హెరిటేజ్ పై తప్పుడు ప్రచారం చేస్తోంది జగన్ మోహన్ రెడ్డికి చెందిన మీడియా, సోషల్ మీడియా. హెరిటేజ్ లిస్టెడ్ కంపెనీ. ప్రతి ఒక్క వివరం సెబీకి చెప్పాల్సింది. హర్యానాలో లక్ష రూపాయలు జరిమానా విధించిన విషయం కూడా చెప్పారు. అంతా బహిరంగం. కానీ ఇలా ప్రచారం చేస్తున్న సమయంలోనే అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంపెనీలు ఎందుకు పబ్లిక్ లిస్టింగ్ కు రావు అనే ప్రశ్న సోషల్ మీడియాలో వస్తోంది. జగన్మోహన్ రెడ్డికి పదుల సంఖ్యలో కంపెనీలు ఉన్నాయి. ఒక కంపెనీ నుంచి ఒక కంపెనీని పుట్టించారు. ఈ కంపెనీల్లో ఒక్కటి అయినా హెరిటేజ్‌లా ఎందుకు పబ్లిక్ ఇష్యూకి రాదు ?
హెరిటేజ్‌ది దశాబ్దాల చరిత్ర ఉన్న లిస్టెడ్ కంపెనీ
చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఒక పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ. 1994లో అంటే 32 ఏళ్ల కిందటే స్టాక్ మార్కెట్ లోకి అడుగు పెట్టింది.
సెబీ నిబంధనల ప్రకారం ఈ సంస్థ తన ప్రతి చిన్న లావాదేవీని, చివరకు హర్యానాలో ఎదుర్కొన్న లక్ష రూపాయల పెనాల్టీ వంటి చిన్న విషయాలను కూడా బహిరంగంగా వెల్లడించాల్సి ఉంటుంది. చెప్పింది కూడా. అయితే రాజకీయ లబ్ధి కోసమే జగన్ మీడియా , సోషల్ మీడియా విభాగం ఈ సంస్థపై తప్పుడు ప్రచారం చేస్తోంది. నే స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల వల్ల ధరలు తగ్గినప్పుడు మౌనంగా ఉండి, ధరలు పెరిగినప్పుడల్లా దాని వెనుక ఏదో కుట్ర ఉందంటూ బురద జల్లడం ఈ విద్వేష రాజకీయాల్లో భాగమైంది.
జగన్ కంపెనీలు లిస్టింగ్‌కు రావొచ్చుగా !
దశాబ్దాలుగా పారదర్శకంగా వ్యాపారం చేస్తున్న హెరిటేజ్ లాగా, జగన్ మోహన్ రెడ్డికి చెందిన పదుల సంఖ్యలోని కంపెనీలు ఎందుకు పబ్లిక్ లిస్టింగ్ కు రావు అనే ప్రశ్న తలెత్తుతోంది. జగన్ కు చెందిన భారతి సిమెంట్స్ మినహా, సండూర్ పవర్ వంటి మెజారిటీ సంస్థలు కేవలం ఆస్తుల బదిలీకి, పెట్టుబడుల మళ్లింపునకు వేదికలుగా మారాయే తప్ప, వాటిలో వాస్తవ ఉత్పాదకత లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఒక కంపెనీ నుంచి మరో కంపెనీని పుట్టిస్తూ సాగే ఈ సూట్‌కేస్ కంపెనీల సంస్కృతిని సెబీ వంటి నియంత్రణ సంస్థలు అస్సలు అనుమతించవు. అందుకే జగన్ కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు రావడానికి ధైర్యం చేయవు. జగన్ మోహన్ రెడ్డి కంపెనీలపై ఉన్న అవినీతి ఆరోపణలు కూడా మరో ప్రధాన కారణం. సదరు కంపెనీల్లోకి వచ్చిన పెట్టుబడులు కేవలం క్విడ్ ప్రో కో లంచాలు అని సీబీఐ ఇప్పటికే చార్జ్షీట్లలో పేర్కొంది. ఇలాంటి నేరపూరిత అభియోగాలున్న కంపెనీలను నడుపుతూ, లక్షలాది మంది సామాన్య ఇన్వెస్టర్లు భాగస్వాములుగా ఉన్న ఒక పబ్లిక్ లిస్టెడ్ కంపెనీపై మరకలు వేయడం దుర్మార్గమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నియంత్రణ సంస్థల పర్యవేక్షణలో ఉండే సంస్థలను తక్కువ చేస్తూ, పారదర్శకత లేని సొంత వ్యాపారాలను సమర్థించుకోవడం జగన్ మీడియా ద్వంద్వ నీతికి నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు.
అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఆ కంపెనీలకు ఆదాయాలు, లాభాలు
ఇంకా విశేషం ఏమిటంటే జగన్ రెడ్డి కంపెనీలకు వ్యాపారం, ఆదాయం, లాభాలు అన్నీ జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే వస్తాయి. ఎందుకంటే ఆయన అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రజాధనాన్ని ఆ కంపెనీల్లోకి మళ్లించుకుంటారు. భారతి సిమెంట్స్.. అమ్మకాలు జగన్ అధికారంలోఉన్న ఐదు ఏళ్ల పాటు లెక్కలు చూస్తే ఈ విషయం అర్థమైపోతుంది. ప్రభుత్వం తరపున వాడే సిమెంట్ ఆ కంపెనీదే అయి ఉండేది. ఇక సాక్షి పేపర్ ను ఎలా అమ్ముకున్నారో చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి కంపెనీలు లిస్టింగ్ కు వస్తే.. కనీసం పది మంది షేర్లు కొనేందుకు ఆసక్తి చూపించరు. ఇలాంటి చరిత్ర ఉన్న వారు మచ్చలేని కంపెనీలపై బురద చల్లేందుకు ఏ మాత్రం వెనుకాడకపోవడమే అసలు విషాదం.
