ఇండిగో సంస్థ పైలట్ల సంక్షోభం కారణంగా ఏర్పడిన పరిస్థితులతో భారతీయ విమానయానరంగం ఉక్కిరిబిక్కిరి అయింది. దీనికి కారణం డొమెస్టిక్ ఎయిర్ ట్రాఫిక్ లో అ సంస్థదే అరవై ఐదు శాతం వాటా. మిగిలిన సంస్థలన్నీ 35శాతం పంచుకుంటున్నాయి. అంటే ఓ రకంగా ఏకఛత్రాధిపత్యాన్ని ఇండిగో ఏలుతోంది. తక్కువ టిక్కెట్ ధరలు, ఓన్లీ ఎకామనీ ప్రయాణం, ఎక్కడికైనా అందుబాటులో ఉండే సర్వీసులు ఇలా ఇండిగో మార్కెట్లోకి దూసుకెళ్లింది. సంక్షోభం రానంత వరకూ అంతా సాఫీగానే ఉంది.కానీ ఇప్పుడు ఆ సంస్థకు పోటీగా మరిన్ని సంస్థలు ఉండాలన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది.
పోటీ ఉంటేనే ఏ రంగంలో అయినా మెరుగైన సేవలు
వ్యాపార ప్రపంచంలో పోటీ ఉంటేనే మెరుగైన సేవలు అందుతాయి. ప్రస్తుతం క్విక్ కామర్స్ రంగంలో చూసుకుంటే.. జెప్టో, ఇన్ స్టామార్ట్, బ్లింకిట్ అని నాలుగైదు కంపెనీలు రంగంలో ఉన్నాయి. ఒకదానితో ఒకటి పోటీ పడుతూ తక్కువ ధరలకు…క్వాలిటీ వస్తువులు తెచ్చి ఇస్తున్నాయి. అదే జెప్టో ఒక్కటే ఉంటే ఆ సంస్థ కూడా…తమకు ఎదురులేదని సేవల్లో నాణ్యత తగ్గిస్తుంది. సహజంగానే నిర్లక్ష్యం వల్ల అది వస్తుంది. విమానయానరంగంలోనూ అదే కనిపిస్తోంది. ఇండిగో తిరుగులేని పొజిషన్ లో ఉండటం వల్ల సహజమైన నిర్లక్ష్యం వచ్చి పడింది. దాని ఫలితంగానే సంక్షోభం వచ్చి పడింది.
విమానయానరంగంలోకి వచ్చి దివాలా తీసేవాళ్లే ఎక్కువ
మన దేశంలో విమానయానరంగంలో నిలదొక్కుకోవడం అనేది దాదాపుగా అసాధ్యం. ఇండిగో ఒక్కటే కాస్త నిలదొక్కుతుంది. నిన్నామొన్నటిదాకా ప్రభుత్వ రంగంలో ఉన్న ఎయిరిండియా కూడా అప్పులతోనే అమ్మకానికి పోయింది. ఇప్పుడు ఉన్న మిగతా సంస్థలు కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. గత మూడు దశాబ్దాల్లో భారత విమానయాన రంగంలోకి ఆశలతో అడుగుపెట్టి, భారీ నష్టాలతో దివాలా తీసిన లేదా మూతపడిపోయిన సంస్థల సంఖ్య 15కి చేరింది. దేశంలో అతిపెద్ద ప్రైవేటు విమానయాన సంస్థగా ఒకానొక కాలంలో గర్వించిన జెట్ ఎయిర్వేస్ 2019లో రూ.18,000 కోట్లకు పైగా రుణభారంతో దివాలా ప్రక్రియలోకి జారుకుంది. ఐదేళ్ల పోరాటం తర్వాత 2024లో పూర్తిగా లిక్విడేషన్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. అంతకు ముందే, 2012లో విజయ్ మాల్యా నడిపిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రూ.9,000 కోట్ల రుణాలతో దివాలా తీసింది. ఎయిర్ డెక్కన్ను కొనుగోలు చేసిన తర్వాత భారీగా నష్టాలు రావడంతో ఈ రెడ్ బర్డ్ ఆకాశం నుంచి అదృశ్యమైంది. 2023 మే నుంచి గోఫస్ట్..మునుపటి గోఎయిర్ విమానాలు గాల్లో లేవు. రూ.11,000 కోట్లకు పైగా రుణాలతో దివాలా ప్రక్రియలో ఉంది. ఇక ఎయిర్ పెగాసస్ , పారామౌంట్ ఎయిర్వేస్ , ఎయిర్ కార్నివల్ , మోడీలుఫ్ట్ వంటి చిన్న సంస్థలు కూడా ఇంధన ధరలు, పోటీ, రుణభారం కారణంగా ఆకాశం నుంచి క్రాష్ ల్యాండ్ అయ్యాయి. తెలుగువారు పెట్టిన ట్రూజెట్, ఎయిర్ కోస్తా వంటివి కూడా అదే జాబితాలో చేరిపోయాయి.
విమానయానరంగంలో మరిన్ని పెట్టుబడులకు సంస్కరణలు అవసరం
దేశవ్యాప్తంగా ఎయిర్ ట్రాఫిక్ ఇన్ ఫ్రా పెరుగుతోంది. పెద్ద ఎత్తున విమానాశ్రయాలు నిర్మిస్తున్నారు. ఆర్థికంగా మెరుగుపడుతున్న మధ్యతరగతి వర్గం విమాన ప్రయాణాలుకు ఆసక్తి చూపిస్తున్నారు. టైమ్ ఈజ్ మనీ అన్నట్లుగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో విమానయాన రంగంలో మరిన్ని పెట్టుబడులు అవసరమే. కానీ దివాలా తీయడానికే ఈ రంగంలోకి రావాలని ఎవరూ అనుకోరు. అందుకే.. లాభాలు వస్తాయన్నట్లుగా.. సంస్కరణలు చేపట్టి కేంద్రం వారికి భరోసా ఇవ్వాలి. ఇప్పుడే.. ఒకే సంస్థ ఆధిపత్యం తగ్గుతుంది. పోటీ మెరుగుపడి సేవలు కూడా పెరుగుతాయి.
