కాకపోవడంతో బదిలీ మాత్రం చేసినట్లుగా తెలుస్తోంది. సాధారణ బదిలీ లాగానే చేయడంతో డీఎస్పీకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని .. ప్రభుత్వం ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా వ్యవహరించిందని భావిస్తున్నారు.
