జగన్ పరామర్శలకు ఓ లెక్క ఉన్నట్లుగా కనిపిస్తోంది. లిక్కర్ కేసులో ఎంత మంది సన్నిహితులు అరెస్టు అవుతున్నా వారిని మాత్రం పరామర్శించేందుకు జైళ్లకు వెళ్లడం లేదు. వేచి చూసి చూసి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించడానికి కూడా వెళ్లారు కానీ.. తను చేసిన నేరాలకు జైలుకెళ్లిన మిథున్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి వంటి వాళ్లను పరామర్శించి..ధైర్యం చెప్పేందుకు వెళ్లడం లేదు. ఇంకా తన కోటరీలో సభ్యుడిగా మారిపోయిన చెవిరెడ్డిని కూడా ఆయన గుర్తించడం లేదు.
లిక్కర్ స్కామ్ లో అరెస్టు అవుతున్న వారికి ఆ గతి ఎందుకు పట్టిందో అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి కక్కుర్తి వల్లనే వారంతా జైలు పాలయ్యారు. వారికి ఎంత లాభం జరిగిందో కానీ.. అసలు జైలు పాలవుతోంది మాత్రం వారే. జైలుకెళ్లి పరామర్శిస్తే.. తనను అదోలా చూస్తారని భయపడుతున్నారో లేకపోతే.. ఈ పరిస్థితికి మీరే కారణం అని ముఖం మీదనే నిందిస్తారని భయపడ్డారో కానీ జగన్ పరామర్శల జోలికి పోవడం లేదు.
ఈ అంశంపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. తొందరలో తానే వస్తానని..ఇక పరామర్శలు ఎందుకని ఆయన భావిస్తున్నట్లుగా జోకులేస్తున్నారు. లిక్కర్ స్కామ్ విషయంలో జగన్ రెడ్డి పూర్తి ఆత్మరక్షణ ధరోణిలో ఉన్నారు. చిన్న పిల్లలు చెప్పే చిన్న చిన్న కథలు చెప్పి.. ఎలాగోలా బయటపడదామనుకుంటున్నారు తప్ప.. లాజికల్ గా స్కామ్ జరగలేదని చెప్పడానికి ధైర్యం చేయలేకపోతున్నారు. నిలబడే కేసు కాదని తమను తాము మోసం చేసుకుంటున్నారు.