కృష్ణా జిల్లా కూడా టీడీపీని ఎందుకు కాదనుకుంది..?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కడప జిల్లా ఎలానో.. టీడీపీకి కృష్ణా జిల్లా అని .. చాలా మంది అనుకుంటారు. వైసీపీ కడప జిల్లా అలాగే ఉంది కానీ. టీడీపీకి కృష్ణా జిల్లా దూరమయింది. ఎందుకిలా జరిగిందని.. టీడీపీ నేతలు… కిందా మీదా పడుతున్నారు. తామేం తక్కువ చేశామని… వారు గొణుక్కుంటున్నారు. కానీ.. కర్ణుడి చావుకు కారణాలనేకం అన్నట్లుగా… టీడీపీ పరాజయానికి కూడా.. అనేక కారణాలు ఉన్నాయి. ఓడిపోయారు కాబట్టి.. ఇంకా అనేకం బయటకు వస్తాయి.

కృష్ణా జిల్లాలో వైసీపీకి టీడీపీ కూడా సాధించలేని విజయం..!

కృష్ణాజిల్లాలో 2014 ఎన్నికల్లో తెలుగుదేశం 11స్థానాలను గెలుపొందింది. గుడివాడ, విజయవాడ పశ్చిమ, నూజివీడు, తిరువూరు, పామర్రు నియోజకవర్గాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఈ సారి వైసీపీ 14 చోట్ల గెలిచింది. కేవలం రెండు స్థానాలను మాత్రమే తెలుగుదేశం గెలుచుకుంది. జయవాడ తూర్పు నుంచి గద్దె రామ్మోహన్ , గన్నవరం నుంచి వల్లభనేని వంశీ వ్యక్తిగత ఈమేజ్‌తోనే గెలుపొందారు. ఎంపీ కేశినాని నాని కూడా.. అంతే. ఎన్టీఆర్ జన్మస్థలమైన కృష్ణాజిల్లాలో తెలుగుదేశం పార్టీ ఇంత ఘోరపరాజయం పాలు కావడం ఇదే మొదటిసారి. 1983 పార్టీ స్థాపన తరువాత కృష్ణాజిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఊహించని పరాభవం ఎదురుకావడంతో ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.

టీడీపీకి వ్యతిరేకంగా సామాజికవర్గాలు ఏకం..!

ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకత, సామాజిక వర్గాల మధ్య వైరుధ్యం, వివిధ వర్గాలు ప్రభుత్వానికి దూరంగా వెళ్లిపోవడం కూడా తెలుగుదేశం పరాజయానికి దారి తీశాయి. 1983నుంచి తెలుగుదేశం పార్టీ గెలుపొందుతున్న నందిగామ నియోజకవర్గంలో వైసీపీ ఘన విజయం సాధించింది. 1983 నుంచి తెలుగుదేశం పార్టీకి ఈ నియోజకవర్గం కంచుకోటగా ఉంది. మైలవరం నుంచి గెలుస్తూ వస్తున్న దేవినేని ఉమ కూడా పరాజయం పాలయ్యారు. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా గెలుస్తుందనుకున్న పెనమలూరు నియోజకవర్గంలో బోడే ప్రసాద్ పై అక్కడ మాజీ మంత్రి పార్దసారధి గెలుపొందడం టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీకి మద్దతుగా ఉండే సామాజిక వర్గం బలంగా ఉన్న ఈ నియోజకవర్గంలో బోడే ప్రసాద్ గెలుపొందుతాడని అందరూ ఊహించారు. కానీ ఆ సామాజికవర్గానికి వ్యతిరేకంగా అందర్నీ ఏకం చేయడంలో వైసీపీ విజయం సాధించిందని.. అక్కడి ఫలితం బట్టి తేలిపోయింది.

ప్రజల్లోకి వెళ్లిన జగన్ హామీలు …!

పట్టిసీమ పధకం ద్వారా కృష్ణాడెల్టాకు నీరందించినప్పటికీ కృష్ణాజిల్లాలో ఆ నీరు ప్రవహించిన నియోజకవర్గాలలో కూడా తెలుగుదేశం గెలవలేకపోయింది. పెనమలూరు, గుడివాడ, అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన, పామర్రు, వంటి నియోజకవర్గాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. దీంతో పాటు గన్నవరం నియోజకవర్గం పోలవరం కుడి కాలువ ద్వారా ఎంతో ప్రయోజనం పొందింది, కానీ, అక్కడ ఎమ్మెల్యే అభ్యర్ధి వల్లభనేని వంశీ అతి కష్టం మీద బయటపడ్డారు. విజయవాడ నగరాన్ని అద్భుతంగా అభివృద్ది చేసిన్పపటికీ ఆ అభివృద్దిని ప్రజలు పట్టించుకోలేదు. పసుపు – కుంకుమ, పెన్షన్లు, కొండల పై ఉండే వారికి పట్టాలు, వేలాది ఇళ్లు నిర్మించి ఇచ్చినప్పటికీ ఓట్లుగా మారలేదు. జగన్ నవరత్నాలలోని స్కూల్ కు పంపించే వారికి సంవత్సరానికి 15వేల రూపాయలు డబ్బులు ఇస్తామని, పేదవారికి ఉచిత విద్య అందిస్తామని, ఐదు లక్షల లోపు ఆదాయం ఉన్న వారందరికీ , 10వేల రూపాయల పైన అయ్యే చికిత్సకు ఉచిత వైద్య సౌకర్యం కల్పిస్తామని, ఇచ్చిన హామీలతో పాటు యువతకు ఉద్యోగవకాశాలు, వీటితో పాటు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలనే ఆలోచన ప్రజల్లోకి బలంగా వెళ్లింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com